హార్ముజ్ జలసంధిపై ట్రంప్ 'టోల్ ఫీజు' సంకేతాలు.. ప్రపంచ చమురు మార్కెట్లలో సరికొత్త ఆందోళనలు
ఇరాన్–అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి భద్రతపై నెలకొన్న అనిశ్చితి అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
By: A.N.Kumar | 21 Jun 2026 11:28 AM ISTఇరాన్–అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి భద్రతపై నెలకొన్న అనిశ్చితి అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై అమెరికా టోల్ ఫీజులు విధించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన సంకేతాలు ఇవ్వడం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇరాన్‌తో జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు విఫలమైతే ఈ నిర్ణయం అమల్లోకి రావచ్చునని ఆయన హెచ్చరించారు.
'గార్డియన్ ఏంజెల్' సేవలకు ఫీజు తప్పదా?
ప్రస్తుతం అమలులో ఉన్న 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ముగిసేలోపు ఇరాన్‌తో శాశ్వత ఒప్పందం కుదరకపోతే పరిస్థితులు పూర్తిగా మారవచ్చని ట్రంప్ స్పష్టం చేశారు. మధ్యప్రాచ్య దేశాలకు అమెరికా ఎన్నో సంవత్సరాలుగా "గార్డియన్ ఏంజెల్"లా రక్షణ కల్పిస్తోందని.. ఆ భద్రతా సేవలకు ప్రతిఫలంగా అమెరికా రుసుములు వసూలు చేసే హక్కు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో అందించిన రక్షణతో పాటు భవిష్యత్తులో అందించే భద్రతకు కూడా ఈ టోల్ ఫీజులు వర్తిస్తాయని ట్రంప్ పేర్కొనడం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో కలకలం రేపుతోంది.
మరోవైపు ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కొనసాగుతున్న ఘర్షణలు కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధమని ఆరోపిస్తూ.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్.జీసీ) హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ వాదనను పూర్తిగా ఖండించింది. హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచే ఉందని.. ఒక్కరోజులోనే 55 వాణిజ్య నౌకలు సుమారు 17 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురును సురక్షితంగా రవాణా చేశాయని, ప్రస్తుతం రవాణా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేదని వెల్లడించింది.
స్విట్జర్లాండ్‌లో కీలక చర్చలు
ఈ ఉద్రిక్తతల నడుమ స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య అత్యంత కీలకమైన చర్చలు జరుగుతున్నాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో రంగంలోకి దిగింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాకిర్ క్వాలిబాఫ్ నేతృత్వంలో ఈ చర్చల్లో పాల్గొంటోంది.
ఈ సమావేశంలో ఇరాన్ అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధి భద్రత, మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ స్థిరత్వం వంటి కీలక అంశాలపై ఇరువర్గాలు సుదీర్ఘంగా చర్చిస్తున్నాయి. ఈ చర్చల ఫలితాలపైనే రాబోయే రోజుల్లో మధ్యప్రాచ్య భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావం ఏమిటి?
ప్రపంచంలో సముద్ర మార్గం ద్వారా రవాణా అయ్యే ముడి చమురులో సింహభాగం హార్ముజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. ఒకవేళ ఇక్కడ టోల్ ఫీజులు అమలు చేయడం లేదా కొత్త ఆంక్షలు విధించడం జరిగితే, దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. నౌకల ప్రయాణ ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియాలు భారీగా పెరుగుతాయి. ఇంధన ధరల భారంతో ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం ప్రపంచ ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు స్విట్జర్లాండ్ చర్చలపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ దౌత్యపరమైన చర్చలు విజయవంతమైతే ఉద్రిక్తతలు తగ్గుతాయి.. లేదంటే హార్ముజ్ జలసంధి సంక్షోభం ముదిరి ప్రపంచ ఇంధన రంగానికి కోలుకోలేని భారీ షాక్ తగిలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
