అమెరికా మొదలు పెట్టేసిందా... బందర్ పోర్టులో ఏమి జరిగింది..!
అయితే ఈ ప్రచారాన్ని స్థానిక అధికారిక మీడియా ఖండించింది. గ్యాస్ లీక్ వల్ల ఈ పేలుడు సంభవించినట్లు చెబుతోంది.
By: Raja Ch | 1 Feb 2026 9:53 AM ISTపశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని.. గల్ఫ్ లో అమెరికా బలగాలు పెరుగుతున్నాయని.. యుద్ధ విమానాల వాహన నౌక మొహరించబడిందని.. సైన్యం బయలుదేరిందని కథనాలొస్తున్న వేళ.. టెహ్రాన్ తన అణు కార్యక్రమంపై ఒప్పందం కుదుర్చుకోవాలని డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తెస్తోన్న నేపథ్యంలో ఇరాన్ లో ఓ భారీ పేలుడు సంభవించింది. దీంతో... అనధికారికంగా అమెరికా అప్పుడే పని మొదలుపెట్టేసిందా అనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... వాషింగ్టన్ - టెహ్రాన్ ల మధ్య వాతావారణం వేడెక్కుతుందని.. వ్యవహారం చర్చలతో ముగిసేలా కనిపించడం లేదని కథనాలొస్తోన్న వేళ.. ఇరాన్ లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఆ దేశంలోని బందర్ అబ్బాస్ పోర్టులో భారీ పేలుడు సంభవించింది. ఇరాన్ రెవల్యుషనరీ గార్డ్ నేవీ కమాండర్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో.. ఇది అమెరికా పనే అయ్యి ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
అయితే ఈ ప్రచారాన్ని స్థానిక అధికారిక మీడియా ఖండించింది. గ్యాస్ లీక్ వల్ల ఈ పేలుడు సంభవించినట్లు చెబుతోంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. 14 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు చెబుతున్నారు. మరోవైపు అహ్వాజ్ నగరంలో మరో పేలుడు సంభవించిందని.. ఈ ఘటనలో నలుగురు మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై స్పందించిన స్థానిక అగ్నిమాపక శాఖ అధికారులు... గ్యాస్ లీక్ వల్లే ఈ ప్రమాదాలు సంభవించాయని తెలిపారు.
ఇక్కడ గమనించాల్సిన కీలక విషయం ఏమిటంటే... ప్రపంచ వ్యాప్తంగా, ప్రధానంగా పశ్చిమాసియాలో ఇంధన సరఫరాలో కీలక భూమిక పోషిస్తోన్న హార్మూజ్ జలసంధిలోనే ఈ బందర్ అబ్బాస్ పోర్టు ఉంది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు ఐదో వంతు సరఫరా ఈ మార్గం ద్వారానే అవుతుండగా.. ఈ ప్రాంతంలో పేలుడు సంభవించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మరో రెండు మూడు రోజుల్లో హార్మూజ్ లో ఇరాన్ నౌకాదళ విన్యాశాలు చేయనున్నట్లు వార్తలొస్తున్న వేళ ఈ ఘటన జరిగింది!
అయితే... యూఎస్ - ఇరాన్ మధ్య వాతావరణం వేడెక్కుతున్న అంశంపై శనివారం స్పందించిన డొనాల్డ్ ట్రంప్... రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున ఇరాన్ తమతో మాట్లాడుతుందని అన్నారు. వారు చర్చలు జరుపుతున్నారని.. తాము ఏమి చేయగలమో చూద్దామని.. లేదంటే, ఏమి జరుగుతుందో వేచి చూద్దామని అంటూ.. ఓ పెద్ద నౌకాదళం బయలుదేరుతోందని అన్నారు. మరోవైపు.. ఈ వివాదం ఏ దేశానికీ మంచిది కాదని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అన్నారు.
ఇదే సమయంలో... అమెరికా, ఇజ్రాయెల్ తో పాటు యురోపియన్ యూనియన్ నాయకులు.. ఇరాన్ ఆర్థిక సమస్యలను ఉపయోగించుకుంటున్నారని.. అశాంతిని రేకెత్తిస్తున్నారని.. ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రజలకు మార్గాలను అందిస్తున్నారని ఆరోపించారు. అయితే... ఇరాన్ లో జరిగిన పేలుళ్లలో ఇజ్రాయెల్ ప్రమేయం ఏమీ లేదని ఆ దేశ అధికారులు వెల్లడించారు. ఇరాన్ ఆరోపణలు పూర్తిగా సత్యదూరాలని తెలిపారు.
కాగా... గత ఏడాది ఏప్రిల్ లోనూ ఈ ఓడ రేవులో భారీ పేలుడు సంభవించింది! ఆ ఘటనలో డజన్ల కొద్దీ ప్రజలు మరణించగా.. సుమారు 1000 మందికి పైగా గాయపడ్డారు. దీనిపై స్పందించిన దర్యాప్తు కమిటీ... పౌర రక్షణ, భద్రతా సూత్రాలను పాటించడంలో లోపాలే ఈ పేలుడుకు కారణమని తెలిపింది!
