హర్మూజ్ చిక్కులు.. ప్రపంచానికి ఊపిరి ఆగిపోతుందా? చమురు సెగ భారత్‌పై ఎంత?
ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఇరాన్ చేసిన ఒక ప్రకటన ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
By: Tupaki Political Desk | 4 March 2026 9:00 PM ISTప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఇరాన్ చేసిన ఒక ప్రకటన ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అదే ‘హర్మూజ్ జల సంధిని మూసివేస్తాం’ అనే హెచ్చరిక. ‘ఈ దారిలో నౌకలు వస్తే తగలబెట్టేస్తాం’ అని ఇరాన్ సైన్యం (ఐఆర్‌జీసీ) బాహాటంగానే చెబుతోంది. ఇప్పటికే ఒకటి, రెండు నౌకలపై దాడులు కూడా చేసింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న సుమారు 700 నౌకల పరిస్థితి ఏంటని అందరూ కంగారు పడుతున్నారు.
అసలు ఎక్కడుందీ హర్మూజ్?
మనం మ్యాప్‌లో చూస్తే, ఇరాన్, ఒమన్ దేశాల మధ్య చాలా ఇరుకైన ఒక సముద్ర మార్గం కనిపిస్తుంది. అదే హర్మూజ్ జల సంధి. ఇది పర్షియన్ గల్ఫ్‌ను బయటి ప్రపంచంతో కలిపే ఏకైక దారి. దీని పొడవు 161 కిలోమీటర్లు ఉన్నా, నౌకలు ప్రయాణించే లోతైన దారి మాత్రం చాలా ఇరుగ్గా ఉంటుంది. కొన్ని చోట్ల కేవలం 3 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. అంటే, ఒక పెద్ద గేటును మూసివేసినట్లు ఇరాన్ ఈ దారిని అడ్డుకుంటే, గల్ఫ్ దేశాల నుంచి బయటకు రావాల్సిన చమురు మొత్తం అక్కడే ఆగిపోతుంది.
ప్రపంచానికి ఇది ఎందుకు ఇంత ముఖ్యం?
ప్రపంచం మొత్తం వ్యాపారం జరిగే చమురులో 20 శాతం కేవలం ఈ దారి గుండానే వెళ్తుంది. అంటే రోజుకు సుమారు 2 కోట్ల బ్యారెళ్ల చమురు ఇటు నుంచే ప్రయాణం చేస్తుంది. సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, యూఏఈ వంటి దేశాలు తమ చమురును భారత్, చైనా వంటి దేశాలకు పంపాలంటే ఈ దారిని దాటాల్సిందే. కేవలం చమురు మాత్రమే కాదు, మనం వాడుతున్న గ్యాస్ (ఎల్ఎన్జీ)లో నాలుగో వంతు కూడా ఈ మార్గం నుంచే వస్తుంది.
భారత్‌పై పడే ప్రభావం ఎంత?
మనం మనకు కావలసిన ఎల్పీజీ (వంట గ్యాస్)లో 80 నుంచి 85 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఇందులో సింహభాగం ఈ గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. చమురుకు అయితే మన దగ్గర నిల్వలు ఉన్నాయి కానీ, గ్యాస్ విషయంలో మన దగ్గర అలాంటి నిల్వలు లేవు. ఒకవేళ హర్మూజ్ మూసివేస్తే, దేశంలో గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇక ధరల విషయానికి వస్తే, ప్రస్తుతం 80 డాలర్ల దగ్గర ఉన్న చమురు ధర, ఈ దారిని మూసివేస్తే ఏకంగా 100 డాలర్లు దాటిపోతుంది. ఒకవేళ ఇరాన్ పూర్తిగా నౌకలను అడ్డుకుంటే అది 150 నుంచి 200 డాలర్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చమురు ధర పెరిగితే మన దగ్గర పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకుతాయి, ఫలితంగా అన్ని వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడి బతుకు భారమవుతుంది.
ఇరాన్ నిజంగానే ఆపగలదా?
ఇరాన్ అంతలా హెచ్చరిస్తున్నా, అది అంత సులభం కాదు. హర్మూజ్ జల సంధిలో కొంత భాగం ఒమన్ ఆధీనంలో కూడా ఉంది. కాబట్టి ఇరాన్ దాన్ని పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకోలేదు. పైగా అక్కడ అమెరికాకు చెందిన 5వ ఫ్లీట్ నౌకాదళం సిద్ధంగా ఉంది. ఇరాన్ ఏదైనా సాహసం చేస్తే పశ్చిమ దేశాల నుంచి బలమైన స్పందన ఉంటుంది. గతంలో 1980ల్లో ఇరాన్-ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు కూడా ఇలాంటి దాడులు జరిగాయి కానీ, మార్గాన్ని మాత్రం పూర్తిగా మూసివేయలేకపోయారు.
ప్రత్యామ్నాయం ఉందా?
సౌదీ అరేబియా, యూఏఈ దేశాలకు పైపులైన్ల ద్వారా చమురును తరలించే అవకాశం ఉన్నా, అవి మొత్తం అవసరాలను తీర్చలేవు. రోజుకు కేవలం 40 నుంచి 50 లక్షల బ్యారెళ్లను మాత్రమే అవి పంపగలవు. అంటే హర్మూజ్‌కు ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి ఏదీ లేదు. అందుకే ఈ చిన్న సముద్ర మార్గం ఇప్పుడు ప్రపంచ దేశాల పాలిట ఒక ‘చోక్ పాయింట్’ (మెడ మీద కత్తి)లా మారింది.
హర్మూజ్ నుంచి చమురు పొందే దేశాల్లో 80 శాతం ఆసియా దేశాలే. అందుకే చైనా, భారత్, జపాన్ వంటి దేశాలు ఇప్పుడు తీవ్రమైన టెన్షన్‌లో ఉన్నాయి. యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో కానీ, ఈ దారి మూతపడితే మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడం ఖాయం. ఆకాశాన్ని అంటే ఇంధన ధరలు, నిత్యావసరాల కొరత రాకుండా ఉండాలంటే ఆ ప్రాంతంలో త్వరగా శాంతి నెలకొనాలి. లేదంటే, ఈ యుద్ధం సెగ మన వంటింటి బడ్జెట్‌ను కాల్చేయడం ఖాయం.
