Begin typing your search above and press return to search.

మళ్లీ మొదలుపెట్టిన ఇజ్రాయెల్... 'ఐరాస'కూ షాకిచ్చింది!

ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులతో కలిసి ఆ కార్యాలయంలోని వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. అంతే కాదు ఆ భవనం ఉన్న ఐరాస జెండాను తీసేసి ఇజ్రాయెల్ జెండాను ఉంచాయి.

By:  Raja Ch   |   9 Dec 2025 7:00 PM IST
మళ్లీ మొదలుపెట్టిన ఇజ్రాయెల్... ఐరాసకూ షాకిచ్చింది!
X

వారిపై వారికున్న నమ్మకమో.. అగ్రదేశంతో స్నేహం కూడా ఉందన్న ధైర్యమో తెలియదు కానీ తాను అనుకున్న పని కోసం ఇజ్రాయెల్ ఎంతటి సాహసానికైనా ఒడిగడుతుందని.. ఒక్కసారి పగబడితే పూర్తిగా నాశనం చేసే వరకూ విడిచిపెట్టదని చెబుతుంటారు. గాజా స్ట్రిప్ పై ఆ దేశ సైన్యం చేసిన దాడిని అందుకు తాజా ఉదాహరణగా చూపుతుంటారు. ఈ క్రమంలో పాలస్తీనా శరణార్థులను సైతం ఇజ్రాయెల్ వదిలిపెట్టడం లేదు.

అవును... ఆక్రమిత తూర్పు జెరుసలేంలోని పాలస్తీనా శరణార్థుల కోసం యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యూ.ఎన్.ఆర్.డబ్ల్యూ.ఏ) ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయగా.. దానిపై తాజాగా ఇజ్రాయెల్ దళాలు దాడి చేశాయి. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులతో కలిసి ఆ కార్యాలయంలోని వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. అంతే కాదు ఆ భవనం ఉన్న ఐరాస జెండాను తీసేసి ఇజ్రాయెల్ జెండాను ఉంచాయి.

ఈ చర్యను ఏజెన్సీ కమిషనర్ జనరల్ ఫిలిప్ లజారీ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆయన... ఇజ్రాయెల్ పోలీసులు, మున్సిపల్ అధికారులతో కలిసి షేక్ జర్రాలోని యూ.ఎన్.ఆర్.డబ్ల్యూ.ఏ కాంపౌండ్ లోకి బలవంతంగా ప్రవేశించారని.. ఈ సందర్భంగా అక్కడున్న ఫర్నిచర్, ఐటీ పరికరాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారని.. ఐరాస జెండాను తీసేశారని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించిన ఫిలిప్ లజారీ... ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశమైన ఇజ్రాయెల్ తన బాధ్యతను విస్మరించిందని.. అదేవిధంగా.. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని మండిపడ్డారు.

వాస్తవానికి 2023 అక్టోబరు 7న హమాస్ తమ పౌరులపై జరిపిన దాడుల్లో ఆ సంస్థ ఉద్యోగులు ఉన్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఐరాస సంస్థ తమ దేశంలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని టెల్ అవీవ్ అధికారులు ఆదేశించారు. అప్పటి నుంచి యూ.ఎన్.ఆర్.డబ్ల్యూ.ఏ తన భవనాన్ని ఉపయోగించలేదు. ఇదే సమయంలో టెల్ అవీవ్ ఆరోపణలు ఖండించింది.

కాగా... గాజా అధికారుల ప్రకారం.. ఇజ్రాయెల్ దాడుల్లో మొత్తం 70,365 మంది మరణించగా.. 1,71,058 మంది గాయపడ్డారు. ఎన్నో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ సమయంలో.. యూ.ఎన్.ఆర్.డబ్ల్యూ.ఏ సంస్థ గాజా, వెస్ట్ బ్యాంక్ లోని లక్షలాది మంది పాలస్తీనా శరణార్థులకు పాఠశాల విద్య, ఆరోగ్య సంరక్షణతో పాటు ఆశ్రయం కూడా అందిస్తుంది.

ఏమిటీ ఆక్రమిత తూర్పు జెరుసలేం ప్రాంతం!:

1967లో జోర్డాన్ పై ఇజ్రాయెల్ ఆరు రోజుల యుద్ధం చేసింది. దీని ఫలితంగా ఆ దేశం నుంచి జెరుసలెం నగరం తూర్పు భాగాన్ని స్వాధీనం చేసుకుంది. దీన్నే ఆక్రమిత తూర్పు జెరుసలేం ప్రాంతం అని అంటారు. అయితే.. పాలస్తీనియలు ఈ ప్రాంతాన్ని తమ భవిష్యత్ స్వతంత్ర రాజ్యానికి రాజధానిగా చూస్తుండగా.. ఇజ్రాయెల్ మాత్రం మొత్తం నగరాన్ని తన ఐక్యరాజధానిగా పరిగణిస్తుంది.