Begin typing your search above and press return to search.

ఇరాన్‌లో హిజాబ్ నియమాల ఉల్లంఘన.. సింగర్‌కు ఊహించని శిక్ష!

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో ముందుకు వెళ్తున్నా, కొన్ని దేశాల్లో మాత్రం మహిళలపై ఉండే కఠినమైన ఆంక్షలు ఇంకా మధ్యయుగాల నాటి కాలంలోనే ఆపేస్తున్నాయి.

By:  Madhu Reddy   |   20 Jun 2026 6:00 PM IST
ఇరాన్‌లో హిజాబ్ నియమాల ఉల్లంఘన.. సింగర్‌కు ఊహించని శిక్ష!
X

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో ముందుకు వెళ్తున్నా, కొన్ని దేశాల్లో మాత్రం మహిళలపై ఉండే కఠినమైన ఆంక్షలు ఇంకా మధ్యయుగాల నాటి కాలంలోనే ఆపేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ దేశంలో హిజాబ్ విషయంలో ఎంత కఠినమైన రూల్స్ ఉంటాయో మనందరికీ తెలిసిందే. తాజాగా అక్కడ హిజాబ్ ధరించకుండా, స్లీవ్‌లెస్ డ్రెస్‌ వేసుకుని పాట పాడినందుకు ఒక ప్రముఖ యువ మహిళా సింగర్‌కు అక్కడి కోర్టు ఏకంగా 74 కొరడా దెబ్బల భయంకరమైన శిక్షను విధించి ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది.

ఆ ఒక్క వీడియో తెచ్చిన ముప్పు:

ఇరాన్‌కు చెందిన 29 ఏళ్ల ప్రముఖ సింగర్, మ్యూజిక్ కంపోజర్ పరాస్తూ అహ్మది కి అక్కడి ఇస్లామిక్ పాలకులు ఈ షాకింగ్ శిక్షను ఖరారు చేశారు. 2024 డిసెంబర్‌లో ఆమె హిజాబ్ లేకుండా యూట్యూబ్‌లో లైవ్‌స్ట్రీమ్ చేసిన ఒక మ్యూజిక్ కాన్సెర్ట్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి విపరీతంగా వైరల్‌గా మారింది. ఇక ఆ వీడియోలో ఆమె ఇరాన్ దేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన, విప్లవ గీతం లాంటిదైన 'ఫ్రమ్ ద బ్లడ్ ఆఫ్ ద యూత్ ఆఫ్ ద హోమ్‌ల్యాండ్' అనే పాటను ఆలపించారు.

74 కొరడా దెబ్బలతో పాటు జైలు ఆంక్షలు:

ఆమె హిజాబ్ లేకుండా స్లీవ్‌లెస్ డ్రెస్ వేసుకుని పాట పాడటం సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే ఇరాన్ అధికారులు అప్పట్లోనే ఆమెను, ఆమెతో పాటు ఉన్న ముస్లిం మ్యూజిషియన్లను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆ తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా ఇస్లామిక్ విలువలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ సైబర్, క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజా తీర్పు ప్రకారం పరాస్తూ అహ్మదికి 74 కొరడా దెబ్బల శిక్షతో పాటు, రెండేళ్ల పాటు దేశం విడిచి వెళ్లకుండా ట్రావెల్ బ్యాన్ విధించారు. అలాగే రెండేళ్ల వరకు ఎలాంటి మ్యూజిక్ షోలు చేయకూడదని కోర్టు ఆంక్షలు పెట్టింది.

ఎనిమిది మంది మ్యూజిషియన్లకు కూడా అదే శిక్ష:

ఇరాన్‌లో చట్టం ప్రకారం మహిళలు హిజాబ్ లేకుండా బయట ఎక్కడా కనిపించకూడదు. ఈ రూల్స్ సామాన్యులకే కాదు సెలబ్రిటీలకైనా ఒకేలా వర్తిస్తాయి. ఈ కేసులో విచిత్రం ఏంటంటే.. కేవలం సింగర్ పరాస్తూ మాత్రమే కాకుండా, ఆ మ్యూజిక్ ప్రొడక్షన్, రికార్డింగ్‌లో పాల్గొని ఆమెకు సపోర్ట్ చేసిన మరో ఎనిమిది మంది సహ సంగీతకారులకు కూడా ఇరాన్ కోర్టు ఇదే 74 కొరడా దెబ్బల కఠిన శిక్షను ఖరారు చేయడం గమనార్హం.

ఒక చిన్న హిజాబ్ రూల్ పాటించలేదనే కారణంతో, కేవలం ఒక పాట పాడినందుకు ఒక మహిళా కళాకారిణిపై ఇంత ఘోరమైన శిక్షలు వేయడం నిజంగా హృదయవిదారకం. ఇక ఇరాన్ పాలకుల కఠిన చట్టాల తీరుపై, అక్కడ సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు మహిళలకు స్వేచ్ఛ లేని పరిస్థితిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ కఠినమైన రూల్స్ ఇరాన్ యువత భవిష్యత్తును ఎటువైపు తీసుకెళ్తాయో చూడాలి.