ఇరాన్ యుద్ధంలో అమెరికాకు షాకింగ్ అనుభవం ఇది
ఇరాన్ తో ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నయుద్ధం ఆరో వారానికి చేరుకుంది. యుద్ధాలు అగ్రరాజ్యానికి కొత్తేం కాదు.
By: Garuda Media | 6 April 2026 12:56 PM ISTఇరాన్ తో ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్నయుద్ధం ఆరో వారానికి చేరుకుంది. యుద్ధాలు అగ్రరాజ్యానికి కొత్తేం కాదు. తాను టార్గెట్ చేసుకున్న దేశం.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేందుకు ఒప్పుకోని దేశం అంతు చూసే అలవాటు ఉన్న అమెరికా.. ఇరాన్ సంగతి తేల్చేద్దామనే తొందరలో ట్రంప్ హడావుడికి అమెరికా భారీ మూల్యాన్నిచెల్లిస్తోందా? అన్నదిప్పుడు చర్చ జరుగుతోంది. నాలుగు వారాల కంటే ముందే ఇరాన్ తో యుద్ధాన్నిముగిస్తామని చెప్పినా.. అది కాస్తా ఆరు వారాలకు సాగటం.. మరెంత కాలం సాగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఇదిలా ఉంటే.. ఈ యుద్ధం అగ్రరాజ్యం అమెరికాను ఇరాన్ భారీగా దెబ్బ తీసిందని.. యుద్ధ విమానాల్ని కూల్చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన గణాంకాలు భారీగా సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే.. అందరి చూపు భౌతిక వస్తువులపైనే తప్పించి.. మరో కీలకమైన మానవీయ కోణాన్ని మిస్ అవుతున్న పరిస్థితి. నిజానికి అమెరికా తాను కోల్పోయిన యుద్ధ విమానాల కంటే కూడా మరో అంశంలో ఆందోళనతో ఉందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే.. ఈ వ్యవహారం మీడియా కథనాల్లో పెద్దగా కనిపించకపోవటం గమనార్హం.
తమతో చేస్తున్న యుద్ధంలో అమెరికాకు చెందిన 19 యుద్ధ విమానాల్ని కూల్చేసినట్లుగా ఇరాన్ చెబుతోంది. ఇప్పటివరకు అమెరికా కోల్పోయిన యుద్ధ విమానాలు.. వాటి రకాలు.. వాటి ధరల చిట్టా భారీగానే సర్క్యూలేట్ అవుతోంది. అయితే.. ఇక్కడ ఆ జాబితాకు మించిన విషయాలు ఉన్నాయి అదే సమయంలో.. జాబితాలో చెబుతున్నట్లుగా నిజంగానే 19 యుద్ధ విమానాల్ని అమెరికా కోల్పోయిందా? అంటే.. అందుకు పక్కా ఆధారాలు లభించని పరిస్థితి. అసలు ఎన్ని యుద్ధ విమానాల్ని అమెరికా కోల్పోయింది? అన్న అంశాన్ని లోతుగా పరిశీలిస్తే..యుద్ధ విమానాలు.. హెలికాఫ్టర్లు.. భారీ డ్రోన్లు (దూరం నుంచి చూసేందుకు యుద్ధ విమానాల మాదిరే ఉంటాయి) మొత్తంగా 25 వరకు ఉంటే.. ఇరాన్ మాత్రం ఈ సంఖ్యను 44కు మించి ఉంటాయని చెబుతోంది.
వీటి ఖరీదు విషయానికి వస్తే.. అమెరికా చెప్పే దాని ప్రకారం దగ్గర దగ్గర రూ.30వేల కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు చెబతే.. ఇరాన్ లెక్కల ప్రకారం ఈ నష్టం రూ.40వేల కోట్లు దాటినట్లుగా చెబుతున్నారు. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. అమెరికాకు ఉన్న భారీ వైమానిక శక్తి ముందు తాజా యుద్ధంలో కోల్పోయినవి చాలా తక్కువ. అంకెల్లో చెప్పాల్సి వస్తే..అమెరికా మద్ద ఉన్న అన్ని సైనిక విమానాలు కలిపి సుమారు 13 వేల వరకు ఉంటాయి. కేవలం యుద్ధ విమానాల గురించి మాత్రమే మాట్లాడుకుంటే..2800 వరకు ఉంటాయి. ఇప్పుడు ఇరాన్ చెప్పిన దాని ప్రకారం.. 19 యుద్ధ విమానాలు అంటే 0.67 శాతం నష్టపోయినట్లు. అదే.. అమెరికా అంగీకరించిన 8 యుద్ధ విమానాల లెక్కను చూస్తే.. 0.28 శాతమే కనిపిస్తుంది. అంటే.. మొత్తంగా అమెరికా తన మొత్తం ఫైటర్ జెట్టలో ఒక శాతం కంటే తక్కువే కోల్పోయిందని చెప్పాలి.
నిజానికి అమెరికా తాను కోల్పోయిన యుద్ధ విమానాల కంటే కూడా.. మరణించిన పైలట్ల సంఖ్య మీదనే ఎక్కువ ఆందోళనతో ఉందని చెబుతున్నారు. ఎందుకంటే.. యుద్ధ విమానాన్ని కాస్త ఎక్కువ ఖర్చు చేస్తే తయారు చేయటం పెద్ద కష్టం కాదు. కానీ.. అత్యంత నైపుణ్యంతో ఉండే ఒక్కో వార్ పైలెట్ నష్టపోతే జరిగే నష్టం అపారం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా చెప్పుకునే అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ లాంటి దేశం కూల్చివేసిందన్నది అమెరికా సైనిక అధిపత్యం మీద పడే మచ్చగా చెప్పాలి.
ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తాజా యుద్ధంలో అమెరికా 12 నుంచి 15 మంది పైలట్లను కోల్పోయినట్లుగా చెబుతున్నారు. ఇరవైకు మించి గాయపడినట్లుగా తెలుస్తోంది. ఒక పైలట్ ను తయారు చేయటానికి రెండు.. మూడేళ్ల సమయం పడుతుంది. ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. గడిచిన ఇరవై.. పాతికేళ్ల వ్యవధిలో అమెరికా ఒక దేశం మీద యుద్ధం చేసే క్రమంలో కేవలం ఐదు వారాల వ్యవధిలో ఇంతమంది వాయుసేన పైలట్లను కోల్పోవటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. కోల్పోయిన యుద్ధ విమానాల కంటే కూడా.. అగ్రరాజ్యాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.. తన అమ్ములపొదిలోని అత్యుత్తమ పైలట్లను కోల్పోవటంగా చెబుతున్నారు.
