Begin typing your search above and press return to search.

హార్ముజ్ భారత్‌కు ఓపెన్ చేసిన ఇరాన్.. ముదరనున్న చమురు సంక్షోభం?

మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను మరోసారి ఇంధన సంక్షోభం అంచున నిలబెట్టాయి.

By:  A.N.Kumar   |   26 March 2026 10:18 AM IST
హార్ముజ్ భారత్‌కు ఓపెన్ చేసిన ఇరాన్.. ముదరనున్న చమురు సంక్షోభం?
X

మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను మరోసారి ఇంధన సంక్షోభం అంచున నిలబెట్టాయి. ఇరాన్ , అమెరికా మధ్య నెలకొన్న ఘర్షణ పూరిత వాతావరణం అంతర్జాతీయ చమురు విఫణిని అతలాకుతలం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సముద్ర వాణిజ్య మార్గాలపై ఇరాన్ చేస్తున్న హెచ్చరికలు గ్లోబల్ ఎకానమీకి పెను సవాలుగా మారాయి.

యెమెన్ సమీపంలోని అత్యంత కీలకమైన బాబ్ ఎల్-మండేబ్ జలసంధి విషయంలో ఇరాన్ కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఒకవేళ అమెరికా గనుక ఇరాన్‌కు చెందిన వ్యూహాత్మక ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తే ఈ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ప్రపంచ వాణిజ్యంలో బాబ్ ఎల్-మండేబ్ పాత్ర వెలకట్టలేనిది. యూరప్, ఆసియా ఖండాల మధ్య సరకు రవాణాకు ఇది ప్రధాన వారధి. ఒకవేళ ఈ మార్గం మూతబడితే నౌకలు వేల కిలోమీటర్ల అదనపు దూరం ప్రయాణించి ఆఫ్రికా ఖండాన్ని చుట్టి ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా.. నిత్యావసర వస్తువుల ధరలు ప్రపంచవ్యాప్తంగా ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. ఇప్పటికే యెమెన్‌లోని హౌతీ మిలిటెంట్ గ్రూప్ ఇరాన్‌కు మద్దతుగా నిలవడం ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలను మరింత దట్టం చేస్తోంది.

భారత్‌కు ఊరట.. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ప్రకటన

ఈ ఉద్రిక్తతల మధ్య భారతదేశానికి మాత్రం కొంత ఊరటనిచ్చే వార్త అందింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% వాటా కలిగిన హార్ముజ్ జలసంధిని భారత్ వంటి మిత్రదేశాల కోసం తెరిచి ఉంచుతామని ఇరాన్ స్పష్టం చేసింది. భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్, ఇరాక్ వంటి దేశాలకు చెందిన నౌకలు హార్ముజ్ మార్గంలో స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ప్రకటించారు. భారత్ తన ఇంధన అవసరాల కోసం ప్రధానంగా మధ్యప్రాచ్యంపైనే ఆధారపడి ఉంటుంది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారత చమురు దిగుమతులకు ప్రస్తుతానికి ఆటంకం కలగకపోవచ్చు. అయితే ఈ ఉపశమనం తాత్కాలికమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం గనుక తీవ్రరూపం దాల్చితే.. ఏ ఒక్క దేశానికి మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని విశ్లేషిస్తున్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

హార్ముజ్ , బాబ్ ఎల్-మండేబ్ జలసంధులు మూతపడితే కలిగే పరిణామాలు ఊహాతీతంగా ఉంటాయి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కూడా దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సరఫరా గొలుసులో చిన్న అంతరాయం కలిగినా.. అది ప్రపంచవ్యాప్త ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.

ప్రధాన సవాళ్లు

సరఫరా తగ్గితే బ్యారెల్ చమురు ధర 100 డాలర్ల మార్కును సులువుగా దాటిపోయే అవకాశం ఉంది. బీమా, ఇంధన ఖర్చులు పెరగడం వల్ల అంతర్జాతీయ వాణిజ్యం ఖరీదైనదిగా మారుతుంది. అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగితే అది ఇతర మధ్యప్రాచ్య దేశాలను కూడా సంక్షోభంలోకి నెట్టివేస్తుంది. "ప్రపంచ వాణిజ్యానికి ధమనుల వంటి ఈ జలసంధులను మూసివేయడం అంటే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయడమే." అని ఒక సీనియర్ ఆర్థిక విశ్లేషకుడి మాట..

మొత్తంగా చూస్తే మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కేవలం ప్రాంతీయ సమస్యగా మిగిలిపోకుండా ప్రపంచ సంక్షోభంగా రూపాంతరం చెందుతున్నాయి. భారత్ వంటి దేశాలు తమ వ్యూహాత్మక నిల్వలను పెంచుకోవడం.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం ఇప్పుడు అత్యవసరం.