ట్రంప్ పరువుపాయే.. శాంతి ఒప్పందం ‘హార్మూజ్’ లో కలిసే.. అమెరికాకు ఇరాన్ షాక్
హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య, చమురు నౌకల నుంచి ఇకపై తప్పనిసరిగా 'టోల్ ఫీజు' వసూలు చేస్తామని ప్రకటించి అమెరికాకు గట్టి షాక్ ఇచ్చింది.
By: A.N.Kumar | 19 Jun 2026 12:15 AM ISTఅంతర్జాతీయ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టం. దాదాపు 100 రోజుల పాటు ప్రపంచాన్ని వణికించిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు శాంతి ఒప్పందంతో తెరపడిందనుకున్న తరుణంలో ఇరాన్ మరో సంచలన నిర్ణయంతో అంతర్జాతీయంగా కొత్త చర్చకు తెరలేపింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య, చమురు నౌకల నుంచి ఇకపై తప్పనిసరిగా 'టోల్ ఫీజు' వసూలు చేస్తామని ప్రకటించి అమెరికాకు గట్టి షాక్ ఇచ్చింది.
టోల్ ఫీజు వెనుక ఇరాన్ వాదన ఏంటి?
యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితులు ఇకపై రావని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ సముద్ర మార్గంలో తాము అందించే రక్షణ, నావిగేషన్ సేవలకు గాను రుసుము వసూలు చేయడం తమ హక్కని ఇరాన్ వాదిస్తోంది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు పూర్తి సార్వభౌమాధికారం ఉందని.. అందువల్ల అక్కడ ప్రయాణించే వాణిజ్య నౌకల నుంచి సేవా రుసుము వసూలు చేయడం చట్టబద్ధమేనని ఇరాన్ ప్రధాన చర్చల ప్రతినిధి మహ్మద్ బాగెర్ గాలిబాఫ్ సమర్థించారు. శాంతి ఒప్పందంలో భాగంగా నిర్ణయించిన 60 రోజుల చర్చల గడువు ముగిసిన వెంటనే ఈ కొత్త టోల్ విధానం అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు.
ట్రంప్ ప్రకటనకు కౌంటర్.. ముగియని దౌత్యపోరు
ఆసక్తికరమైన విషయమేమిటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్ మార్గం ప్రపంచ వాణిజ్యానికి పూర్తిగా ఉచితంగా, నిరంతరాయంగా అందుబాటులో ఉంటుందని ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ ఈ టోల్ ప్లాన్‌ను బయటపెట్టింది. దీన్ని బట్టి చూస్తే శాంతి ఒప్పందం కుదిరినా ఇరు దేశాల మధ్య తెరవెనుక రాజకీయ, దౌత్య పోరు ఇంకా తీవ్రంగానే కొనసాగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇరాన్ మైండ్‌గేమ్
అమెరికా ఆంక్షల వల్ల హార్ముజ్ జలసంధి ప్రాధాన్యత తగ్గిందనే ప్రచారాన్ని ఈ యుద్ధం తిప్పికొట్టిందని ఇరాన్ భావిస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో తమ మార్గం ఎంత కీలకమో నిరూపించామని, అందుకే ఈ ఒప్పందాన్ని అమెరికా విజయంగా కాకుండా తమ విజయంగానే ఇరాన్ ప్రచారం చేసుకుంటోంది.
ప్రపంచ ఇంధన మార్కెట్‌పై ప్రభావం ఎలా ఉంటుంది?
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ లో దాదాపు 20 శాతం హార్ముజ్ జలసంధి గుండానే రవాణా అవుతుంది. యుద్ధం కారణంగా ఇన్నాళ్లూ నిలిచిపోయిన రవాణా మళ్లీ ప్రారంభం కావడంతో ప్రపంచ మార్కెట్‌కు పెద్ద ఊరట లభించింది.
యుద్ధం ముగిసి తుపాకులు శాంతించినా.. హార్ముజ్ జలసంధి చుట్టూ ఆర్థిక యుద్ధం మాత్రం ఇప్పుడే మొదలైంది. అంతర్జాతీయ చమురు మార్కెట్ భవిష్యత్తు, ఇంధన ధరల హెచ్చుతగ్గులు ఇకపై ఇరాన్ తీసుకోబోయే తదుపరి చర్యలపైనే ఆధారపడి ఉన్నాయి. అమెరికా ఈ టోల్ విధానాన్ని ఎలా ఎదుర్కొంటుందో అంతర్జాతీయ సమాజం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
