Begin typing your search above and press return to search.

ట్రంప్ చర్చల పాటకు.. ఇరాన్ షాకింగ్ వీడియో రియాక్షన్!

ట్రంప్ నుంచి వచ్చిన చర్చల రాగానికి ఏ మాత్రం పట్టించుకోకుండా తన శక్తియుక్తుల్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేయటం ఇప్పుడు సరికొత్త ఉద్రిక్తతలకు దారి తీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

By:  Garuda Media   |   26 March 2026 12:44 PM IST
ట్రంప్ చర్చల పాటకు.. ఇరాన్ షాకింగ్ వీడియో రియాక్షన్!
X

‘ఇరాన్ సంగతి చూస్తే.. మహా అయితే మూడు వారాల్లో వారి పని ఫినిష్..వాళ్లేమనుకుంటున్నారు.. మేం అమెరికా’ అంటూ ప్రపంచ పోలీస్ పాత్రకు సదా సిద్ధంగా ఉండే అగ్రరాజ్య అధినేత ట్రంప్ ఘీంకారం యావత్ ప్రపంచం చూసింది. కట్ చేస్తే.. మూడు వారాలు దాటినంతనే.. ఇరాన్ తో చర్చలకు సిద్ధమని.. వారు కాల్పులకు ఓకే చెప్పారని.. ఇరాన్ నుంచి తనకో అద్భుతమైన బహుమతి వచ్చిందంటూ ట్రంప్ చెబుతున్న మాటలకు భిన్నంగా ఇరాన్ తీరు ఉండటం ఇప్పుడు షాకిచ్చేలా మారింది.

తాను ఏం చెబితే తాను టార్గెట్ దేశం అదేలా రియాక్టు కావాలన్నట్లుగా ట్రంప్ తీరు ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే.. ట్రంప్ కు మించిపోయే మొండితనాన్ని ప్రదర్శిస్తోంది ఇరాన్. ట్రంప్ కు వరుస షాకులు ఇచ్చేలా దాని మిత్రదేశాలపై దాడులు చేస్తూ కొత్త తరహా యుద్ధానికి తెర తీసింది. దీంతో.. ట్రంప్ లాంటి మొండి మనిషి దారికి వచ్చేలా చేస్తోంది ఇరాన్. అయితే.. ఇక్కడే అనూహ్య ట్విస్టు నెలకొంది.

ట్రంప్ నుంచి వచ్చిన చర్చల రాగానికి ఏ మాత్రం పట్టించుకోకుండా తన శక్తియుక్తుల్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేయటం ఇప్పుడు సరికొత్త ఉద్రిక్తతలకు దారి తీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యుద్ధ విరమణ జరగాలంటే.. యుద్ధంలో తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించి తమ షరతులకు అంగీకరిస్తేనే కాల్పుల విరమణ ఉంటుందని తేల్చి చెప్పిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

అంతేకాదు.. తన సత్తా గురించి ప్రపంచానికి అర్థమయ్యేలా ఒక వీడియోను పోస్టు చేసింది. ఎప్పుడు చేశాం.. ఎక్కడ చేశామన్న వివరాల్ని వెల్లడించని ఇరాన్.. అగ్రరాజ్యానికి చెందిన ఎఫ్ 18 యుద్ధ విమానాన్ని కూల్చేసిన విషయాన్ని వెల్లడించి.. దానికి సంబంధించిన వీడియోను పోస్టు చేసింది. యూఎస్ కు చెందిన ఫైటర్ జెట్ ను కూల్చేశాం. విజయవంతంగా టార్గెట్ పూర్తి చేసినట్లుగా తెలిపింది.ఈ వీడియోపై అమెరికా ఇంకా స్పందించలేదు.

ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఇరాన్ నుంచి వస్తున్న ప్రకటనలు మరో ఎత్తుగా చెప్పాలి. తాజాగా చేసిన ప్రకటనలో.. తమ దేశంపై చేసిన దురాక్రమణకు పశ్చాతాప పడే వరకు దాడులు ఉంటాయని చెబుతూ.. ట్రంప్ తగ్గినా తాము తగ్గేదే లేదన్నట్లుగా ఉండటం గమనార్హం. యుద్దాన్ని అగ్రరాజ్యం షురూ చేస్తే.. ఆ యుద్ధాన్ని ఎప్పుడు ముగించాలన్నది తాము డిసైడ్ చేస్తామన్నట్లుగా ఇరాన్ తీరు ఉందని చెప్పాలి. ఇదంతా ప్రపంచానికి ఎలాంటి తిప్పలు తెచ్చి పెడుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.