‘దేవుడిపై యుద్ధం’ పేరుతో ఉరి.. ఇరాన్‌లో కన్నీటిపర్యంతమైన మరో ప్రాణం!
స్వేచ్ఛగా జీవించడం ఒక నేరమా? మనసులోని భావాన్ని గొంతు విప్పి చెప్పడం దేవుడిపై యుద్ధం చేయడమేనా? ఇరాన్ ఉక్కుపాదం కింద మరొక అమాయక ప్రాణం అనంత వాయువుల్లో కలసిపోయింది.
By: A.N.Kumar | 2 Aug 2026 5:19 PM ISTస్వేచ్ఛగా జీవించడం ఒక నేరమా? మనసులోని భావాన్ని గొంతు విప్పి చెప్పడం దేవుడిపై యుద్ధం చేయడమేనా? ఇరాన్ ఉక్కుపాదం కింద మరొక అమాయక ప్రాణం అనంత వాయువుల్లో కలసిపోయింది. కళ్లల్లో వెయ్యి ఆశలు, గుండెల్లో స్వేచ్ఛాయుత భవిష్యత్తుపై కలలతో జీవిస్తున్న 20 ఏళ్ల అర్విన్ ఖైర్ఖాను ఇరాన్ ప్రభుత్వం జైలు చీకట్లలో ఉరితీసింది. ఉరితాడు బిగుసుకుంటున్న వేళ.. ఆ యువకుడి కళ్లల్లో మెదిలిన భయం, ఆ తల్లి కడుపుకోత, కుటుంబ సభ్యుల ఆక్రందనలు అంతర్జాతీయ సమాజం గుండెలను పిండేస్తున్నాయి.
నిరసన స్వారానికి మరణశిక్షే జవాబా?
ఇరాన్‌లో ఇటీవల వెల్లువెత్తిన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు కేవలం ఒక రాజకీయ పోరాటం మాత్రమే కాదు. అది అక్కడి ప్రజల ఆత్మగౌరవ పోరాటం. మహిళల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ, కఠిన ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన లక్షలాది మందిలో అర్విన్ ఖైర్ఖా కూడా ఒకడు. కానీ అక్కడి న్యాయవ్యవస్థ అతనిపై మోపిన నింద ఏంటో తెలుసా? ‘మొహారెబెహ్’ అంటే దేవుడిపై యుద్ధం ప్రకటించడం.. దేవుణ్ని దూషించడం... హక్కుల కోసం ప్రశ్నించే గొంతుకలను నొక్కడానికి ఇరాన్ ప్రభుత్వం మతపరమైన ఆరోపణలను ఒక ఆయుధంగా మలచుకుంటోందనడానికి ఈ ఉరిశిక్షే ప్రత్యక్ష నిదర్శనం. గతంలోనూ ఇద్దరు యువకులను బహిరంగంగా ఉరితీసి భయాందోళనలు సృష్టించిన పాలకులు, ఇప్పుడు అర్విన్‌ను బలితీసుకుని తమ రాక్షసత్వాన్ని మరోసారి చాటుకున్నారు.
కన్నీటి సరస్సుగా మారిన పతనం
హక్కుల సంస్థల ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ నిరసనల అలజడిలో ఇప్పటివరకు 30,000 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాల తులనాత్మక కాల్పులు, కస్టడీ మరణాలు, అర్థరాత్రి అరెస్టులు ఇరాన్ వీధులను రక్తాసిక్తం చేస్తున్నాయి. సమాజానికి ఏదో చేయాలనే తపన ఉన్న వయసులోనే అర్విన్ ఊపిరిని నిలిపివేశారు. అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండిస్తున్నా ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఇది తమ "చట్టబద్ధమైన చర్య" అని సమర్థించుకోవడం శోచనీయం.
విన్నారా ఈ ఆక్రోశం?
మానవ హక్కుల సంస్థలు ఎంతగా విజ్ఞప్తులు చేసినా నిరసనకారులపై పగబట్టినట్లు వ్యవహరిస్తున్న ఇరాన్ వైఖరి మారడం లేదు. అర్విన్ ఖైర్ఖా ఉరిశిక్ష వార్త బయటకు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలని, ప్రాథమిక హక్కులని బూడిద చేస్తూ ‘దేవుడి పేరుతో’ ఒక పసిప్రాణాన్ని తీసే హక్కు ఎవరిచ్చారంటూ మానవతావాదులు ప్రశ్నిస్తున్నారు.
అర్విన్ ఖైర్ఖా ఇక లేడు.. కానీ అతను చిందించిన ప్రతీ రక్తపు బొట్టు.. ఆయన విడిచిన చివరి శ్వాస ఇరాన్ ఉద్యమానికి మరో నిప్పుకణికగా మారక మానదు.
