రంగంలోకి చైనా...మూడో ప్రపంచ యుద్ధమేనా ?
ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చితో చైనా ఫోన్ సంభాషణల ద్వారా ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రత, ప్రాదేశిక సమగ్రత జాతీయ గౌరవాన్ని కాపాడుకునే విషయంలో తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది అని అంటున్నారు.
By: Satya P | 3 March 2026 11:35 PM ISTచైనా రంగంలోకి దిగుతోందా అన్న చర్చ సాగుతోంది. చైనా సంగతి ప్రపంచానికి తెలిసిందే. దూకుడుగా ఉంటుంది. అంగబలం అర్ధబలం విషయంలో అమెరికాతో ఢీ కొట్టాలని చూస్తుంది. దక్షిణాసియాలో తన బలమైన ముద్రను వేయడానికి అహర్నిశం ప్రయత్నిస్తూ వస్తున్న చైనా అమెరికా మీద పై చేయి సాధించడానికి ఏ అవకాశాన్ని వదులు కోదని చెబుతారు. ఇపుడు అమెరికా ఇజ్రాయెల్ కలసి ఇరాన్ మీద దాడులు చేస్తున్నాయి. ఇరాన్ కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. కానీ ఒంటరి పోరు అవుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే ఇరాన్ మీద ఈ దాడులను ఖండించారు.
ఇరాన్ తో టచ్ లోకి "
ఇపుడు చైనా కూడా అదను చూసి ఇరాన్ తో ఫోన్ కలిపింది. ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్ సైనిక చర్య మంగళ వారానికి నాలుగవ రోజుకు చేరుకుంది. ఇటు ఇరాన్ పోరాటంతో పాటు అటు అమెరికా ఇజ్రాయెల్ దాడులు తీవ్రమయ్యాయి. దీంతో అన్ని వైపులా ప్రాణనష్టం పెరగడంతో పాటు విస్తృత స్థాయిలో ప్రాంతీయ యుద్ధం సంభవించే ప్రమాదం అయితే పెరుగుతోంది. ఈ రకమైన ఉద్రిక్త పరిస్థితుల మధ్య చైనా రంగంలోకి దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి అనేక దేశాల ప్రతినిధులతో వరసబెట్టి ఫోన్ చర్చలు జరిపారు. ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి, ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారోట్ ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదిలతో ఫోన్ చర్చలు జరిపారని చెబుతున్నారు.
చైనా మద్దతు మీద :
ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చితో చైనా ఫోన్ సంభాషణల ద్వారా ఇరాన్ సార్వభౌమాధికారం, భద్రత, ప్రాదేశిక సమగ్రత జాతీయ గౌరవాన్ని కాపాడుకునే విషయంలో తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది అని అంటున్నారు. అలాగే ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారోట్‌తో చైనా మంత్రి మాట్లాడుతూ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి ఫ్రాన్స్‌తో ఉమ్మడి ప్రయత్నాలను చేయాలని కోరారు. ఒమన్ విదేశాంగ మంత్రితో చైనా జరిపిన ఫోన్ సంభాషణలో గల్ఫ్ దేశాల ప్రాథమిక దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఈ యుద్ధం జరగడం ఉపయోగపడదని కూడా స్పష్టం చేశారు.
చైనా తీవ్ర ఆందోళన :
పశ్చిమాసియాలో సైనిక కార్యకలాపాలను తక్షణం ఆపాలని వివాదం మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించాలని అన్ని దేశాలను కోరినట్లుగా చైనా చెబుతోంది. సార్వభౌమ దేశాల నాయకులను హత్య చేయడం వంటి ఏకపక్ష చర్యలను అమెరికా చేయకుండా నిరోధించడంలో చైనా ఎలా పాత్ర పోషిస్తుందనే ప్రశ్నకు చైనా విదేశాంగ మంత్రి బదులిస్తూ ప్రస్తుత పరిస్థితిపై చైనా తీవ్ర ఆందోళన చెందుతోందని అన్నారు. అంతర్జాతీయ సంబంధాలలో బలప్రయోగాన్ని లేదా ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని భద్రతను ఉల్లంఘించడాన్ని చైనా గట్టిగా వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సైనిక కార్యకలాపాలను వెంటనే ఆపడం వివాదం వ్యాప్తి చెందకుండా నిరోధించడం ఇప్పుడు ప్రాధాన్యత కలిగిన అంశంగా ఆయన పేర్కొన్నారు.
అమెరికా చెప్పలేదంటూ :
ఇదిలా ఉంటే ఇరాన్ మీద దాడుల విషయం కానీ ఆ దేశం మీద ఈ సైనిక చర్య సమయంలో కానీ అంతకు ముందు కానీ చైనాకు అమెరికా వైపు నుండి ఏ విధమైన సమాచారం లేదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి చెప్పడం విశేషం. అమెరికా ఇరాన్ మీద జరిపిన సైనిక కార్యకలాపాల గురించి చైనాకు ముందుగానే తెలియజేయలేదని ఆయన అంటున్నారు. దీనిని బట్టి చూస్తే చైనా దౌత్యపరమైన వ్యవహారాలను కొనసాగిస్తుందా లేదా నేరుగా రంగంలోకి దిగి ఇరాన్ వైపు నిలుస్తుందా అన్నది అయితే తెలియడం లేదు. కానీ రష్యా చైనా వంటి దేశాల స్పందన ఒక వైపు ఇలా ఉంటే ఈ యుద్ధం నెలకు పైగా సాగుతుంది అన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలను తీసుకుంటే కనుక అంత సుదీర్ఘంగా యుద్ధం జరిగితే పరిణామాలు మొత్తం మారి మూడవ ప్రపంచ యుద్ధానికి దారులు తెరుస్తాయా అన్నదే చర్చగా ఉంది.
