Begin typing your search above and press return to search.

చంద్రుడిపైకి భారత వ్యోమగాములు!

ఇస్రో తన అత్యంత రద్దీ సమయాల్లో ఒకదానికి సిద్ధమవుతోందని చైర్మన్ వి నారాయణన్ అన్నారు.

By:  Raja Ch   |   16 Nov 2025 8:00 PM IST
చంద్రుడిపైకి భారత వ్యోమగాములు!
X

తాజాగా పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇస్రో ఛైర్మన్ వి నారాయణన్ పలు కీలక విషయాలు వెళ్లడించారు. ఇందులో భాగంగా... రాబోయే కొన్ని రోజుల్లో ఇస్రోకు భారీ ప్రణాళికలు ఉన్నాయని.. ఇక రాబోయేది అంతా బిజీ సమయమేనని.. ఈ ఏడాది 7 ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నామని చెబుతూ... గగన్ యాన్ విషయంలో నెలకొన్న సందేహాలపైనా స్పష్టత ఇచ్చారు. వాటి వివరాలు ఇప్పుడు చూద్దామ్!

అవును... భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష నౌక 2027 నాటికి షెడ్యూల్ చేయబడిందని.. అందులో మార్పు లేదని.. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో మరో ఏడు ప్రయోగాలను ప్లాన్ చేయడంతో.. ఇస్రో తన అత్యంత రద్దీ సమయాల్లో ఒకదానికి సిద్ధమవుతోందని చైర్మన్ వి నారాయణన్ అన్నారు. సైన్స్ & టెక్నాలజీ సామర్ధ్యంలో వేగవంతమైన స్కేలింగ్ దశకు ఇస్రో సిద్ధమవుతోందని తెలిపారు.

చంద్రుడి నుంచి మట్టి నమూనాలు!:

ఇదే సమయంలో చంద్రయాన్-4 మిషన్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పిన ఇస్రో చీఫ్... 2028 నాటికి చంద్రుడి నుంచి మట్టి నమునాలను భూమికి తీసుకొచ్చే లక్ష్యాన్ని పూర్తిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు! ఈ క్రమంలో చంద్రుడి నుంచి మట్టి తీసుకొచ్చే సామర్థ్యం ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనలాకే ఉండగా.. త్వరలో ఇస్రో కూడా సాధిస్తుందని అన్నారు.

జాబిల్లి దక్సిణ ధ్రువం దగ్గరి మంచు!:

అదేవిధంగా... చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గరి మంచును అధ్యయనం చేయడం కోసం జపాన్ అంతరిక్ష సంస్థతో కలిసి చేపట్టిన లూపెక్స్ మిషన్ కూడా తమ ప్రణాళికల్లో ఉందనీ తెలిపారు. ఇదే క్రమంలో 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్ర నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. దీంతో... అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసిన మూడో దేశంగా భారత్ నిలవనుంది.

చంద్రుడిపైకి భారత వ్యోమగాములు!:

ఇదే క్రమంలో... మనుషులతో కూడిన ప్రయోగం ఎప్పటిలాగే 2027 నాటికి చేపట్టే ప్రణాళికల్లో మార్పు లేదని చెప్పిన ఇస్రో చీఫ్... భారత వ్యోమగాములతో కూడిన తొలి యాత్రకు ముందు మూడు మానవరహిత టెస్టింగ్ మిషన్లు జరుగుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో... భారత వ్యోమగాములను చంద్రుడిపైకి పంపి సురక్షితంగా తీసుకొచ్చే కలను 2040 నాటికి సాకారం చేయాలని ప్రధాని మోడీ సూచించినట్లు వెల్లడించారు.

పెరగనున్న ఇండియన్ స్పేస్ ఎకానమీ విలువ!:

ఈ సందర్భంగా... ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారతదేశం వాటా ప్రస్తుతం 2 శాతంగా ఉందని చెప్పిన ఇస్రో చీఫ్... 2030 నాటికి దీనిని 8 శాతానికి పెంచే లక్ష్యంతో ఇస్రో పనిచేస్తోందని అన్నారు. భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 8.2 బిలియన్ డాలర్లుగా ఉందని, 2033 నాటికి 44 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేయగా, ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 630 బిలియన్ డాలర్లుగా ఉందని అన్నారు.