Begin typing your search above and press return to search.

ఐపీఎల్ లో ఓనర్లు, ఆటగాళ్లపై హనీట్రాప్ ఉచ్చు? బీసీసీఐ అప్రమత్తం

ఐపీఎల్ 2026 సీజన్ వేళ క్రికెట్ ప్రపంచంలో ఒక అనూహ్యమైన వార్త కలకలం రేపుతోంది.

By:  A.N.Kumar   |   9 May 2026 12:00 AM IST
ఐపీఎల్ లో ఓనర్లు, ఆటగాళ్లపై హనీట్రాప్ ఉచ్చు? బీసీసీఐ అప్రమత్తం
X

ఐపీఎల్ 2026 సీజన్ వేళ క్రికెట్ ప్రపంచంలో ఒక అనూహ్యమైన వార్త కలకలం రేపుతోంది. మైదానంలో ఫోర్లు, సిక్సర్ల హోరు కంటే ముందుగా.. మైదానం వెలుపల ఆటగాళ్ల భద్రత, క్రమశిక్షణపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఐపీఎల్ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, ఫ్రాంచైజీ అధికారులను లక్ష్యంగా చేసుకుని “హనీ ట్రాప్” ప్రయత్నాలు జరిగే ప్రమాదం ఉందని బీసీసీఐ హెచ్చరించింది.

ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్ని 10 ఫ్రాంచైజీలకు ఏడు పేజీల సుదీర్ఘమైన అడ్వైజరీని పంపారు. గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. ఈసారి లీగ్ ప్రతిష్ఠ దెబ్బతినకుండా ఉండేందుకు బోర్డు ముందస్తుగా ఈ కఠిన చర్యలకు ఉపక్రమించింది.

ఏమిటీ హనీ ట్రాప్ ముప్పు?

హై-ప్రొఫైల్ లైఫ్ స్టైల్ గడిపే క్రికెటర్లను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత సంబంధాల ద్వారా వారిని ప్రలోభపెట్టి తద్వారా బ్లాక్‌మెయిల్ లేదా లోపాయికారీ సమాచారాన్ని రాబట్టే ప్రయత్నాలు పెరిగే అవకాశం ఉందని బీసీసీఐ భావిస్తోంది. ఇటువంటి ఘటనలు ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలనే కాకుండా మొత్తం టోర్నమెంట్ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తాయని బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. లైంగిక ఆరోపణలు, న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండాలంటే అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

రంగంలోకి ప్రత్యేక టాస్క్ ఫోర్స్

ఈ నిఘాను పటిష్టం చేసేందుకు బీసీసీఐ ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఇందులో బోర్డు ఉన్నతాధికారులతో పాటు ఐపీఎల్ ఆపరేషన్స్ టీమ్ సభ్యులు ఉంటారు. వీరి ప్రధాన బాధ్యతలు ఆటగాళ్లు బస చేసే హోటల్ గదుల్లో నిరంతరం తనిఖీలు నిర్వహించడం... సందర్శకులపై నిఘా ఉంచి గదుల్లోకి ఎవరు వస్తున్నారు? అనుమతి లేకుండా ఎవరైనా కలుస్తున్నారా? అన్నది పర్యవేక్షిస్తారు. ప్రతి అతిథి రాకపోకలను టీమ్ మేనేజర్లు తప్పనిసరిగా రికార్డు చేయాలి.

కఠినమైన కొత్త నిబంధనలు

బీసీసీఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఆటగాడికి ఎంత సన్నిహితుడైనా, బంధువైనా సరే.. టీమ్ మేనేజర్ ముందస్తు అనుమతి లేకుండా గదిలోకి ప్రవేశించడానికి వీల్లేదు. "క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఆటగాళ్లు వ్యక్తిగత కారణాల వల్ల బయటకు వెళ్లినా, వినోదం కోసం వెళ్లినా 'సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్' లేదా 'టీమ్ ఇంటిగ్రిటీ ఆఫీసర్' నుండి ముందస్తు క్లియరెన్స్ తీసుకోవడం తప్పనిసరి." అని పేర్కొంది. అంతేకాకుండా మ్యాచ్ సమయంలో ఫ్రాంచైజీ యజమానులు డగౌట్‌లో ఉన్న ఆటగాళ్లతో లేదా మేనేజర్లతో ప్రత్యక్షంగా మాట్లాడకూడదని కూడా కొత్త నిబంధన విధించారు.

నిబంధనలు అతిక్రమిస్తే 'వేటు' తప్పదు!

ఈ రూల్స్ విషయంలో బీసీసీఐ చాలా సీరియస్‌గా ఉంది. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే తొలుత షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు. భారీ స్థాయిలో జరిమానాలు విధిస్తారు. తీవ్రతను బట్టి సస్పెన్షన్ లేదా టోర్నీ నుంచే డిస్‌క్వాలిఫై చేసే అవకాశం ఉంది.

మొత్తానికి ఐపీఎల్ 2026 సీజన్ ఆట పరంగానే కాకుండా అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది. క్రీడల్లో అవినీతిని, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని క్రీడా విశ్లేషకులు స్వాగతిస్తున్నారు.