యూఏఈపై డ్రోన్ల వర్షం.. జెరూసలెంపై దాడి.. ఇరాన్ అసలు టార్గెట్ అదే
ఇక యుద్ధ రంగంలో కూడా ఇరాన్ తక్కువ ఖర్చుతో భారీ ప్రభావం చూపుతోంది. తక్కువ వ్యయంతో తయారు చేసే డ్రోన్లతో అధునాతన రక్షణ వ్యవస్థలను సవాలు చేస్తోంది.
By: A.N.Kumar | 22 March 2026 11:25 AM ISTపశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కొత్త మలుపు తిరిగి ఇప్పుడు గల్ఫ్ దేశాలను కూడా మంటల్లోకి నెట్టింది. ముఖ్యంగా యూఏఈపై ఇరాన్ భారీ స్థాయిలో డ్రోన్, క్షిపణి దాడులు జరపడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ దాడులు కేవలం సైనిక చర్యలు కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థను పరోక్షంగా దెబ్బతీసే వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇరాన్ ఇటీవల యూఏఈలోని కీలక ప్రాంతాలపై భారీ స్థాయిలో దాడులు చేసింది. అబుదాబిలోని జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం, దుబాయ్‌లోని పామ్ జుమేరా వంటి ప్రీమియం ప్రాంతాలు లక్ష్యాలుగా మారాయి. మొత్తం 137 బాలిస్టిక్ క్షిపణులు, 209 డ్రోన్లు ప్రయోగించినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఒకరు మరణించగా, 11 మంది గాయపడ్డారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిలిచిపోవడంతో సుమారు 20 వేల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా ఎదిగిన దుబాయ్ స్థిరత్వం కుదేలవుతుందనే భయం నెలకొంది.
ఈ దాడుల వెనుక ఇరాన్ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. 2025లో అమెరికా ఆర్థిక వ్యవస్థకు వచ్చిన 5.2 ట్రిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడుల్లో సుమారు 27% యూఏఈ నుంచే వచ్చినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూఏఈని అస్థిరం చేయడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను పరోక్షంగా దెబ్బతీయాలనే లక్ష్యంతో ఇరాన్ ముందుకెళ్తోంది. గల్ఫ్ దేశాలపై నమ్మకం కోల్పోయేలా చేసి ప్రపంచ పెట్టుబడులను తగ్గించడం ఈ వ్యూహంలో కీలకం.
ఇక యుద్ధ రంగంలో కూడా ఇరాన్ తక్కువ ఖర్చుతో భారీ ప్రభావం చూపుతోంది. తక్కువ వ్యయంతో తయారు చేసే డ్రోన్లతో అధునాతన రక్షణ వ్యవస్థలను సవాలు చేస్తోంది. ఇటీవల అమెరికాకు చెందిన అత్యాధునిక ఎఫ్–35 యుద్ధ విమానాన్ని కూడా కూల్చినట్లు సమాచారం రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అదే సమయంలో గల్ఫ్ దేశాల్లోని చమురు, ఎల్పీజీ కేంద్రాలపై దాడులు జరిపి ప్రపంచ ఇంధన సరఫరాపై కూడా ప్రభావం చూపిస్తోంది.
ఇరాన్ ఈ దాడుల ద్వారా ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. “మా శత్రువులకు సహాయం చేసే దేశాలు మూల్యం చెల్లించాలి.” 2019లో సౌదీ అరేబియాలో జరిగిన ఆయిల్ సౌకర్యాలపై దాడులను నమూనాగా తీసుకుని ఇప్పుడు అదే వ్యూహాన్ని విస్తరించి గల్ఫ్ దేశాలపై అమలు చేస్తోంది. డ్రోన్ యుద్ధం ద్వారా తక్కువ ఖర్చుతో భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించే విధానం ప్రస్తుతం ప్రభావవంతంగా మారింది.
ఇక ఈ యుద్ధ ప్రభావం భారత్‌పైనా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూఏఈ, దుబాయ్ ప్రాంతాల్లో భారత కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. అమెరికాలో కూడా భారత కంపెనీలు 1.3 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో గ్లోబల్ ఆర్థిక అస్థిరత భారత్‌కు కూడా ప్రమాద సూచికగా మారుతోంది.
-ఇజ్రాయెల్ లోని జెరూసలెంను తాకిన ఇరాన్ క్షిపణి
మరోవైపు ఇజ్రాయెల్‌లో కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జెరూసలెంలో అల్ అక్సా మసీదు సమీపంలో ఇరాన్ క్షిపణి పడడంతో భయాందోళనలు నెలకొన్నాయి. రంజాన్ సందర్భంగా ప్రార్థనలకు అనుమతి నిరాకరించడంతో వందలాది మంది ముస్లింలు మసీదు వెలుపలే నమాజ్ చేశారు. గత ఆరు దశాబ్దాల్లో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
అమెరికా మాత్రం ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని బలహీనపరిచే చర్యలను కొనసాగిస్తోంది. హర్మూజ్ జలసంధిని నియంత్రించే భూగర్భ కేంద్రాలపై భారీ బాంబులు వదిలినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ దాడుల్లో ఇరాన్‌లో దాదాపు 21 వేల మంది గాయపడినట్లు అక్కడి ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే మరణాల సంఖ్యపై ఇంకా స్పష్టత లేదు.
ప్రస్తుతం యూఏఈ ప్రభుత్వం “దుబాయ్ సురక్షితం” అనే ప్రచారంతో పెట్టుబడిదారుల నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ ఇరాన్ దాడులు ఇలాగే కొనసాగితే గల్ఫ్ దేశాలు మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
