ఇరాన్ హిట్ లిస్ట్ రెడీ ..టాప్ పేరు ఎవరిది అంటే ?
ఈ క్రమంలోనే ఇరాన్ ఒక హిట్ లిస్ట్ ని రెడీ చేసింది. దానిని ఇరాన్ పత్రిక హమ్‌షహ్రీలో ప్రచురించారు కూడా. ఆ హిట్ లిస్ట్ లో అమెరికా యూరప్ నేతలు టార్గెట్ గా ఉండడం విశేషం.
By: Satya P | 14 July 2026 12:11 AM ISTఇరాన్ ఇపుడు ప్రతీకారంలో రగిలిపోతోంది. అవును ఆ దేశ అధినేత ఖమేనీని ఫిబ్రవరి నెలాఖరులో జరిగిన అమెరికా ఇజ్రాయెల్ దాడులలో తొలి రోజే చంపేశారు. ఆ తరువాత నుంచి నేటి దాకా ఇరాన్ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ అసలే పట్టుదల కల దేశం. తమకు ఎవరు ఎదురొచ్చినా వడ్డీతో సహా ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఇరాన్ ఒక హిట్ లిస్ట్ ని రెడీ చేసింది. దానిని ఇరాన్ పత్రిక హమ్‌షహ్రీలో ప్రచురించారు కూడా. ఆ హిట్ లిస్ట్ లో అమెరికా యూరప్ నేతలు టార్గెట్ గా ఉండడం విశేషం.
ఖమేనీ హత్యకు ప్రతీకారంగా :
ఈ హిట్ లిస్ట్ ని రెడీ చేయడం వెనక అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం కీలకంగా ఉంది. తమ అధినేతను కాకుండా చేసిన వారి మీద తప్పదు ప్రతి దాడి అంటూ కూడా హెచ్చరిస్తూ ఈ జాబితాను సిద్ధం చేశారు. ఈ జాబితాలో ఏకంగా 13 మంది టాప్ నేతలు ఉన్నారు. ఇక ఈ జాబితాను నేరస్థుల జాబితా అంటూ అలీ ఖమేనీ కుమారుడు ప్రస్తుతం అధినేత మొజ్తబా ఖమేనీ స్పష్టం చేయడంతో ఇది సంచలనంగా మారింది. ఈ జాబితాలో టాప్ పేరు అమెరికా ప్రెసిడెంట్ డొనాడ్ల్ ట్రంప్ ఉంటే రెండో పేరు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఉంది. ఆ తరువాత బ్రిటన్ ఆపద్ధర్మ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌ల పేర్లు ఉన్నాయి. వీరితో పాటు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఇది అధికారికం కాదని అదే పత్రిక వెల్లడించింది.
అంతర్జాతీయ సంచలనం :
ఇరాన్ లోని ప్రముఖ పత్రిక ఈ విధంగా హిట్ లిస్ట్ అంటూ ప్రచురించిన ఈ జాబితా ఇపుడు అంతర్జాతీయంగా తీవ్ర సంచలనంగా మారింది. ఒక విధంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇరాన్ దివంగత మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా అమెరికా ఇజ్రాయెల్ యూరప్ దేశాల అధినేతలే లక్ష్యంగా తయారు చేసిన హిట్‌లిస్ట్ గా దీనిని పేర్కొంటున్నారు. ఇలా 13 మంది విదేశీ నేతల ఫోటోలతో కూడిన ఒక ఇన్ఫోగ్రాఫిక్‌ను తాజాగా ఆన్‌లైన్‌లో ప్రచురించింది. దాంతో ఒక్కసారిగా ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
జాతి సంకల్పం అంటూ :
ఇక అలీ ఖమేనీ వారసుడిగా ఇరాన్ పగ్గాలు అందుకున్న కుమారుడు మొజ్తబా ఖమేనీ అయితే ప్రతీకారం తీర్చుకోవడం అన్నది ఇరాన్ జాతి సంకల్పం అని స్పష్టం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కచ్చితంగా అది నెరవేరుతుంది అని కూడా ఆయన పేర్కొన్నారు. తన తండ్రిని పొట్టన పెట్టుకున్న వారు అంతా నేరస్థులు అని వారంతా మంచం మీదే ప్రశాంతంగా చనిపోవాలన్న కోరికను తమతో పాటే సమాధిలోకి తీసుకువెళతారు అని కూడా ఆయన హెచ్చరించినట్లుగా చెబుతున్నారు. అలీ ఖమేనీ అంత్యక్రియల తర్వాత మొజ్తబా ఈ విధంగా హెచ్చరించారని అంటున్నా ఆయన ఎవరా నేరస్తులు అన్నది మాత్రం ఎక్కడా బయటపెట్టలేదు కానీ ఇరాన్ పత్రిక హమ్‌షహ్రీ మాత్రం 13 మంది విదేశీ నేతల పేర్లు ఫోటోలు వేసి మరీ హిట్ లిస్ట్ అని బయట పెట్టడం విశేషం.
యూరప్ నేతలు ఎందుకంటే :
ట్రంప్ అలాగే నెతన్యాహు కలసి ఇరాన్ మీద దాడులకు పాల్పడ్డారు. యుద్ధ తంత్రం వారు నెరిపారు. మరి యూరప్ దేశాధినేతలు ఏమి పాపం చేశారు అన్న ప్రశ్న సహజంగా వస్తోంది. అయితే దీనికి ఇరాన్ వద్ద జవాబు ఉంది అంటున్నారు. ఇరాన్ మీద యుద్ధం సమయంలో తమ భూభాగం మీద దాడులను నిలువరించడంలో యూరోపియన్ దేశాలు విఫలం అయ్యాయని ఇరాన్ గుర్రుగా ఉంది. అంతే కాదు అమెరికా సైనిక విమానాలకు తమ గగన తలాన్ని వాడుకోవడానికి అనుమతి ఇచ్చి ఈ దేశాధినేతలు ఈ నేరంలో పాలు పంచుకున్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది.
