ఇజ్రాయెల్-హమాస్ సీజ్ ఫైర్.. ట్రంపే కుదిర్చాడా..?
ఈ ఒప్పందం పటిష్ఠంగా కొనసాగేందుకు అంతర్జాతీయ హామీలు, యునైటెడ్ నేషన్స్ పర్యవేక్షణ కీలకం కానుంది. కేవలం సంతకాలతో కాదు.. ఆచరణలో నిజమైన శాంతి కోసం రెండు పక్షాలు కూడా నిరంతరం కృషి చేయాలి.
By: Tupaki Political Desk | 9 Oct 2025 1:24 PM ISTమధ్యప్రాచ్యంలో ఏళ్లుగా కొనసాగుతున్న రక్తపాతం, విధ్వంసం, అనిశ్చితికి తెరపడనుంది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం తొలి దశపై సంతకాలు జరగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయ రాజకీయాల్లో ముఖ్య మలుపుగా భావించవచ్చు. ఇది కేవలం రెండు పక్షాల మధ్య తాత్కాలిక శాంతి కాకుండా, గాజా ప్రాంత భవిష్యత్తును నిర్ణయించే ప్రయత్నంగా కూడా చూడవచ్చు. ఈ ఒప్పందంలో ప్రధానంగా గాజాలో బంధీగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల విడుదలకానున్నారు. అలాగే హమాస్ నిర్బంధంలో ఉన్న మరికొంత మంది సైనికులను తిరిగి పంపడం వంటివి జరగనున్నాయి. ప్రతిగా, ఇజ్రాయెల్ తమ బలగాలను గాజా సరిహద్దు ప్రాంతాల నుంచి వెనక్కు పిలిపించనుంది. ఈ చర్య, పరస్పర విశ్వాసాన్ని పునరుద్ధరించే తొలి ప్రయత్నంగా భావించవచ్చు. ఈ ఒప్పందం పటిష్ఠంగా కొనసాగేందుకు అంతర్జాతీయ హామీలు, యునైటెడ్ నేషన్స్ పర్యవేక్షణ కీలకం కానుంది. కేవలం సంతకాలతో కాదు.. ఆచరణలో నిజమైన శాంతి కోసం రెండు పక్షాలు కూడా నిరంతరం కృషి చేయాలి.
మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు..
ఈ సీజ్ ఫైర్ గురించి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది గొప్ప నిర్ణయం అన్నారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు పరిస్కారం కనుగొనడం గొప్ప విషయం అన్నారు. ట్రంప్ మధ్యవర్తిత్వంపై శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల్లో ఇక శాంతి పూలు పూయాలని ఆకాంక్షించారు.
వ్యూహాత్మక అడుగు
ట్రంప్ ప్రకటించిన ఈ పీస్ ప్లాన్ అమెరికా విదేశాంగ వ్యూహానికి భాగమని చెప్పాలి. మధ్యప్రాచ్య రాజకీయాల్లో తిరిగి తన ఆధిపత్యాన్ని చాటుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఒప్పందం జరిపినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ, దీనివల్ల ఆ ప్రాంత ప్రజలకు ఊరట లభిస్తే, అది ప్రపంచానికే లాభమని చెప్పాలి. సీజ్ ఫైర్ ఒప్పందం తొలి దశ మాత్రమే. హమాస్ మిలిటెంట్ల భవిష్యత్ పాత్ర, గాజా పునర్నిర్మాణం, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు వంటి అంశాలు ఇంకా ముందున్నాయి. యుద్ధం కన్నా ఇరు దేశాలు శాంతిగా మాట్లాడుకోవడమే మంచిది.
శాంతికి నూతన ఆరంభం
గాజా నేతపై పూలు పూయాలంటే తుపాకీ నోరు మూసుకోవాల్సిందే. ఈ సీజ్ ఫైర్ ఆ దిశగా ఒక చారిత్రాత్మక ముందడుగు. ఈసారి శాంతి కేవలం ఒప్పంద పత్రాల్లో కాకుండా ప్రజల మనసుల్లో కూడా రావాలని ప్రపంచం ఆశిస్తోంది. యుద్ధం వల్ల ఎంత నష్టం జరిగిందో ఇరు దేశాలకు తెలిసి రావాలి. శాంతి విలువ ఏపాటితో అర్థం చేసుకోవాలి. గాజాలో నిర్మాణాల అవశేషాలు, నిరాశ్రయులైన వేలాది కుటుంబాలు, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల ఆర్తనాదం ఇవన్నీ ఆ దేశం గుర్తుంచుకోవాలి. ఈ ఒప్పందం కేవలం రాజకీయ పత్రం మాత్రమే కాదు.. అది మానవతకు ఒక కొత్త పాఠం కావాలి.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య నమ్మకం పునరుద్ధరించడానికి ఈ ఒప్పందం తొలి అడుగుగా ఉండొచ్చు. కానీ దీన్ని నిలబెట్టే బాధ్యత కేవలం రాజకీయ నాయకులదే కాదు.. ఆయా దేశాల్లోని పౌరులపై కూడా ఉంది. అంటే.. ద్వేషాన్ని వదిలి, పరస్పర అర్థం చేసుకోవడం మాత్రమే శాశ్వత శాంతికి దారి చూపగలదు. ప్రపంచ శాంతికి వేదికగా అమెరికా ప్రయత్నం కొనసాగుతున్నప్పటికీ, స్థానిక వాస్తవాలను విస్మరించద్దు. గాజా పునర్నిర్మాణం, ఆర్థిక సాయం, విద్యా అవకాశాలు ఇవన్నీ భవిష్యత్తులో స్థిరత్వానికి ఆధారం కావాలి. చరిత్రలో ఎన్నో ఒప్పందాలు కాగితం మీదే మిగిలిపోయాయి. ఈసారి అలా కాకుండా.. ప్రతి గాజా చిన్నారి చిరునవ్వు చూడగల భవిష్యత్తు కోసం ఈ సీజ్ ఫైర్ ఉండాలని ప్రపంచం కోరుకుంటోంది.
