Begin typing your search above and press return to search.

ఇరాన్ ఆఖరి అస్త్రం.. ఏమిటీ డర్టీ బాంబ్? దీని ప్రభావం ఎంత?

మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు ఒక భయంకరమైన మలుపు తిరిగాయి.

By:  A.N.Kumar   |   23 March 2026 1:19 PM IST
ఇరాన్ ఆఖరి అస్త్రం.. ఏమిటీ డర్టీ బాంబ్? దీని ప్రభావం ఎంత?
X

మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు ఒక భయంకరమైన మలుపు తిరిగాయి. ఇరాన్ తో ఇజ్రాయెల్ , అమెరికాల మధ్య కొనసాగుతున్న ప్రతీకార దాడులు 22వ రోజుకు చేరుకున్నా శాంతి సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. అయితే ఈ పోరులో ఇరాన్ తన మనుగడ కోసం "డర్టీ బాంబ్" అనే ప్రమాదకరమైన ఆయుధాన్ని తన 'లాస్ట్ ఆప్షన్'గా వాడుతుందా? అనే చర్చ ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఏమిటీ డర్టీ బాంబ్? దీని ప్రభావం ఎంత?

డర్టీ బాంబ్ అనేది సాంప్రదాయ అణు బాంబు వంటిది కాదు. ఇది ఒక 'రేడియోలాజికల్ డిస్పర్సల్ డివైజ్'. డైనమైట్ వంటి సాధారణ పేలుడు పదార్థాలకు రేడియోధార్మిక వ్యర్థాలను లేదా పదార్థాలను కలిపి దీనిని తయారు చేస్తారు. అణు బాంబులా ఇది నగరాన్ని ఒక్కసారిగా బూడిద చేయదు. కానీ, పేలుడు జరిగిన తర్వాత కిలోమీటర్ల మేర రేడియోధార్మిక ధూళిని గాలిలోకి విడుదల చేస్తుంది. ఇది గాలి, నీరు , నేలను విషపూరితం చేస్తుంది. దీనివల్ల తక్షణ ప్రాణనష్టం తక్కువగా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ప్రజలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారు. ఒక ప్రాంతంలో డర్టీ బాంబ్ పేలితే ఆ ప్రాంతాన్ని రేడియేషన్ రహితం చేయడం అసాధ్యం లేదా అత్యంత ఖర్చుతో కూడుకున్న పని.. దీనివల్ల వాణిజ్య కేంద్రాలు, నివాస ప్రాంతాలు దశాబ్దాల పాటు నిర్జన ప్రదేశాలుగా మారిపోతాయి.

ఇరాన్ వద్ద ఉన్న సామర్థ్యం ఏమిటి?

అణు బాంబు తయారీకి దాదాపు 90 శాతం శుద్ధి చేసిన యురేనియం అవసరం కాగా డర్టీ బాంబ్‌కు అంత కఠినమైన ప్రమాణాలు అవసరం లేదు. కేవలం 60 శాతం శుద్ధి చేసిన యురేనియం ఉన్నా ఈ బాంబును రూపొందించవచ్చు.

అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఇరాన్ వద్ద ప్రస్తుతం సుమారు 450 కిలోల మేర 60 శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. యుద్ధం తీవ్రస్థాయికి చేరి ఇజ్రాయెల్ దాడుల వల్ల దేశ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని భావిస్తే ఇరాన్ ఈ "డర్టీ బాంబ్" అస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉందని అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాలు తీవ్రంగా అనుమానిస్తున్నాయి.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని ఎంచుకుంటే అది కేవలం యుద్ధ క్షేత్రానికే పరిమితం కాదు. గల్ఫ్ ప్రాంతంలోని కీలకమైన చమురు రవాణా మార్గాలు హోర్ముజ్ జలసంధి వంటివి రేడియోధార్మిక ముప్పుకు గురైతే, ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరల పెరుగుదలకు, ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది.

నైతిక , మతపరమైన పరిమితులు

అయితే ఇరాన్ ఈ అడుగు వేస్తుందా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇరాన్ అత్యున్నత నాయకత్వం గతంలోనే 'అణ్వాయుధాలు లేదా సామూహిక వినాశకర ఆయుధాల తయారీ ఇస్లామిక్ సిద్ధాంతాలకు విరుద్ధం' అని ఫత్వా జారీ చేసింది. కానీ దేశ అస్తిత్వం ప్రశ్నార్థకమైనప్పుడు మతపరమైన పరిమితుల కంటే వ్యూహాత్మక అవసరాలకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

అంతర్జాతీయ సమాజం ముందున్న సవాలు

ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇరాన్ అణు కేంద్రాలపై నిఘాను పెంచాలని కోరుతున్నాయి. యుద్ధాన్ని దౌత్యపరంగా ముగించకపోతే "డర్టీ బాంబ్" భయం కేవలం ఊహగానే మిగిలిపోకుండా వాస్తవ రూపం దాల్చే ప్రమాదం ఉంది. ఒకవేళ అదే జరిగితే అది ఆధునిక మానవ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది.