గల్ఫ్ దేశాలు మూకుమ్మడి దాడి చేస్తే ఇరాన్ మసి
ఇరాన్ యుద్ధం కాదు కానీ అరబ్ దేశాలకు ఆర్ధికంగా పెద్ద దెబ్బ పడుతోంది. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజు రోజుకూ దారుణంగా మారుతున్నాయి.
By: Satya P | 20 March 2026 12:50 PM ISTయుద్ధంలో ఉన్న వాడికి ఏమీ తెలియదు, కళ్ళకు అసలు కనిపించదు. తాను ఏ వైపున ఉన్నాను అన్నది అసలు ఆనదు. యుద్ధం అంటేనే ఒక ఆవేశం, ఒక మోహం. అది కమ్మేసిన తరువాత అంతానికే అడుగులు పడతాయి. ఇపుడు ఇరాన్ పరిస్థితి అలాగే ఉంది. ఫిబ్రవరి 28న ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ కలసి దాడులు చేసి సీనియర్ ఖమేనీ సహా చాల మంది కీలక నేతలను లేపేసినపుడు ప్రపంచమంతా అయ్యో అంది. సానుభూతి చూపించింది. ఆ తరువాత ఇరాన్ చేసిన యుద్ధాన్ని ధర్మం అనుకుంది. కానీ ఇరాన్ తన దారి మరచి గల్ఫ్ దేశాల మీద విరుచుకుపడుతూ వక్ర వ్యూహాలకు తెర తీస్తున్నపుడు మాత్రం అంతర్జాతీయ సమాజంలో ఆందోళన మొదలైంది. తాజాగా కువైట్ లోని అతి పెద్ద చమురు క్షేత్రాల మీద ఇరాన్ దాడి చేసి ప్రపంచానికే వినాశనం తలపెడుతూ పోతూంటే మాత్రం అదే అంతర్జాతీయ సమాజం ఇరాన్ మీద మండిపడుతోంది. ఇరాన్ ని దారికి తేవాల్సిందే అంటోంది.
ఒట్టు పెట్టుకుని మరీ :
ఇరాన్ దేశం మీద దాడి చేయడం ఎందుకు అని గల్ఫ్ కంట్రీస్ ఇప్పటిదాకా ఆలోచించాయి. షియా దేశంగా ఇరాన్ ఉన్నా మిగిలిన గల్ఫ్ దేశాలు సున్నీ మతాన్ని విశ్వసించినా అల్లా మాట మేరకు ఒట్టు పెట్టి సహనం వహించాయి. సాటి ముస్లిం దేశం మీద దాడి ఎందుకు అని వెనకడుగు వేశాయి తమ ప్రాంతాల స్వీయ రక్షణ కోసం డిఫెన్స్ మోడ్ లోనే ముందుకు సాగాయి. అయితే ఇరాన్ పెచ్చు మీరుతోంది. గల్ఫ్ దేశాల మీద వారి ఆయిల్ నిక్షేపాల మీద వారి వనరుల మీద ఆర్థిక మూలాల మీద బరితెగించి చేస్తున్న దాడులతో అరబ్ దేశాలు తీవ్రంగా ఆగ్రహిస్తున్నాయి. ఇక లాభం లేదని ఇరాన్ కి లాస్ట్ వార్నింగ్ ఇచ్చేశాయి.
ఎదురు దాడికి రెడీ :
ఇంతకాలం అరబ్ దేశాల సహనాన్ని చేతకాని తనంగా ఇరాన్ భావిస్తోంది అన్న మాట ఉంది. అయితే అరబ్ దేశాల బలం ఎంతో ఎక్కువ. అవన్నీ మూకుమ్మడిగా వస్తే మాత్రం ఇరాన్ నుసి కాక తప్పదు ఇపుడు అలాంటి పరిస్థితి వచ్చేస్తోంది. తమ మీద అదే పనిగా దాడులు చేస్తూ తమ చమురు శుద్ధి కర్మాగారాలు రవాణా మార్గాలపై ఇరాన్ పెద్ద ఎత్తున విరుచుకుపడుతూంటే ఇక చేతులు ముడుచుకుని కూర్చోలేమని అరబ్ దేశాలు అంటున్న్నాయి. సహనానికి అయినా ఒక హద్దు ఉంటుందని గట్టిగానే ఇరాన్ కి చెప్పదలచాయి. అందుకే ఇక ఎదురు దాడికి మేము రెడీ అంటున్నాయి.
ఆర్ధికంగా దెబ్బ :
ఇరాన్ యుద్ధం కాదు కానీ అరబ్ దేశాలకు ఆర్ధికంగా పెద్ద దెబ్బ పడుతోంది. పశ్చిమాసియాలో పరిస్థితులు రోజు రోజుకూ దారుణంగా మారుతున్నాయి. ఇక ఇరాన్ అయితే వరసబెట్టి సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ వంటి దేశాల మీద దాడులు పెద్ద ఎత్తున చేస్తోంది. ఇందుకోసం డ్రోన్లు, క్షిపణులని బాగా వినియోగిస్తోంది. అరబ్ దేశాలకు చెందిన ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసేందుకు ఇరాన్ సిద్ధపడడంతో అరబ్ దేశాలు కూడా ఇక తెగించాల్సిందే అని నిర్ణయించుకున్నాయి. అరబ్ దేశాలకు ఈ ఇరవై రోజులలోనే ఆర్ధికంగా కునారిల్లే విధంగా దెబ్బ పడింది.
సౌదీ అరేబియా మండిపోతోంది :
అంతర్జాతీయ చమురు సరఫరాలో ఏకంగా ఇరవై శాతం వాటా కలిగిన హార్ముజ్ జల సంధి మూసుకుని పోవడం పెద్ద ఇబ్బందిగా ఉంది అంతే కాదు కేవలం ఒక్క వారం తేడాలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 39 శాతం పెరిగి, బ్యారెల్‌కు 110 డాలర్ల పైకి చేరిందని చెబుతున్నారు. దాంతో ఇపుడు సౌదీ అరేబియా మండిపోతోంది. ఇరాన్ కి ఆ వేడిలో ఒక ఘాటు హెచ్చరిక జారీ చేసింది. మా సహనం అనంతం అన్నది ఏ మాత్రం కాదని స్పష్టం చేస్తోంది. ఇపుడు మా ఆర్థిక వనరులపై దాడులు జరిగితే మేము చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తోంది. ఆ మీదట సైనిక చర్యకు సైతం సిద్ధమని అల్టిమేటం జారీ చేయడం ఇరాన్ కి భారీ షాక్ అని చెప్పాల్సిందే
ఇరాన్ చితికి చిద్రమే :
అరబ్ దేశాల ఆగ్రహం ముందు ఇరాన్ విలవిలలాడాల్సిందే అని అంటున్నారు. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలు అన్నీ ఒక్కటై అమెరికా ఇజ్రాయెల్ మద్దతుతో ఇరాన్ పైన భారీ స్థాయిలో విరుచుకుపడితే ఏమవుతుంది అన్నది ఎవరికైనా సులువుగానే అర్ధం అవుతుంది. ఇరాన్ చితికి చిద్రమవుతుంది. ఇరాన్ మళ్ళీ బతికి బట్టకట్టాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుందో అన్నది ఒక మాట అయితే అసలు ఆ దేశం ఉనికిలో ఉంటుందా అన్నది మరో మాట. ఇవన్నీ రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తూ చెబుతున్న విషయాలు. ఇక ఒక వైపు అరబ్ దేశాలు మరో వైపు అమెరికా ఇజ్రాయెల్ కలిస్తే కనుక ఇరాన్ అణు కేంద్రాలు కుప్ప కూలుతాయి.అలాగే ఇరాన్ క్షిపణి లాంచ్ ప్యాడ్ లు విద్వంశం అవుతాయి. అదే సమయంలో ఇరాన్ కూడా తన వద్ద ఉన్న భారీ క్షిపణి నిల్వలని బయటకు తీస్తుందని అంటున్నారు. ఆ మీదట డ్రోన్లతో గల్ఫ్ దేశాలలోని విమానాశ్రయాలు, హోటళ్లు, డీశాలినేషన్ ప్లాంట్లపై దాడి చేసే ప్రమాదం ఉందని కూడా చెబుతున్నారు. ఇలా మూడవ ప్రపంచ యుద్ధానికి ఈ పరిణామం దారి తీసినా తీయవచ్చు అని అంటున్నారు.
గల్ఫ్ దేశాలు సంగతేంటి :
ఇలా యుద్ధం అన్నది మొదలైతే కనుక అది గల్ఫ్ ప్రాంతానికే పరిమితం కాదని అంటున్నారు. సుదీర్ఘ కాలం యుద్ధం కొనసాగితే మాత్రం గల్ఫ్ దేశాల జీడీపీ ఏకంగా 5 నుంచి 14 శాతం దాకా పడిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. అదే సమయంలో దుబాయ్, దోహా వంటి పర్యాటక , వ్యాపార కేంద్రాలకు వెళ్లేందుకు పెట్టుబడిదారులు ఆలోచిస్తారని అంటున్నారు. ఇక గల్ఫ్ దేశాల ఇమేజ్ ఒక్కసారిగా దెబ్బ తింటుందని అంటున్నారు అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార , ఇంధన ధరలు పెరుగుతాయని అంటున్నారు.
