ఇజ్రాయెల్ మారదు.. ఇరాన్ ‘హార్ముజ్’ వదలదు.. మళ్లీ లొల్లి.. బుక్కైన అమెరికా
అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని ప్రపంచ దేశాలు ఆశించినప్పటికీ తాజా పరిణామాలు ఆ ఆశలపై నీళ్లు చల్లాయి.
By: A.N.Kumar | 21 Jun 2026 9:34 AM ISTఅమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని ప్రపంచ దేశాలు ఆశించినప్పటికీ తాజా పరిణామాలు ఆ ఆశలపై నీళ్లు చల్లాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం అంతర్జాతీయంగా పెను సంచలనాన్ని సృష్టించింది. అయితే ఈ అంశంపై అమెరికా భిన్నమైన ప్రకటన చేయడంతో ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉత్కంఠ, అనిశ్చితి నెలకొన్నాయి.
ఇరాన్ ఆగ్రహం.. కారణాలు ఏంటి?
ఇరాన్ అధికారిక మీడియా కథనాల ప్రకారం.. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి కాల్పుల విరమణ ఒప్పందాన్ని బేఖాతరు చేస్తూ ఉల్లంఘనలకు పాల్పడ్డాయని ఇరాన్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ నిరంతరాయంగా కొనసాగిస్తున్న వైమానిక దాడులు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని ఇరాన్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌కు చెందిన ఖాతమ్ అల్-అన్బియా సంయుక్త సైనిక ప్రధాన కార్యాలయం హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. "ఇది మా ప్రతిస్పందనలో తొలి అడుగు మాత్రమే. ఒకవేళ శత్రువుల దురాక్రమణ ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో మరిన్ని కఠినమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోం" అని ఖాతమ్ అల్-అన్బియా హెడ్‌క్వార్టర్స్ హెచ్చరించింది.
అమెరికా కౌంటర్.. అసలు పరిస్థితి ఏంటి?
ఇరాన్ చేసిన ఈ సంచలన ప్రకటనను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇరాన్ ప్రకటనల్లో వాస్తవం లేదని, హార్ముజ్ జలసంధి గుండా నౌకాయానం ఇప్పటికీ సాధారణంగానే సాగుతోందని అమెరికా రక్షణ రంగానికి చెందిన ఉన్నతాధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ నౌకలకు ఎలాంటి ఆటంకం కలగలేదని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య పరస్పర విరుద్ధ ప్రకటనలు వెలువడుతుండటంతో అసలు జలసంధి వద్ద ఏం జరుగుతోందనే దానిపై ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.
ప్రపంచానికి ‘హార్ముజ్ జలసంధి’ ఎందుకు అంత ముఖ్యం?
ప్రపంచ ఇంధన భద్రతను శాసించే అత్యంత వ్యూహాత్మకమైన సముద్ర మార్గం ఇది. ఓ రకంగా చెప్పాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక లైఫ్ లైన్. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గాల ద్వారా జరిగే మొత్తం ముడి చమురు రవాణాలో దాదాపు 20% ఐదో వంతు ఈ ఇరుకైన జలసంధి ద్వారానే సాగుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), కువైట్, ఖతార్ వంటి అగ్రశ్రేణి గల్ఫ్ దేశాలు తమ ముడి చమురు, సహజ వాయువును ప్రపంచ మార్కెట్లకు చేరవేయడానికి ఈ మార్గంపైనే ఆధారపడతాయి.
గ్లోబల్ మార్కెట్‌పై ప్రభావం.. భారత్‌కు ముప్పు తప్పదా?
హార్ముజ్ జలసంధి గనుక నిజంగానే మూతబడితే లేదా అక్కడ ఉద్రిక్తతలు పెరిగి నౌకల రాకపోకలు నిలిచిపోతే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకడం ఖాయమని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతానికి ఇరాన్ హెచ్చరికలు, అమెరికా వివరణల మధ్య పశ్చిమాసియా సంక్షోభం మరో ఉత్కంఠభరిత ఘట్టానికి చేరుకుంది. ఈ వివాదం మాటల యుద్ధానికే పరిమితమవుతుందా లేక నిజంగానే చమురు సరఫరాకు బ్రేక్ పడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుందా అనేది రానున్న కొన్ని గంటల్లో తేలనుంది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు మాత్రం ప్రస్తుతం తీవ్ర అప్రమత్తతతో ఈ పరిణామాలను గమనిస్తున్నాయి.
