మదురో కిడ్నాప్ తర్వాత ట్రంప్ మరో దేశానికి వార్నింగ్
ఇరాన్ లో నిరసనలు హోరెత్తుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు.
By: A.N.Kumar | 11 Jan 2026 4:31 PM ISTఇరాన్ లో నిరసనలు హోరెత్తుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వారిని అణచివేసే ప్రయత్నం చేస్తోంది. దీంతో ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. `` మమ్మల్ని చంపడం మీకు ఒక ఆటలా ఉంది. మీరు వేటగాళ్లమని, మేము జంతువులమని అనుకుంటున్నారు. మాకు భయం లేదు. మా గుండెల్లో 47 ఏళ్ల భరించలేని నొప్పి దాగి ఉంది. ఇన్నాళ్లూ మీ క్రూరత్వంతో, అధికార బలంతో మా బాధను అణచివేశారు. ఇక ఇది ఆగదు`` ఓ యువకుడు మాట్లాడిని వీడియో వైరల్ గా మారింది.
నిరసనలు ఎందుకు ?
ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ భారీగా పడిపోయింది. దీంతో ధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్యులు కొని తినలేని స్థితి. ప్రభుత్వం ధరలను అదుపులోకి తీసుకురాలేకపోయింది. దీంతో మొదట వ్యాపారుల్లో మొదలైన ఆందోళనలు దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల వరకూ పాకాయి. ఉధృతంగా సాగుతున్నాయి. రియాల్ విలువ పడిపోవడానికి అమెరికా ప్రధాన కారణం. ఇరాన్ పై ఆర్థిక ఆంక్షలు విధించింది. దీంతో పాటు చమురు అమ్మకాలు తగ్గాయి. ఫలితంగా ధరలు అమాంతం పెరిగాయి. సామాన్యులకు తీవ్ర భారంగా మారింది. న్యూక్లియర్ డీల్ లో అమెరికాతో విబేధాలు మొదలైనప్పటి నుంచి రియాల్ విలువ పడిపోవడం మొదలైంది. ఇప్పటికీ కొనసాగుతోంది. వార్షిక ద్రవ్యోల్బణం దాదాపు 40 శాతం ఉంది.
అమెరికాతో విబేధాలు
దశాబ్ధాల క్రితం అమెరికాకు ఇరాన్ కీలక మిత్రుడు. అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసేవారు. అదే సమయంలో సోవియట్ యూనియన్ కదలికలు పసిగట్టేందకు ఇరాన్ అమెరికా సీఐఏను అనుమతించేది. కానీ 1979లో షా మహ్మద్ రెజా పాల్వి నాయకత్వానికి వ్యతిరేకంగా భారీ ఆందోళనలు జరిగాయి. దీంతో ఆయన దేశం విడిచాడు. ఆ తర్వాత ఇస్లాం మతగురువు ఆయతుల్లా కేమేని నాయకుడయ్యారు. ఆ తర్వాత యూఎస్ తో సంబంధాలు అంతంతమాత్రమే ఉన్నాయి. న్యూక్లియర్ ప్రోగ్రామ్ విషయంలో ఇరాన్, అమెరికా మధ్య విబేధాలు పెరిగాయి. అప్పటి నుంచి యూఎస్ ఇరాన్ పై ఆంక్షలు విధించింది. ఫలితంగా ఇరాన్ ఆర్థికంగా నష్టపోతూ వచ్చింది.
నిరసనల వెనుక అమెరికా
ఇరాన్ నిరసనల వెనుక అమెరికా ఉందన్న వాదన ఉంది. నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం బలప్రయోగం చేస్తే రంగంలోకి దిగుతామని హెచ్చరించింది. తాము చాలా స్పష్టంగా గమనిస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. గతంలోలాగా నిరసనకారులను చంపితే అమెరికా నుంచి గట్టి దెబ్బ ఎదుర్కొంటుందని ఇరాన్ ను హెచ్చరించారు. ఇరాన్ దాడి కొనసాగితే నిరసనకారులను రక్షించేందుకు అమెరికా వస్తుందంటూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మదురో నిర్బంధం తర్వాత చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు అమెరికా రంగంలోకి దిగితే ఆయతుల్లా ఖేమాని దేశం విడిచి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
