ఐఫోన్ కోసం ఎన్ని రోజులు కష్టపడాలి?.. దేశాల వారీగా తెలిస్తే షాక్.. మన ఇండియా స్థానం ఎంతంటే?
ఈ సర్వే నివేదిక ప్రకారం.. ఒక సగటు భారతీయుడు ఐఫోన్ 17 ప్రో మోడల్ కొనుగోలు చేయాలంటే ఏకంగా 160 రోజులు కష్టపడాలి.
By: Madhu Reddy | 18 May 2026 8:00 PM ISTప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ఆపిల్ ఐఫోన్ కొనుక్కోవాలని ఒక క్రేజ్ ఉంటుంది. అయితే, లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మోడల్ 'ఐఫోన్ 17 ప్రో' కొనాలంటే ఏ దేశ పౌరుడు ఎన్ని రోజులు కష్టపడాలో తెలుసా? తాజాగా విడుదలైన 'ఐఫోన్ అఫార్డబిలిటీ ఇండెక్స్' నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఒక సగటు భారతీయుడు ఈ ఫోన్ కొనాలంటే ఏకంగా నెలల తరబడి కష్టపడాల్సి వస్తుండగా, కొన్ని విదేశాల్లో కేవలం 3 రోజులు పని చేస్తే చాలు. ఈ ఆసక్తికరమైన విశేషాలు చూద్దాం..
ఐఫోన్ ఇండెక్స్ అంటే ఏంటి?:
ఒక దేశంలో లభించే సగటు దినసరి వేతనం (రోజూ 8 గంటల పని) ఆధారంగా, అక్కడ ఆపిల్ ఐఫోన్ 17 ప్రో (256 GB) కొనడానికి ఎన్ని రోజులు కష్టపడాలనే దాన్ని లెక్కగట్టి ఈ ఇండెక్స్ విడుదల చేస్తారు. దీనివల్ల ఏ దేశంలో ప్రజల కొనుగోలు శక్తి ఎలా ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈసారి మొత్తం 33 దేశాల్లో సర్వే చేయగా, దేశాల మధ్య ఉన్న ఆర్థిక వ్యత్యాసాలు స్పష్టంగా బయటపడ్డాయి.
భారతీయులకు భారీ షాక్:
ఈ సర్వే నివేదిక ప్రకారం.. ఒక సగటు భారతీయుడు ఐఫోన్ 17 ప్రో మోడల్ కొనుగోలు చేయాలంటే ఏకంగా 160 రోజులు కష్టపడాలి. అంటే దాదాపు ఐదు నెలల కంటే ఎక్కువ కాలం సంపాదించిన డబ్బును ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా దాచుకుంటేనే కానీ ఈ ఫోన్ సొంతం కాదు. ఇక సర్వే చేసిన 33 దేశాలలో మన దేశమే అత్యధిక పనిదినాలతో చివరి స్థానంలో నిలిచి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది.
కేవలం 3 రోజులు పని చేస్తే చాలు:
మరోవైపు, కొన్ని ధనిక దేశాల్లో ఐఫోన్ కొనడం చాలా ఈజీ అని తేలింది. లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లోని సగటు కార్మికులు కేవలం 3 రోజులు పని చేస్తే వచ్చే జీతంతో ఈ లేటెస్ట్ ఐఫోన్‌ను కొనేయొచ్చు. ఇక అలాగే అమెరికా, బెల్జియం, డెన్మార్క్, నెదర్లాండ్స్, నార్వే దేశాల్లో కేవలం 4 రోజులు కష్టపడితే చాలు, ఈ లగ్జరీ ఫోన్ వారి చేతుల్లోకి వచ్చేస్తుంది.
ఇతర దేశాల పరిస్థితి ఎలా ఉందంటే?:
అభివృద్ధి చెందుతున్న మరికొన్ని దేశాల్లో కూడా ఐఫోన్ కొనడం సామాన్యులకు ఒక కలగానే మిగిలిపోతోంది. ఫిలిప్పీన్స్‌లో 101 రోజులు, వియత్నాంలో 99 రోజులు, టర్కీలో 89 రోజులు, బ్రెజిల్‌లో 77 రోజులు కష్టపడాల్సి వస్తోంది. అలాగే ఆస్ట్రేలియా, కెనడాల్లో 5 రోజులు, యూకేలో 7 రోజులు, యూఏఈ (దుబాయ్) లో 8 రోజులు పని చేస్తే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 17 ప్రో కొనడానికి ఒక్కొక్క దేశంలో ఒక్కో రకమైన పరిస్థితులు ఉన్నాయి. మన దేశంలో ఐఫోన్ ధరలు, ఇక్కడి సగటు ఆదాయాల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం వల్లే భారతీయులు 160 రోజులు కష్టపడాల్సి వస్తోందని ఈ నివేదిక చెబుతోంది. ఇక ఏదేమైనా, భారత్‌లో ఐఫోన్ అనేది కేవలం ఒక స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాదు, నెలల తరబడి కష్టపడితేనే దక్కే ఒక లగ్జరీ స్టేటస్ సింబల్ అని తేలిపోయింది.
