Begin typing your search above and press return to search.

జైషే మొహ్మద్ భారీ ఉగ్రకుట్ర భగ్నం.. దేశభద్రతను కాపాడిన తెలుగోడు

జమ్మూ కశ్మీర్‌లో అత్యంత ప్రమాదకరమైన జైషే మొహ్మద్ ఉగ్ర సంస్థ పన్నిన భారీ ఉగ్రదాడి కుట్రను సమర్థవంతంగా భగ్నం చేసింది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన ధైర్యవంతుడు, ఐపీఎస్ అధికారి సందీప్ చక్రవర్తి.

By:  A.N.Kumar   |   12 Nov 2025 3:58 PM IST
జైషే మొహ్మద్ భారీ ఉగ్రకుట్ర భగ్నం.. దేశభద్రతను కాపాడిన తెలుగోడు
X

దేశ భద్రతను కాపాడటంలో తెలుగు బిడ్డ మరోసారి తన అద్భుతమైన ప్రతిభను చాటుకున్నారు. జమ్మూ కశ్మీర్‌లో అత్యంత ప్రమాదకరమైన జైషే మొహ్మద్ ఉగ్ర సంస్థ పన్నిన భారీ ఉగ్రదాడి కుట్రను సమర్థవంతంగా భగ్నం చేసింది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన ధైర్యవంతుడు, ఐపీఎస్ అధికారి సందీప్ చక్రవర్తి.

కర్నూలు జిల్లాకు చెందిన ఈ 2014 బ్యాచ్ ఐపీఎస్ అధికారి, తన స్మార్ట్ ఇన్వెస్టిగేషన్ పద్ధతితో దేశవ్యాప్తంగా ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని జరపాలనుకున్న ఘోరమైన కుట్రను ముందుగానే అడ్డుకున్నారు. యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న సందీప్ చక్రవర్తి... తాజా ఆపరేషన్‌తో మరోసారి దేశం గర్వపడేలా చేశారు.

* స్మార్ట్ ఇన్వెస్టిగేషన్‌తో బట్టబయలైన కుట్ర

గత నెలలో కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో జైషే మొహ్మద్ సంస్థకు చెందిన పోస్టర్లు కనిపించడంతో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ పోస్టర్లను ఆధారం చేసుకుని, సందీప్ చక్రవర్తి నేతృత్వంలోని ప్రత్యేక బృందం (స్పెషల్ టీమ్) వెంటనే రంగంలోకి దిగింది. సీసీ కెమెరా ఫుటేజీలను నిశితంగా విశ్లేషించగా పాత కేసుల్లో నిందితులుగా ఉన్న ముగ్గురు అనుమానితులను గుర్తించారు.

వారిని అదుపులోకి తీసుకుని ఇద్దరి మొబైల్ కాల్ రికార్డులు, ఆన్‌లైన్ చాట్ వివరాలను పరిశీలించగా దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులపై భారీ టెర్రర్ దాడి చేయాలన్న భయంకరమైన కుట్ర బయటపడింది. దాదాపు రెండు వారాలపాటు నిశిత విచారణ జరిపిన సందీప్ బృందం, ఈ ముఠాను సమూలంగా అణచివేసి, వేలాది ప్రాణాలను బలిగొనే ప్రమాదం ఉన్న ఉగ్ర దాడిని ముందే అడ్డుకోగలిగింది.

* ఆరుసార్లు 'ప్రెసిడెంట్ గాలంట్రీ మెడల్' విజేత

సందీప్ చక్రవర్తి తన పదవీ ప్రస్థానంలో కశ్మీర్‌లో అనేక కీలక ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఉగ్రవాదులను అణచివేయడంలో శాంతి భద్రతలను కాపాడటంలో ఆయన చూపిన అసమాన ధైర్యసాహసాలు, సమర్థతకు గుర్తింపుగా ఇప్పటివరకు ఆయనకు ఆరు సార్లు ప్రెసిడెంట్ గాలంట్రీ మెడల్ లభించింది. ఆయన ఆలోచనా వేగం, నిబద్ధత వల్ల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా పలుమార్లు ప్రశంసలు తెలిపింది.

దేశం భద్రత ముందు తన ప్రాణం కూడా లెక్క కాదన్న ధీరత్వం ప్రదర్శించిన సందీప్ చక్రవర్తి.. భారతదేశం భద్రతకు ముప్పు కలిగించే ఉగ్ర ముఠాలను అణచివేసే విషయంలో తెలుగువారి ధైర్యాన్ని, తెలివితేటలను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు.