Begin typing your search above and press return to search.

కేవలం ఒక్క క్రెడిట్‌ పొరపాటు: అమెరికాలో ప్రమాదంలో ఓ విద్యార్థి భవిష్యత్తు!

ఈ ఉదంతం అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో ఎదుర్కొనే తీవ్రమైన మానసిక ఒత్తిడిని సూచిస్తుంది.

By:  A.N.Kumar   |   11 Nov 2025 7:10 PM IST
కేవలం ఒక్క క్రెడిట్‌ పొరపాటు: అమెరికాలో ప్రమాదంలో ఓ విద్యార్థి భవిష్యత్తు!
X

ఒక చిన్న అకడమిక్‌ పొరపాటు ఓ అంతర్జాతీయ విద్యార్థి భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసింది. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన ఆ విద్యార్థి తన మాస్టర్స్‌ కోర్సు పూర్తి చేయడానికి కేవలం ఒకే ఒక్క క్రెడిట్‌ (సబ్జెక్ట్/కోర్స్) మిగిలి ఉండగా దానిని సమయానికి పూర్తిచేయలేకపోయాడు. ఈ నిర్లక్ష్యం అతని F-1 వీసా స్టేటస్ భవిష్యత్తు అడ్మిషన్‌ను తీవ్రమైన ప్రమాదంలోకి నెట్టింది.

* మాస్టర్స్‌ పూర్తి కాకపోవడంతో పీహెచ్‌డీ ప్రశ్నార్థకం

ఈ విద్యార్థి ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన పీహెచ్‌డీ అడ్మిషన్‌ , ఆర్థికంగా తోడ్పడే అసిస్టెంట్‌షిప్‌ కూడా పొందాడు. అయితే మాస్టర్స్‌ అధికారికంగా పూర్తికాకపోవడంతో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ కోసం ఇచ్చిన కొత్త I-20 (విద్యార్థి వీసా పత్రం) యాక్టివ్‌ చేయడం సాధ్యంకాలేదు. ఒకే సమయంలో రెండు ప్రోగ్రామ్‌ల మధ్య "చేంజ్‌ ఆఫ్‌ లెవల్‌" ప్రక్రియ పూర్తి చేయకపోతే విద్యార్థి వీసా క్రమబద్ధత లోపించి చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు పరిగణించబడే ప్రమాదం ఉంది. ఇది అతని విద్య, అమెరికాలో ఉండటానికి ఉన్న అర్హత రెండింటినీ రద్దు చేసే అవకాశం ఉంది.

* ప్రమాదాన్ని తప్పించుకునే మార్గం

ఇమ్మిగ్రేషన్‌ నిపుణులు సూచించిన పరిష్కారం ఏమిటంటే విద్యార్థి తక్షణమే మిగిలిన క్రెడిట్‌ కోసం మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌లో రిజిస్టర్‌ అవుతూ, అదే సమయంలో పీహెచ్‌డీ కోర్సులను సమాంతరంగా ప్రారంభించాలి. మాస్టర్స్‌ అధికారికంగా పూర్తైన వెంటనే పీహెచ్‌డీ I-20 వెంటనే యాక్టివ్‌ అవుతుంది. ఈ క్లిష్టమైన ప్రక్రియ సజావుగా సాగాలంటే, విద్యార్థి వెంటనే కళాశాలలోని ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్కాలర్ సర్వీస్ (ISSS) విభాగాన్ని సంప్రదించి, అవసరమైన పత్రాలను సమర్పించడం అత్యవసరం.

* అధికారిక వ్యవస్థల ఒత్తిడి - పరిణామాలు

ఈ ఉదంతం అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో ఎదుర్కొనే తీవ్రమైన మానసిక ఒత్తిడిని సూచిస్తుంది. చిన్న తప్పు, ఒక ఫారమ్‌ లోపం, లేదా ఈ సందర్భంలో కేవలం ఒక సబ్జెక్ట్‌ మిస్ కావడం వంటి వాటికి, వీసా రద్దు, దేశం విడిచిపెట్టే ప్రమాదం, లేదా అడ్మిషన్‌ రద్దు వంటి తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. విద్యార్థులు కోర్సుల ఒత్తిడి, వీసా నియమాలు, అనవసరమైన పేపర్‌వర్క్‌ ఈ మూడింటితో నిత్యం పోరాడాల్సి వస్తోంది. ఒక్క అకడమిక్‌ తప్పిదం వారి సంవత్సరాల కృషిని వృథా చేసే భయంకరమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది.

* విద్యా వ్యవస్థల్లో సౌలభ్యం అవసరం

అమెరికా వంటి గ్లోబల్‌ టాలెంట్‌పై ఆధారపడే దేశంలో ఇలాంటి చిన్న అకడమిక్‌ పొరపాట్లను సరిచేసుకునేందుకు విద్యార్థులకు మరింత సౌలభ్యం, మానవీయ విధానాలు కల్పించడం అవసరం.

కేవలం ఒక క్రెడిట్‌ మిస్‌ అయినందుకు ఒక ప్రతిభావంతుడైన విద్యార్థి భవిష్యత్తు నాశనం కావడం అన్యాయం. అంతర్జాతీయ విద్యార్థులను కేవలం ఆదాయ వనరుగా కాకుండాభవిష్యత్తులో దేశానికి సేవ చేసే జ్ఞానవంతులుగా గుర్తించి వారి భవిష్యత్తును రక్షించేందుకు విద్యా విధానాలు మానవీయంగా మారాల్సిన అవసరం ఉంది.