ఐటీ నజర్: 2024 ఎన్నికల్లో.. వైసీపీకి వ్యాపారుల మద్దతు!
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. కేంద్ర ఐటీ అధికారులు మంగళవారం సోదాలు చేపట్టాయి.
By: Garuda Media | 7 Oct 2025 6:23 PM ISTరెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. కేంద్ర ఐటీ అధికారులు మంగళవారం సోదాలు చేపట్టాయి. 25 ప్రాంతాల్లోని వ్యాపారుల దుకాణాలు, ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. సాధారణంగా తనిఖీలు అంటే.. బడా సినిమా నిర్మాతలు, నటుల ఇళ్లపై నే జరుగుతాయి. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తొలిసారి పప్పు ధాన్యాల వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాలపై జరుగుతుండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అయితే.. తీగ లాగితే డొంక కదిలినట్టుగా.. ఈ మూలాలు వైసీపీ చుట్టూ తిరుగుతున్నాయి.
ఐటీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. వ్యాపార వర్గాలు.. గత 2024 ఎన్నికల్లో వైసీపీకి పరోక్షంగా సాయం చేశారని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో నిధులు సమకూర్చేందుకు.. వారు ముందుగా నే టెండర్లు దక్కించుకుని.. పప్పు ధాన్యాలను పౌరసరఫరాల శాఖ నుంచి కొనుగోలు చేయకుండా.. ఆ సొమ్మును వైసీపీ తరఫున ఎన్నికల్లో ఖర్చు చేశారన్నది ప్రధాన ఆరోపణ. అయితే.. ఇలా జరగడం ఇదే తొలిసారి అని కూడా అంటున్నారు.
అయితే.. అప్పట్లో నిధుల వినియోగంపై కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ఠమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం.. కూటమి పార్టీలు కూడా.. ఎక్కడికక్కడ నిఘా పెట్టడంతో నేరుగా వైసీపీ నాయకులు సొమ్ములు చేరవేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అనుకూల వర్గాల ద్వారా సొమ్ములు బట్వాడా చేయించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వ్యాపారులను కూడా వాడుకున్నారన్నది తాజాగా ఐటీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. వారి ద్వారా.. ముందుగానే టెండర్లు వేయించి.. ఆ సొమ్మును ప్రజలకు చేరేలా చేశారని అంటున్నారు.
ఇక, వ్యాపారుల బ్యాంకు ఖాతాల నుంచి కూడా.. నగదు రూపంలో భారీ ఎత్తున విత్ డ్రా చేశారన్న విషయం కూడా తాజాగా వెలుగు చూసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాల్(పప్పు) అసోసియేషన్ ఉంది. ఈ సంఘం ద్వారానే అసలు కార్యక్రమం నడిచిందన్న వాదనా వినిపిస్తోంది. ప్రస్తుతం 25 ప్రాంతాల్లో జరుగుతున్న సోదాలు.. ఇరు రాష్ట్రాల్లోనూ చర్చకు దారితీశాయి. మరి చివరకు ఏం తేలుతుందో చూడాలి. ఇది 2024లో జరిగినట్టు అధికారులు చెబుతున్నారు.
