Begin typing your search above and press return to search.

గ్లోబల్ ట్రెండింగ్‌లో 'మెలోడీ': ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఒంట‌రి జీవితంపై ఆస‌క్తి!

ఆమె ప్రస్తుత రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి గూగుల్‌లో విపరీతంగా శోధించడం ప్రారంభించారు. ఒక దేశ ప్ర‌ధాని ఒంటరిగా ఉండటానికి గల కారణాలేమిటనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

By:  Sivaji Kontham   |   26 May 2026 12:00 AM IST
గ్లోబల్ ట్రెండింగ్‌లో మెలోడీ: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఒంట‌రి జీవితంపై ఆస‌క్తి!
X

అంతర్జాతీయ రాజకీయ వేదికలపైనే కాకుండా సోషల్ మీడియా వేదిక‌లపై కూడా ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని పేరు నిరంతరం మార్మోగుతోంది. ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో మెలోనీ దిగిన ఫోటోలు, వీడియోలు `#మెలోడీ` అనే హాష్‌ట్యాగ్‌తో ప్రపంచవ్యాప్తంగా వైరల్ మీమ్స్‌గా మారాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఇటలీ తొలి మహిళా ప్రధాని అయిన జార్జియా మెలోని వ్యక్తిగత జీవితం, ఆమె ప్రస్తుత రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి గూగుల్‌లో విపరీతంగా శోధించడం ప్రారంభించారు. ఒక దేశ ప్ర‌ధాని ఒంటరిగా ఉండటానికి గల కారణాలేమిటనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

జార్జియా మెలోని గతంలో ఇటాలియన్ టీవీ జర్నలిస్ట్ ఆండ్రియా గియాంబ్రూనోతో సుదీర్ఘకాలం సహజీవనం చేశారు. దాదాపు పదేళ్ల పాటు సాగిన వీరి బంధానికి గుర్తుగా వీరికి 'జినెవ్రా' అనే కుమార్తె కూడా ఉంది. ప్రధానిగా మెలోని బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆండ్రియా త‌న‌తోనే ఉన్నారు. అయితే ఒక దేశ ప్రధాని భాగస్వామిగా ఉంటూనే అత‌డు కొన్ని వివాదాల్లో చిక్కుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఒక అధికారిక కార్యక్రమంలో చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు.. లోపాయికారీ ఆడియో లీకులు ఇటలీ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో.. 2023 అక్టోబర్‌లో జార్జియా మెలోని తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆండ్రియా గియాంబ్రూనోతో తన పదేళ్ల బంధాన్ని ముగించిన‌ట్లు అధికారికంగా ప్రకటించారు. తమ మార్గాలు ఎప్పుడో వేర్వేరుగా మారాయ‌ని .. ఆ విషయాన్ని ఇప్పుడు అంగీకరించే సమయం వచ్చిందని మెల‌నీ స్పష్టం చేశారు. ఒక దేశ ప్రధానిగా తన బాధ్యతలకు, ప్రతిష్టకు భంగం కలగకూడదనే ఉద్దేశంతోనే ఆమె ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తన వ్యక్తిగత జీవితంలోని సమస్యలు దేశ పరిపాలనపై ప్రభావం చూపకుండా మెల‌నీ వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది.

ప్రస్తుతం జార్జియా మెలోని సింగిల్‌గా ఉంటూనే ఇటు దేశ ప్రధానిగా అత్యున్నత బాధ్యతలను, అటు ఒంటరి తల్లిగా తన కుమార్తె జినెవ్రా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇటలీలో సాంప్రదాయ కుటుంబ విలువలను బలంగా సమర్థించే రాజకీయ సిద్ధాంతాలు కలిగిన మెలోని... తన వ్యక్తిగత బంధం విషయంలో తీసుకున్న ఈ స్వతంత్ర నిర్ణయం ఆమె క‌ఠిన‌ వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలిచింది. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్, ట్రెండ్స్ ఎలా ఉన్నా.. తన రాజకీయ చాణక్యంతో గ్లోబల్ లీడర్‌గా ఎదగడంపైనే మెల‌నీ పూర్తిగా దృష్టి సారించారు.

అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన మహిళా నాయకురాలిగా ఎదిగిన మెలోని వ్యక్తిగత జీవితాన్ని, రాజకీయాలను వేరుగా చూస్తూ హుందాతనాన్ని కాపాడుకుంటున్నారు. ప్రధాని మోదీతో ఉన్న వ్యూహాత్మక దౌత్య సంబంధాల కారణంగా భారతీయుల్లోనూ మెల‌నీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ గ్లోబల్ అటెన్షన్ ఆమె అంతర్జాతీయ ఇమేజ్‌ను మరింత పెంచడమే కాకుండా... సమకాలీన రాజకీయాల్లో ఒక శక్తివంతమైన మహిళా ఐకాన్‌గా నిలబెట్టింది.