Begin typing your search above and press return to search.

పెట్స్ కి అనారోగ్యం అయితే యజమానికి లీవ్.. ఎక్కడో తెలిస్తే షాక్!

ఇప్పటివరకు మన ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాలేకపోతేనే ఆఫీసుల నుంచి సెలవు తీసుకునేవాళ్ళం.

By:  Madhu Reddy   |   7 May 2026 1:00 AM IST
పెట్స్ కి అనారోగ్యం అయితే యజమానికి లీవ్.. ఎక్కడో తెలిస్తే షాక్!
X

ఇప్పటివరకు మన ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాలేకపోతేనే ఆఫీసుల నుంచి సెలవు తీసుకునేవాళ్ళం. కానీ, మనల్ని ప్రాణంగా ప్రేమించే పెంపుడు జంతువుల కోసం కూడా పెయిడ్ లీవ్ ఇచ్చే కొత్త చట్టాన్ని ఇటలీ అమల్లోకి తెచ్చింది. ప్రపంచంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి దేశంగా ఇటలీ రికార్డు సృష్టించింది. జంతువుల పట్ల చూపిస్తున్న ఈ మానవత్వాన్ని చూసి పెట్ లవర్స్ అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పెట్ కోసం సెలవు.. జీతం కట్ అవ్వదు!

ఇటలీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, ఎవరైనా ఉద్యోగి తన పెంపుడు జంతువు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు దాన్ని చూసుకోవడానికి సెలవు తీసుకోవచ్చు. ఇలా ఏడాదికి మూడు రోజుల వరకు అత్యవసర సెలవులను పొందే అవకాశం ఉంటుంది. అయితే, దీనికోసం వెటర్నరీ డాక్టర్ నుంచి సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఆ జంతువుకు తప్పనిసరిగా మైక్రోచిప్ ఉండి, ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ అయి ఉండాలి.

ఈ చట్టం వెనుక ఒక ఆసక్తికర కేసు:

ఈ మార్పు ఒక్కరోజులో రాలేదు. 2017లో రోమ్‌లో జరిగిన 'కుకియోలా' అనే కేసు దీనికి పునాది వేసింది. ఒక యూనివర్సిటీలో పనిచేసే మహిళ తన ఇంగ్లీష్ సెట్టర్ కుక్కకు ఆపరేషన్ జరిగినప్పుడు సెలవు తీసుకుంది. ఆ సెలవుకు జీతం ఇవ్వాలని ఆమె కోర్టుకు వెళ్ళింది. జంతువులను బాధలో వదిలేయడం నేరమని, వాటిని కాపాడుకోవడం ఒక చట్టబద్ధమైన బాధ్యత అని ఆమె లాయర్లు వాదించి గెలిచారు. ఆ తీర్పు ఆధారంగానే ఇప్పుడు ఈ అధికారిక చట్టం వచ్చింది.

జంతువులంటే కేవలం వస్తువులు కాదు:

ఇక చాలా దేశాల్లో పెంపుడు జంతువులను ఇప్పటికీ కేవలం ఓ ప్రాపర్టీ గానే చూస్తారు. కానీ ఇటలీ మాత్రం ఆ పాత ఆలోచనలను మార్చేసింది. పెంపుడు జంతువులు కూడా కుటుంబ సభ్యులే అని, వాటికి జబ్బు చేసినప్పుడు యజమాని దగ్గర ఉండి సేవ చేయడం ఒక సామాజిక బాధ్యత అని ఈ చట్టం చాటి చెబుతోంది. ఇది కేవలం పర్సనల్ ఛాయిస్ మాత్రమే కాదని, ఒక బాధ్యత అని ప్రభుత్వం గుర్తించింది.

పెట్ లవర్స్‌కు పెద్ద ఊరట:

పెంపుడు జంతువులను పెంచుకునే వారికి ఇది ఒక గొప్ప వరం. వాటిని హాస్పిటల్‌కు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు లేదా వాటికి బాగోలేనప్పుడు ఆఫీస్ పనుల వల్ల చాలా మంది ఒత్తిడికి గురవుతుంటారు. ఈ చట్టం వల్ల ఆ టెన్షన్ ఉండదు. ఇక ఆఫీస్ ఇన్ బాక్స్ నిండిపోతుందేమో అని భయం లేకుండా, ప్రశాంతంగా తమ ప్రాణానికి ప్రాణమైన మూగజీవాలను కాపాడుకోవచ్చు.

మానవత్వానికి కొత్త నిర్వచనం:

ఇటలీ తీసుకున్న ఈ అడుగు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మనుషులే కాదు, భూమి మీద ఉన్న ప్రతి జీవికీ విలువుంటుందని ఈ చట్టం నిరూపించింది. ఇక మిగిలిన దేశాలు కూడా ఇటలీ బాటలో పయనించాలని జంతు ప్రేమికులు కోరుకుంటున్నారు. మన పెంపుడు జంతువులకు కూడా గౌరవం, రక్షణ కల్పించడంలో ఇటలీ అందరికీ రోల్ మోడల్‌గా నిలిచింది.

జీవం ఉన్న ప్రతి దాన్ని ప్రేమించడం, ఆదుకోవడమే నిజమైన సభ్యత. ఇటలీ తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్ధంగా మాత్రమే కాదు, మానవతా దృక్పథంతో కూడా ఆలోచింపజేస్తోంది.