ఐఫోన్ కోసం మొదలైన గొడవ.. మూడు ప్రాణాలను బలితీసుకుంది!
ఆధునిక ప్రపంచంలో ఒక వస్తువుపై పెంచుకునే పిచ్చి మోజు ఎంతటి ఘోరానికి దారితీస్తుందో చెప్పేందుకు ఈ ఘటన ఒక చేదు నిదర్శనం.
By: A.N.Kumar | 22 Aug 2026 10:39 AM ISTఆధునిక ప్రపంచంలో ఒక వస్తువుపై పెంచుకునే పిచ్చి మోజు ఎంతటి ఘోరానికి దారితీస్తుందో చెప్పేందుకు ఈ ఘటన ఒక చేదు నిదర్శనం. చేతిలో మెరిసే ఫోన్ కోసం ఓ యువకుడు ప్రదర్శించిన తీవ్ర ఆవేశం.. చివరకు అతడితో పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లిదండ్రుల ప్రాణాలను కూడా బలితీసుకుంది. క్షణికావేశంలో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం.. ఒక సంతోషకరమైన కుటుంబాన్ని శాశ్వతంగా కంటిపాపలాంటి జ్ఞాపకాల్లోకి నెట్టేసింది.
మహారాష్ట్రలోని శంభాజీనగర్‌కు చెందిన 18 ఏళ్ల ఒక యువకుడు ఎలాగైనా సరే తనకు 'ఐఫోన్ 15' కొనివ్వాలని తల్లిదండ్రులతో పట్టుబట్టాడు. ఆర్థిక పరిస్థితి లేదా ఇతర కారణాల వల్ల దాన్ని కొనివ్వలేకపోయిన తల్లిదండ్రులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ యువకుడు పట్టుదలతో మాటామాటా పెంచి.. తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఆవేశం నరనరాల్లోకి ప్రవహించడంతో నేరుగా సమీపంలోని ఖవ్‌ద్యా కొండపైకి చేరుకుని.. అక్కడి నుంచి దూకేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు.
కన్నపేగు ఉడికిపోయిన ఆ తల్లిదండ్రులు కొడుకుని కాపాడుకోవడానికి సుమారు మూడు గంటల పాటు కన్నీళ్లతో బతిమిలాడారు. ఆవేశం తగ్గించుకుని వెనక్కి రమ్మని వేడుకున్నారు. కానీ ఆ యువకుడికి కంటిముందు కేవలం ఆ ఫోన్ తప్ప కన్నవారి ప్రేమ, వారి ఆవేదన ఏదీ కనిపించలేదు. చివరకు కొడుకుని ఎలాగైనా ఆపాలని తండ్రి ముందుకు వెళ్లగా ఆ క్రమంలో యువకుడు తండ్రిని కూడా తనతో పాటు కిందకి లాగేశాడు. క్షణాల్లో ఇద్దరూ ఆ కొండపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయారు.
కళ్లముందే ప్రాణంగా చూసుకునే భర్త, కడుపున పుట్టిన కొడుకు రక్తపు మడుగులో నిర్జీవంగా పడిపోవడం చూసిన ఆ తల్లి గుండె చెరువైంది. దిక్కుతోచని స్థితిలో తీవ్ర మానసిక క్షోభను తట్టుకోలేక ఆమె కూడా అదే కొండపై నుంచి దూకి తన జీవితాన్ని ముగించింది. ఇలా ఒక్క ఐఫోన్ కోరిక చుట్టూ మొదలైన చిన్న గొడవ.. కొద్ది గంటల్లోనే ఒక కుటుంబాన్ని సమాధి చేసింది.
ఈ దారుణ ఘటన నేటి సమాజంలో పిల్లలు వస్తువుల పట్ల పెంచుకుంటున్న అనవసరపు పిచ్చిని.. క్షణికావేశాలను గట్టిగా ప్రశ్నిస్తోంది. విలాసాల కంటే విలువైనది కన్నవారి ప్రేమేనని గుర్తిస్తే తప్ప ఇలాంటి విషాదాలకు అంతం ఉండదు.
