Begin typing your search above and press return to search.

మధ్యప్రదేశ్ లో వింత ఘటన.. పెళ్లి ముహూర్తం పెట్టుకొని మరీ క్యాన్సిల్ చేసుకుంటున్న యువత..

ఇండోర్‌లో గత 40 రోజుల్లో 150కి పైగా వివాహాలు రద్దయ్యాయని వచ్చిన నివేదికలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.

By:  Tupaki Political Desk   |   15 Dec 2025 3:00 AM IST
మధ్యప్రదేశ్ లో వింత ఘటన.. పెళ్లి ముహూర్తం పెట్టుకొని మరీ క్యాన్సిల్ చేసుకుంటున్న యువత..
X

నలభై రోజుల వ్యవధిలోనే వందకు పైగా పెళ్లిళ్లు ఆగిపోవడం… ఇది ఏదో గాసిప్ కాదు, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరంలో నమోదైన నిజమైన పరిణామం. ఒకప్పుడు పెళ్లి అంటే కుటుంబాల మధ్య బంధం, భవిష్యత్తుపై నమ్మకం, జీవితాంతం కలిసి నడిచే నిర్ణయం. కానీ ఇప్పుడు అదే పెళ్లి సోషల్‌ మీడియా నోటిఫికేషన్‌ల ముందు నిలబడి ఓడిపోతోంది. ఫోన్‌ స్క్రీన్‌పై ఒక్క పాత ఫోటో, ఒక్క పోస్ట్‌, ఒక్క రీల్‌ చాలు.. ఏళ్ల కలలు క్షణాల్లో కూలిపోవడానికి.

40 రోజల్లో 150 రద్దు..

ఇండోర్‌లో గత 40 రోజుల్లో 150కి పైగా వివాహాలు రద్దయ్యాయని వచ్చిన నివేదికలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వీటిలో ఎక్కువ శాతం పెళ్లిళ్లు ఎవరో బలవంతంగా రద్దు చేసినవి కాదు. వరుడు–వధువులే స్వయంగా వెనక్కి తగ్గిన నిర్ణయాలు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక, ఆహ్వాన పత్రాలు పంపిన తర్వాత కూడా “ఇంకా ముందుకు వెళ్లలేం” అనే నిర్ణయానికి వారు వచ్చారు. ఆ నిర్ణయాల వెనుక ప్రధాన పాత్ర పోషించింది… సోషల్‌ మీడియా. ఈ రద్దుల్లో దాదాపు 62 శాతం కేసులకు కారణం పాత రిలేషన్‌షిప్‌లకు సంబంధించిన సోషల్‌ మీడియా పోస్టులేనని చెబుతున్నారు. ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత, లేదా పెళ్లి తేదీ దగ్గర పడుతున్న సమయంలో, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో పాత ఫోటోలు, వీడియోలు, కామెంట్లు బయటపడుతున్నాయి. ‘గతంలో రిలేషన్ షిప్ ఉందా?’, ‘ఇది ఇంకా కొనసాగుతోందా?’ అనే సందేహాలు మొదలవుతున్నాయి. నమ్మకం కాస్త అనుమానంగా మారి, ఆ అనుమానం క్షణాల్లో పెద్ద గొడవలకు దారి తీస్తోంది. చివరకు పెళ్లి రద్దే పరిష్కారంగా కనిపిస్తోంది.

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇవి కేవలం అబ్బాయిలపై లేదా అమ్మాయిలపై మాత్రమే పడుతున్న ఆరోపణలు కావు. రెండు వైపులా సోషల్‌ మీడియా చరిత్రే సమస్యగా మారుతోంది. ఒకప్పుడు గతం అంటే వ్యక్తిగత విషయం. ఇప్పుడు అది పబ్లిక్‌ డేటాగా మారిపోయింది. తొలగించామని భావించిన పోస్టులు, స్క్రీన్‌షాట్‌ల రూపంలో మళ్లీ బయటపడుతున్నాయి. ‘గతం వదిలేసి ముందుకు వెళ్లాలి’ అనే మాటలు చెప్పడం సులువు, కానీ డిజిటల్‌ ట్రేస్‌ల మధ్య అది అంత సులువు కాదు. మిగిలిన పెళ్లి రద్దులకు కుటుంబ సమస్యలు కారణమని నివేదిక చెబుతోంది. కట్నం, ఆస్తులు, జీవనశైలి, ఉద్యోగం, కుటుంబ జోక్యం ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న సమస్యలే. కానీ సోషల్‌ మీడియా వాటిని మరింత ముదిర్చేలా చేస్తోంది. చిన్న అపోహ కూడా పెద్ద వివాదంగా మారుతోంది. ఒకరి ఫాలోయింగ్ లిస్ట్‌, లైక్స్‌, కామెంట్లు కూడా కుటుంబాల మధ్య అనుమానాలకు దారి తీస్తున్నాయి.

పెద్ద కష్టంగా చూస్తున్న పెళ్లి..

ఈ ఆకస్మిక రద్దు ప్రభావం కేవలం జంటలకే పరిమితం కావడం లేదు. పెళ్లి రంగంపై ఆధారపడి జీవించే వారికీ ఇది పెద్ద దెబ్బగా మారింది. వెడ్డింగ్ ప్లానర్స్‌, హోటల్ నిర్వాహకులు, క్యాటరింగ్ సర్వీసులు, డెకరేషన్ టీమ్‌లు అందరూ భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. ముందుగానే బుక్ చేసిన హాల్స్‌, ఆర్డర్ చేసిన భోజనం, సెట్ చేసిన డెకరేషన్‌లన్నీ ఒక్కసారిగా రద్దవుతుండడంతో కోట్ల రూపాయల వ్యాపారం గాలిలో కలిసిపోతోంది. ‘పెళ్లి ఖాయం’ అనే మాటకు ఇక విలువ లేకుండా పోతోందని ఈ రంగానికి చెందినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండోర్ ఘటన ఒక నగరానికే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న మానసిక ధోరణికి సంకేతం. మనం సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నామా? లేక అదే మన నిర్ణయాలను నడిపిస్తున్నదా? అన్న ప్రశ్న ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. వ్యక్తిగత జీవితంలో పారదర్శకత అవసరమే. కానీ ప్రతి గతాన్ని, ప్రతి క్షణాన్ని పబ్లిక్‌ వేదికపై పెట్టాల్సిన అవసరం ఉందా? అనే ఆలోచన కూడా అంతే ముఖ్యం.

పెళ్లి అనేది పర్ఫెక్ట్‌ ఇమేజ్‌ల మధ్య జరిగే ఒప్పందం కాదు. అది నమ్మకం మీద, పరస్పర అర్థం చేసుకునే సామర్థ్యంపై నిలబడే బంధం. సోషల్‌ మీడియా ఆ బంధాన్ని బలపరుస్తే మంచిదే. కానీ అదే బంధాన్ని విరిచే ఆయుధంగా మారితే, ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ఇండోర్ ఘటన చెబుతోంది. పెళ్లిళ్లు రద్దవుతున్నాయి అనేది కాదు అసలు వార్త… మన సంబంధాలు ఎంత సున్నితంగా మారిపోయాయన్నదే అసలైన హెచ్చరిక.