Begin typing your search above and press return to search.

అంతరిక్ష ఆధారిత డెలివరీ వాహనం... భూమిపై ఎక్కడైనా గంటలో డెలివరీ!

అవును... లాస్ ఏంజిల్స్ లోని ఇన్వర్షన్ సంస్థ, ప్రపంచంలోనే తొలి స్పేస్ డెలివరీ వెహికల్ 'ఆర్క్' ను ఆవిష్కరించింది.

By:  Raja Ch   |   5 Oct 2025 7:00 PM IST
అంతరిక్ష ఆధారిత డెలివరీ వాహనం... భూమిపై ఎక్కడైనా గంటలో డెలివరీ!
X

భూమిపై ఎక్కడికైనా సరుకును డెలివరీ చేయడానికి ఇన్వర్షన్ ఆర్క్ అటానమస్ స్పేస్ బేస్డ్ డెలివరీ వెహికల్ నమూనాను లాస్ ఏంజిల్స్‌ లోని 'ఇన్వర్షన్' ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. వాణిజ్య, ప్రభుత్వ, రక్షణ వస్తువులను ఒక గంటలోపు తక్కువ భూ కక్ష్య నుండి హైపర్‌ సోనిక్ రీఎంట్రీతో భూమిపై ఏ ప్రదేశానికైనా కార్గోను డెలివరీ చేయడానికి ఆర్క్ స్పేస్‌ క్రాఫ్ట్ రూపొందించబడిందని తెలిపింది.

అవును... లాస్ ఏంజిల్స్ లోని ఇన్వర్షన్ సంస్థ, ప్రపంచంలోనే తొలి స్పేస్ డెలివరీ వెహికల్ 'ఆర్క్' ను ఆవిష్కరించింది. ఇది భూమిపై ఏ ప్రదేశానికైనా ఒక గంట కంటే తక్కువ సమయంలోనే వస్తువులను డెలివరీ చేస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇది సుమారు 500 పౌండ్ల బరువును మోసుకెళ్లగలుగుతుందని.. రన్ వేలు అవసరం లేకుండా పారాచూట్ సాయంతో ల్యాండ్ అవుతుందని వెల్లడించారు.

2021లో కంపెనీని ప్రారంభించిన సహ వ్యవస్థాపకులు జస్టిన్ ఫియాషెట్టి, ఆస్టిన్ బ్రిగ్స్.. ఆర్క్‌ ను కొత్త రకమైన లాజిస్టిక్స్ ప్లాట్‌ ఫామ్‌ గా ప్రదర్శించారు. ఆ 'ఆర్క్' సుమారు 8 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇది దాదాపు పెద్ద టేబుల్‌ టాప్ పరిమాణంలో ఉంటుంది. ఇది మెడికల్ కిట్‌ ల నుండి డ్రోన్‌ ల వరకు డెలివరీలను నిర్వహించడానికి నిర్మించబడిందని చెబుతున్నారు.

ఈ అంతరిక్ష నౌక మాక్ 20 కంటే ఎక్కువ వేగాన్ని అందుకోగలదని.. ఎక్కువ కాలం పాటు తీవ్రమైన పరిస్థితులను నిర్వహించగలదని.. భారీ జీ-ఫోర్స్‌ లను తట్టుకోగలదని సంస్థ వెల్లడించింది. ఈ సమయంలో అమెరికా రక్షణ సంస్థలు నిధులను పెంచడంతో పాటు హైపర్‌ సోనిక్ పరిశోధనపైనా దృష్టి సారించాయి.