ట్రంప్ పోస్టు.. కదిలిన ఇరాన్ పార్లమెంటు.. ఇజ్రాయెల్ అలర్టు.. వాట్ నెక్స్టు!
గత కొన్ని రోజులుగా ఇరాన్ రగిలిపోతున్న సంగతి తెలిసిందే.. ప్రధానంగా గురువారం నుంచి ఇది మరింత తీవ్రమైంది.
By: Raja Ch | 11 Jan 2026 8:00 PM ISTగత కొన్ని రోజులుగా ఇరాన్ రగిలిపోతున్న సంగతి తెలిసిందే.. ప్రధానంగా గురువారం నుంచి ఇది మరింత తీవ్రమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్ లో ప్రారంభమైన నిరసనలు రోజు రోజుకీ హింసాత్మకంగా మారుతున్నాయి. తొలుత రాజధాని టెహ్రాన్ కు పరిమితమైనట్లు కనిపించిన నిరసనలు.. పలు నగరాలకు వ్యాపించాయి. వాటిని నియంత్రించే సందర్భంలో పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనల్లో వందల సంఖ్యలో మరణాలు సంభవించాయి. సరిగ్గా ఈ సమయంలో ట్రంప్ పెట్టిన పోస్టు సంచలనంగా మారి, మరిన్ని కీలక పరిణామాలకు తెరలేపింది.
అవును... ఇరాన్ లో తాజా పరిస్థితులు తీవ్ర ఉదృతంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆ దేశ యువత.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో స్వరం వినిపిస్తోంది. ఇక అమ్మాయిలైతే ఏకంగా ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ ఫోటోకు నిప్పు పెట్టి, దానితో సిగరెట్ వెలిగించుకుంటున్న పరిస్థితి. ఈ స్థాయిలో అక్కడ చట్టాలను, మతాచారాలను ప్రజలు తీవ్రస్థాయిలో తిరస్కరిస్తూ తమ నిరసన తెలియజేస్తున్నారు. ఇలా రగులుతున్న ఇరాన్ లో నిరసనకారులకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ పోస్టు పెట్టారు. దీంతో అటు ఇరాన్ పార్లమెంటు కదలడం, మరోపక్క ఇజ్రాయెల్ అలర్ట్ అవ్వడం ఒకేసారి జరిగిపోయాయి.
"ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా ఇరాన్ స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తోంది.. ఈ సమయంలో వారికి సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది".. ఇది డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ పోస్టు. ట్రంప్ పోస్టు పెట్టారంటే ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చేసి ఉంటారని.. ఇక చేతలే తరువాయని గతానుభవాలను దృష్టిలో పెట్టుకుందో ఏమో కానీ.. ఇరాన్ ప్రభుత్వం ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. ఇందులో భాగంగా.. ఇరాన్ పార్లమెంటు సమావేశమైంది. ఈ క్రమంలో.. అమెరికా, ఇజ్రాయెల్ లకు ఇరాన్ పార్లమెంటు స్పీకర్ హెచ్చరికలు జారీ చేశారు.
ఇందులో భాగంగా.. ఇరాన్ పై అమెరికా దాడి చేస్తే ఇజ్రాయెల్, అమెరికా సైనిక, షిప్పింగ్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని అన్నారు. ఈ సమయంలో పలువురు పార్లమెంటేరేనియన్లు వేదిక వద్దకు దూసుకెళ్లి "అమెరికాకు మరణం!" అని నినాదాలు చేశారు. అంతక ముందు నిరసనకారులను ఉద్దేశించి స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ.. ఇతర దేశాధ్యక్షుడిని (ట్రంప్) సంతోష పెట్టేందుకు సొంత వీధులను నాశనం చేసుకుంటున్నారంటూ ఆందోళనకారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అప్రమత్తమైన ఇజ్రాయెల్!:
తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. వాస్తవానికి 2023లో ఇరాన్ మద్దతు ఉన్న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ లోకి చొరబడి ఆ దేశ పౌరులపై ఊచకోతకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో హమాస్ తో పాటు హెజ్ బొల్లాతోనూ ఇజ్రాయెల్ పోరాడింది. ఆ అనుభవాలను గుర్తు పెట్టుకున్న ఇజ్రాయెల్.. ఇరాన్ లో అల్లర్లు, ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో అప్రమత్తమైంది. కాగా.. హమాస్ నిర్మూలనే లక్షయంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసి, ఆ స్ట్రిప్ మొత్తాన్ని కాంక్రీట్ శిథిలంగా మార్చిన సంగతి తెలిసందే. దీంతో.. మరికొన్ని గంటల్లో పశ్చిమాసియాలో ఏదైనా జరగొచ్చనే చర్చలు మొదలయ్యాయి!
