Begin typing your search above and press return to search.

తెలంగాణ సమాజంలో మారుతున్న ధోరణులు.. పెరుగుతున్న కులాంతర వివాహాలు..!

పట్టణీకరణ ప్రభావంతో కొన్ని వర్గాల్లో మార్పు మొదలైనప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన తెగల్లో కొంచెం వరకు పాత పద్ధతులు, వెనుకబాటుతనం కొనసాగుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   16 April 2026 4:00 PM IST
తెలంగాణ సమాజంలో మారుతున్న ధోరణులు.. పెరుగుతున్న కులాంతర వివాహాలు..!
X

తెలంగాణ కులగణన సర్వే నివేదికలో అనేక విషయాలు బయటపడుతున్నాయి. రాష్ట్రంలోని సామాజిక, విద్యా, ఆర్థిక అసమానతలను చాలా లోతుగా విశ్లేషిస్తుంది. కులాంతర వివాహాల విషయంలో వస్తున్న మార్పులు, విద్యా ప్రమాణాల్లో ఉన్న భారీ వ్యత్యాసాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే ద్వారా వెలుగు చూసిన వాస్తవాలు సామాజిక శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. విద్యా సాధన, వివాహ పోకడలు, జీవన ప్రమాణాల్లో కులాల మధ్య అంతరాలు తొలిగిపోతున్నట్లు కనిపిస్తుంది. పట్టణీకరణ ప్రభావంతో కొన్ని వర్గాల్లో మార్పు మొదలైనప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన తెగల్లో కొంచెం వరకు పాత పద్ధతులు, వెనుకబాటుతనం కొనసాగుతున్నాయి.

అక్కడ మార్పు.. అక్కడ మౌనం..

తెలంగాణలో కులాంతర వివాహాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని చెప్పవచ్చు. అయితే, కొన్ని అగ్రవర్ణాలు, వెనుకబడిన వర్గాల్లో ఈ విషయంలో మార్పు కనిపిస్తోంది.

ముందంజలో ఉన్న వర్గాలు: అత్యధికంగా అయ్యంగార్లు/అయ్యర్ల వర్గంలో 12% కుటుంబాల్లో కులాంతర వివాహాలు జరిగాయి. ఇంకా కొనసాగుతున్నాయి. ఆ తర్వాత ఎస్సీ క్రిస్టియన్లు (9.9%), రాజులు (8.7%) ఈ దిశగా ముందడుగు వేస్తున్నారు.

వెనుకబడినవి: ఎస్టీ కొలాం (2.6%), ఎస్టీ గోండ్లు (2.8%) వంటి వర్గాల్లో కులాంతర వివాహాలు తక్కువ. దీనికి భౌగోళిక ఏర్పాటు, సంప్రదాయాలను కాపాడుకోవాలనే తపన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆర్థిక బలం - సామాజిక కట్టుబాటు: విచిత్రమైన విషయం ఏంటంటే, ఆర్థికంగా బలంగా ఉన్న ఓసీ వెలమలు (5.1%), రెడ్లలో (4.4%) కులాంతర వివాహాలు తక్కువగా ఉన్నాయి. అంటే ఆర్థిక అభివృద్ధి సాధించినా.., సామాజికంగా కుల కట్టుబాట్లను వదులుకోవడానికి ఈ వర్గాలు ఇష్టపడడం లేదని అర్థమవుతోంది.

విద్యా అసమానతలు..

రాష్ట్రంలో విద్యా స్థాయిల్లో ఉన్న అసమానతలు అత్యంత ఆందోళనకరం. 56 ప్రధాన కులాలను పరిశీలిస్తే, ఉన్నత విద్యలో (డిప్లొమా అంతకంటే ఎక్కువ) రాష్ట్ర సగటు 36.3%గా ఉంది.

అత్యున్నత స్థాయి: ఆర్యవైశ్యులు, వెలమలు, బ్రాహ్మణుల్లో దాదాపు 37% మంది ఉన్నత విద్యను పూర్తి చేశారు.

అట్టడుగు స్థాయి: ఎస్టీ కొలాం వర్గంలో కేవలం 4.4% మాత్రమే. అంటే అగ్రవర్ణాలకు, ఈ గిరిజన వర్గాలకు మధ్య విద్యలో దాదాపు 9 రెట్ల వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది.

ఆశ్చర్యకరమైన నిజం: ఓసీలైన జైనులు, ముస్లింలు విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు. ముఖ్యంగా ఓసీ ముస్లింలు అనేక బీసీ గ్రూపుల కంటే దిగువన ఉండడం గమనార్హం. అలాగే, బీసీ-ఏ వడ్డెరలు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన వర్గంగా నిలిచారు.

ఆంగ్ల మాధ్యమం, ప్రైవేటు విద్య

ఆధునిక ప్రపంచంలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం అవసరంగా మారిపోయింది. ఇక్కడ కూడా కులాల మధ్య భారీ అంతరం ఉంది. బ్రాహ్మణులు, ఆర్యవైశ్యుల్లో 72% మంది ఇంగ్లిష్ మీడియంలో చదువుతుండగా, ఎస్టీ కొలాంలలో కేవలం 11% మాత్రమే. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే వారిలో బ్రాహ్మణులు (38%) అగ్రస్థానంలో ఉంటే, కొలాంలలో కేవలం ఒక శాతం మందికే ఆ అవకాశం ఉంది. ఇది విద్యా హక్కు చట్టం అమలుపై, విద్యా రంగంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై చర్చను లేవనెత్తుతోంది.

కార్ల వాడకంలో బ్రాహ్మణులదే రికార్డ్!

ఒక కుటుంబం ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి ‘సొంత కారు’ కలిగి ఉండటం ఒక ప్రాతిపదికగా తీసుకుంటే.. బ్రాహ్మణుల ఇళ్లలో అత్యధికంగా 16.40% మందికి కార్లు ఉన్నాయి. ఓసీల వద్ద ఎస్సీ, ఎస్టీల కంటే 5 రెట్లు అధికంగా కార్లు ఉండడం ఆ వర్గాల మధ్య ఉన్న భారీ ఆర్థిక అగాధాన్ని సూచిస్తోంది. ఎస్టీ కొలాంలో కేవలం 0.2% మంది వద్దే కార్లు ఉండడం, ఆ వర్గం ఇంకా కనీస అవసరాల కోసమే పోరాడుతోందని చెబుతోంది. వైద్య అవసరాలు లేదంటే పెళ్లిళ్ల కోసం చేసే అప్పులు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను పీడిస్తున్నాయి. వీరికి బ్యాంకుల వంటి అధికారిక సంస్థల నుంచి రుణాలు అందకపోవడం వల్ల అనధికార వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇది వారిని శాశ్వత అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది.

సర్వే నివేదిక కేవలం అంకెలే కాదు, తెలంగాణ సామాజిక వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపే అద్దం. విద్యా పరంగా అట్టడుగున ఉన్న వర్గాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించడం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తేవడం ద్వారానే ఈ అసమానతలను తగ్గించడం సాధ్యమవుతుంది. కేవలం భూమి పంపిణీ మాత్రమే కాదు, నాణ్యమైన విద్య, ఆర్థిక భరోసా అందరికీ సమానంగా అందినప్పుడే 'సామాజిక తెలంగాణ' సాధ్యమవుతుంది.