Begin typing your search above and press return to search.

విదేశాల నుంచి 'డబ్బుల మెసేజ్' పడిందా? ఐటీ శాఖ 'హార్ట్ బీట్' పెంచేస్తోంది జాగ్రత్త!

మొబైల్‌ లో నోటిఫికేషన్ ట్రింగ్ అని మోగడం.. డిస్ప్లే మీద 'యువర్ ఎకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ విత్...' అంటూ క్రెడిట్ మెసేజ్ పడగానే వచ్చే ఆ సంతోషమే వేరు.

By:  A.N.Kumar   |   19 Aug 2026 10:32 AM IST
విదేశాల నుంచి డబ్బుల మెసేజ్ పడిందా? ఐటీ శాఖ హార్ట్ బీట్ పెంచేస్తోంది జాగ్రత్త!
X

మొబైల్‌ లో నోటిఫికేషన్ ట్రింగ్ అని మోగడం.. డిస్ప్లే మీద 'యువర్ ఎకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ విత్...' అంటూ క్రెడిట్ మెసేజ్ పడగానే వచ్చే ఆ సంతోషమే వేరు. అది కూడా విదేశీ కరెన్సీ రూపంలో ఖాతాలో పడితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అయితే ఇప్పటివరకైతే ఆ బ్యాంక్ మెసేజ్ చూసి మురిసిపోవడం వరకే మన పని. కానీ ఇకపై అలా సైలెంట్‌గా ఉండిపోదామంటే కుదరదండోయ్.. విదేశాల నుంచి ఖాతాలోకి పడ్డ ప్రతి రూపాయికి సంబంధించిన సమగ్ర కథాకమామిషు మొత్తం రెడీ చేసి పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే విదేశాల నుంచి వస్తున్న నిధుల ప్రవాహంపై ఆదాయపు పన్ను శాఖ తన టెక్నాలజీ ఆయుధాలకు మరింత పదును పెట్టి నిఘా వల విసిరింది.

ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సంగతి ఏమిటంటే.. దేశంలో కొందరు మహానుభావులు భలే విచిత్రమైన ఐడియాలు వేస్తుంటారు. పేరేమో చూడటానికి ఎదో భారీ మల్టీ నేషనల్ కంపెనీలా ధీటుగా ఉంటుంది.. తీరా చూస్తే గ్రౌండ్‌లో చిన్న గది కానీ అసలు కార్యాలయ చిరునామా కానీ ఉండదు. చేసే వ్యాపార కార్యకలాపాలు సున్నా, కానీ విదేశాల నుంచి వచ్చే నిధులు మాత్రం కోట్లలో విరుచుకుపడతాయి. ఇలాంటి విచిత్రమైన బిజినెస్ మోడల్స్, అసలు వ్యాపారమే లేని నకిలీ సంస్థల వ్యవహారాలు చూసి ఐటీ శాఖకు సైతం దిమ్మతిరిగిపోయింది. దాంతో లేటెస్ట్ డేటా అనాలిసిస్, గ్రౌండ్ ఇంటెలిజెన్స్‌ను రంగంలోకి దించి అసలు వ్యాపారమే లేనప్పుడు విదేశాల నుంచి ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి బాస్ అంటూ అకౌంట్ బుక్స్ దుమ్ము దులపడం ప్రారంభించింది.

ఇక ఈ కథలో కేవలం నిధులు పొందే సంస్థలే కాదు.. వీరికి వెనక ఉండి సర్టిఫికెట్లు ఇచ్చే ప్రొఫెషనల్స్‌కు కూడా ఐటీ శాఖ గట్టిగానే షాక్ ఇస్తోంది. ఫారమ్ 15సిబి వంటి సర్టిఫికెట్ల జారీ విషయంలో క్లయింట్ చెప్పాడు కాబట్టి కళ్ళు మూసుకుని సంతకం పెట్టేశాం అంటే కుదరదని స్పష్టం చేసింది. నిధుల మూలాలను సమగ్రంగా పరిశీలించకుండా న్యాయబద్ధతను సరిచూసుకోకుండా సర్టిఫికెట్లు ఇస్తే ఆ ప్రొఫెషనల్స్ కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఇకపై క్లయింట్ చెప్పిన మాటలను బ్లైండ్‌గా నమ్మే పద్ధతికి పూర్తిగా చెక్ పడినట్లే.

అయితే అలా అని విదేశాల్లో ఉన్న పిల్లలు స్వదేశంలోని తమ తల్లిదండ్రులకు పంపే ప్రేమపూర్వక సహాయానికి ఐటీ ఆఫీసర్లు వచ్చి తలుపు తడతారని భయపడాల్సిన పనిలేదు. అమెరికా, గల్ఫ్ లేదా బ్రిటన్ వంటి దేశాల్లో కష్టపడి సంపాదించి కుటుంబానికి పంపే సొమ్మును ఐటీ శాఖ అనుమానంగా చూడదు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, హావాలా మార్గాలు, నకిలీ షెల్ కంపెనీల పేరుతో విదేశీ సొమ్మును డార్క్ రూట్లలో భారత్‌లోకి మళ్లించే పెద్ద తిమింగలాలపైనే ఈ విచారణ ఫోకస్ అంతా ఉంది.

ఏది ఏమైనా ఇకపై విదేశాల నుంచి రూపాయి వచ్చినా డాలర్ వచ్చినా.. అది ఎవరు పంపారు, ఎందుకు పంపారు, ఎక్కడ ఖర్చుపెడుతున్నారు అనే పూర్తి స్క్రిప్ట్ మన దగ్గర సిద్ధంగా ఉండాలి. ఖాతాలోకి డబ్బులు పడటం ఎంత ఈజీయో.. ఐటీ శాఖ అడిగినప్పుడు ఆ డబ్బు పుట్టుపూర్వోత్తరాల కథను కన్విన్సింగ్‌గా చెప్పడం అంత ఈజీ కాదన్నమాట..