ఇరాన్ ఆయుధాలు అయిపోయాయా? సరెండర్ అవుతుందా? నెక్ట్స్ ఏం జరుగనుంది?
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాన్ సైనిక సామర్థ్యంపై అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణుల్లో సరికొత్త ఉత్కంఠ నెలకొంది.
By: A.N.Kumar | 7 March 2026 10:44 AM ISTమధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాన్ సైనిక సామర్థ్యంపై అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణుల్లో సరికొత్త ఉత్కంఠ నెలకొంది. దశాబ్దాలుగా క్షిపణి సంపత్తితో శత్రువులను వణికించిన ఇరాన్, ప్రస్తుతం ఆయుధాల కొరతతో సతమతమవుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్‌పై దాడుల తీవ్రత గత కొన్ని రోజులుగా గణనీయంగా తగ్గడం, అమెరికా నిఘా వర్గాలు విడుదల చేసిన '90 శాతం క్షీణత' గణాంకాలు టెహ్రాన్ యుద్ధ వ్యూహంపై నీలినీడలు పరుస్తున్నాయి. వేల సంఖ్యలో ఉన్నాయని భావించిన క్షిపణులు కేవలం వందల్లోకి పడిపోయాయా? లేక ఇది రాబోయే పెద్ద తుపానుకు ముందు కనిపిస్తున్న నిశ్శబ్దమా? అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద ప్రశ్న.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ సైనిక సామర్థ్యంపై కొత్త చర్చలు మొదలయ్యాయి. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇరాన్ వద్ద ఉన్న ఆయుధ నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయా అనే ప్రశ్నలు అంతర్జాతీయ వేదికలపై వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ , గల్ఫ్ ప్రాంత దేశాలపై ఇరాన్ నిర్వహించిన దాడుల తీవ్రత గత రెండు రోజులుగా గణనీయంగా తగ్గినట్లు అమెరికా అధికారులు పేర్కొంటున్నారు.
అమెరికా అధ్యక్ష భవనం అయిన వైట్‌హౌస్ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం.. ఇరాన్ చేపట్టిన క్షిపణి దాడులు సుమారు 90 శాతం వరకు తగ్గగా డ్రోన్ దాడులు కూడా 83 శాతం మేర తగ్గినట్లు సమాచారం. మొదటి దశలో భారీ స్థాయిలో జరిగిన దాడులు ప్రస్తుతం తగ్గుముఖం పట్టడం వెనుక ఆయుధ నిల్వల కొరత ప్రధాన కారణం కావచ్చని అమెరికా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వ్యూహాత్మక విశ్లేషణ సంస్థ అయిన యూరేషియా గ్రూప్ అధ్యక్షుడు ఇయాన్ బ్రెమ్మర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అంచనా ప్రకారం ప్రస్తుతం ఇరాన్ వద్ద సుమారు 1,000 బాలిస్టిక్ క్షిపణులు మాత్రమే మిగిలి ఉండొచ్చని తెలుస్తోంది. యుద్ధం ప్రారంభమైన రోజుల్లో ఇరాన్ వరుసగా భారీ సంఖ్యలో క్షిపణులు, డ్రోన్ దాడులు నిర్వహించినప్పటికీ ఇప్పుడు అదే స్థాయి దాడులు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు.
ప్రారంభ దశలో రోజుకు వందల సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించిన ఇరాన్ ప్రస్తుతం ఆ స్థాయిలో దాడులు చేయడం లేదు. దీనివల్ల ఇరాన్ సైనిక వ్యూహం మారిందా లేదా ఆయుధ నిల్వలు తగ్గుతున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఇరాన్ మాత్రం ఈ అంచనాలను ఖండిస్తూ తమ సైనిక సామర్థ్యం ఇంకా బలంగానే ఉందని ప్రకటిస్తోంది. అవసరమైతే మరింత భారీ దాడులు చేయగల సామర్థ్యం తమకు ఉందని టెహ్రాన్ వర్గాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ భద్రతా నిపుణులు మాత్రం ఈ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. యుద్ధం పొడిగిస్తే ఆయుధ నిల్వలు, సరఫరా వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా క్షిపణులు, డ్రోన్ల తయారీకి అవసరమైన సాంకేతిక వనరులు, సరఫరా మార్గాలు యుద్ధంలో పెద్ద పాత్ర పోషిస్తాయని విశ్లేషిస్తున్నారు.
ఇదిలా ఉండగా మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు అంతర్జాతీయ సమాజం కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా రాజదౌత్య మార్గాల్లో పరిష్కారం కనుగొనాలని పలు దేశాలు కోరుతున్నాయి. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఈ ఉద్రిక్త పరిస్థితులు రాబోయే రోజుల్లో ఎలా మారుతాయన్నది ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
