Begin typing your search above and press return to search.

సేఫ్టీ ఎక్కడ? మహిళా పోలీస్‌కే వేధింపులు!.. కట్ చేస్తే!

హైదరాబాద్ నగరంలో అర్థరాత్రి మహిళల భద్రత ఎలా ఉందో తెలుసుకోవాలని భావించిన మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతికి చేదు అనుభవం ఎదురైంది.

By:  Madhu Reddy   |   7 May 2026 6:45 PM IST
సేఫ్టీ ఎక్కడ? మహిళా పోలీస్‌కే వేధింపులు!.. కట్ చేస్తే!
X

హైదరాబాద్ నగరంలో అర్థరాత్రి మహిళల భద్రత ఎలా ఉందో తెలుసుకోవాలని భావించిన మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతికి చేదు అనుభవం ఎదురైంది. స్వయంగా ఆమె సాధారణ దుస్తుల్లో రోడ్డుపైకి వెళ్లగా, పలువురు వ్యక్తులు ఆమెను వేధించే ప్రయత్నం చేశారు. ఒక ఐపీఎస్ అధికారిణికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సాహసోపేతమైన ఆపరేషన్ మరియు అందులో తేలిన నగ్న సత్యాల గురించి ఈ కథనం..

సాధారణ మహిళగా పోలీస్ బాస్:

కొత్తగా ఏర్పడిన మల్కాజిగిరి కమిషనరేట్ బాధ్యతలు చేపట్టిన బి. సుమతి , మే 2వ తేదీ అర్ధరాత్రి దిల్‍సుఖ్‌నగర్ వీధుల్లోకి వెళ్లారు. ఆమె వెంట గన్‌మెన్లు కానీ, యూనిఫాం పోలీసులు కానీ లేరు. ఒక సాధారణ మహిళలా బస్సు కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఆమె బస్టాప్‌లో నిలబడ్డారు. నగరంలో మహిళలు అర్ధరాత్రి వేళ ఎంత ధైర్యంగా తిరగగలరో ప్రత్యక్షంగా చూడటమే ఆమె ఉద్దేశ్యం.

నిమిషాల్లోనే మొదలైన వేధింపులు:

ఆమె రోడ్డుపై నిలబడిన కొద్దిసేపటికే అసలు రంగు బయటపడింది. టీనేజర్ల నుండి మధ్యవయస్కుల వరకు చాలా మంది ఆమెను సమీపించి అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. కొందరైతే ఏకంగా అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశారు. ఇక అక్కడ వాహనాలు తిరుగుతున్నా, ఆమె సాధారణ దుస్తుల్లో ఉండటంతో ఎవరూ గుర్తుపట్టలేదు. సుమారు మూడు గంటల పాటు ఆమె అదే ప్రాంతంలో ఉండి అక్కడి పరిస్థితులను గమనించారు.

40 మందికి పైగా అరెస్ట్:

చివరికి తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఒక కానిస్టేబుల్ ఆమెను గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ఆమెను వేధించిన సుమారు 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వీరిలో ఎక్కువ మంది హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు కావడం గమనార్హం. పట్టుబడిన వారిలో చాలా మంది మద్యం, గంజాయి మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

కౌన్సెలింగ్‌తో బుద్ధి చెప్పిన వైనం:

అదుపులోకి తీసుకున్న వారిని కేవలం జైలుకు పంపడమే కాకుండా, వారి తల్లిదండ్రుల సమక్షంలో కమిషనర్ సుమతి గారు స్వయంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఒక మహిళ ఒంటరిగా కనిపిస్తే గౌరవించాల్సింది పోయి, వేధించడం ఎంతటి నేరమో వారికి అర్థమయ్యేలా చెప్పారు. ఇక ఈ ఆపరేషన్ తర్వాత ఆ ప్రాంతంలో డ్రోన్లతో నిఘా పెంచడమే కాకుండా షీ టీమ్స్ గస్తీని మరింత ముమ్మరం చేశారు.

సుమతి చేసిన ఈ ప్రయోగం మన సమాజంలోని లోపాలను ఎత్తిచూపింది. పోలీసులు ఎన్ని చట్టాలు తెచ్చినా, గస్తీ పెంచినా మనుషుల ఆలోచనా ధోరణి మారనంత వరకు మహిళలకు పూర్తి భద్రత లభించదు. ఇక ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌కే ఇలాంటి పరిస్థితి ఎదురైందంటే, సామాన్యులు ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా వీధుల్లో భద్రత మెరుగుపడుతుందని ఆశిద్దాం.