ఆఖరుకు అరబ్ పార్టీల చేతుల్లోకి ‘ఇజ్రాయెల్’ అధికారం.. ఎంత గతి పట్టింది?
ఇన్నాళ్లూ రాజకీయం అంతా మాదే అని విర్రవీగిన ప్రధాన నేతలకు ఇప్పుడు అరబ్ పార్టీల కాళ్లు పట్టుకోవాలో.. లేక ముక్కు మూసుకుని సహించాలో తెలియక పిచ్చి పడుతోంది.
By: A.N.Kumar | 28 Oct 2026 10:41 PM ISTఇజ్రాయెల్ రాజకీయం మళ్లీ మొదటికొచ్చింది. పార్లమెంట్లో మొత్తం ఉన్న 120 సీట్లకు గాను.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన 61 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ఏ కూటమికీ దక్కక 'హంగ్' ముసుగు తన్నుకుంది. నెతన్యాహు కూటమికి 53, ఐసెన్‌కోట్ కూటమికి 48 వచ్చి తుమ్మితే ఊడిపోయే పరిస్థితి ఏర్పడితే చివరికి ఎవరూ పెద్దగా పట్టించుకోని అరబ్ పార్టీలు ఏకంగా 19 సీట్ల ఆధిక్యంతో 'కింగ్ మేకర్' సీట్లో కూర్చున్నాయి. "మేము లేకపోతే మీ కుర్చీ కదిలేలా లేదుగా" అంటూ వారు చిరునవ్వులు చిందిస్తుంటే ప్రధాన కూటములకు మాత్రం నోట్లో వెలక్కాయ పడినట్లయింది.
ఇన్నాళ్లూ రాజకీయం అంతా మాదే అని విర్రవీగిన ప్రధాన నేతలకు ఇప్పుడు అరబ్ పార్టీల కాళ్లు పట్టుకోవాలో.. లేక ముక్కు మూసుకుని సహించాలో తెలియక పిచ్చి పడుతోంది. పైకి మాత్రం "ఛఛ.. వాళ్లతో మాకేంటి పొత్తు?" అని బింకాలు పోతున్నా లోలోపల మాత్రం "ఏదో ఒక రకంగా ఆ 61 సంఖ్య దాటితే బాగుణ్ణు" అని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ఇక కుర్చీ కాపాడుకోవడానికి లేదా కొత్తగా ఎక్కడానికి అరబ్ పార్టీలు పెట్టే షరతులకు తల ఊపక తప్పని పరిస్థితి రాబోతోంది. నిన్నటిదాకా పక్కన పెట్టిన పార్టీలే ఇప్పుడు ఇజ్రాయెల్ రాజకీయాల్ని శాసించే రేంజ్‌కు చేరడం నిజంగానే కాలమహిమ..
మరోవైపు దేశ అధ్యక్షుడు మాత్రం "బాబులూ.. దండం పెడతా.. మళ్లీ ఎన్నికలంటూ పెట్టి ప్రజల సొమ్ము తగలేయకండి. ఎవరి కాళ్లు పట్టుకుంటారో ఎవరితో కలుస్తారో మీ ఇష్టం కానీ ఏదో ఒక సర్కారును బండి లాగించండి" అని దండం పెట్టేస్తున్నారు. ఫలితాలు చూస్తుంటే ఇజ్రాయెల్ నేతలకు సొంతంగా సర్కార్ నడిపే యోగం ఉన్నట్లు లేదు.. అందుకే అధ్యక్షుడు కూడా తగ్గిపోమంటున్నారు.
తుది ఫలితాలు వచ్చాక ఏ మహానుభావుడు ఎవరితో జతకడతాడో.. ఈ 'హంగ్' నాటకానికి ఎలా తెరపడుతుందో చూడాలి. లీడ్‌ల లెక్కలే ఈ రేంజ్లో ఉంటే అసలు కథ ముందుంది. ప్రస్తుతానికైతే కింగ్ మేకర్లుగా మారిన అరబ్ పార్టీల దయ.. అధ్యక్షుడి ఆవేదన మధ్య ఇజ్రాయెల్ రాజకీయం ఒక థ్రిల్లర్‌ను తలపిస్తోంది.
ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తదుపరి చర్చలు, కూటముల మధ్య రాజకీయ సంప్రదింపులు కీలకంగా మారనున్నాయి. అరబ్ పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తాయి? అవి ఏవైనా షరతులు విధిస్తాయా? లేక ప్రధాన కూటములు ఇతర పార్టీలతో కలిసి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తాయా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలు లీడ్‌లకు సంబంధించినవే కావడంతో తుది ఎన్నికల ఫలితాల ఆధారంగానే ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వస్తుంది. అప్పటివరకు ఇజ్రాయెల్ రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా మారిన అరబ్ పార్టీల నిర్ణయం.. ప్రధాన కూటముల వ్యూహాలు, అధ్యక్షుడి సూచనలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగనుంది.
