Begin typing your search above and press return to search.

బిగ్ రివీల్ అంటూ ఊరించి రూ.8.5 కోట్లు ఊడ్చేశాడు..!! 1.66 లక్షల మందిని మోసం చేసిన ఒకే ఒక్కడు

కేవలం ఒక్క రోజులో ఒక్క ట్రిక్‌తో ఏకంగా రూ. 8.5 కోట్లు కొల్లగొట్టిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ తరహా మోసాలు ఎవరినైనా నివ్వెరపరిచేలా ఉన్నాయి.

By:  Tupaki Political Desk   |   26 Aug 2026 12:15 PM IST
బిగ్ రివీల్ అంటూ ఊరించి రూ.8.5 కోట్లు ఊడ్చేశాడు..!! 1.66 లక్షల మందిని మోసం చేసిన ఒకే ఒక్కడు
X

సోషల్ మీడియాలో వింతలు, విశేషాలే కాదు.. అంతకుమించిన విధంగా సరికొత్త మోసాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. సామాన్యుల కుతూహలాన్ని, ఆసక్తిని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు కోట్లు దండుకుంటున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన చూస్తే సైబర్ నేరగాళ్ల మైండ్ గేమ్‌ ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది. కేవలం ఒక్క రోజులో ఒక్క ట్రిక్‌తో ఏకంగా రూ. 8.5 కోట్లు కొల్లగొట్టిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ తరహా మోసాలు ఎవరినైనా నివ్వెరపరిచేలా ఉన్నాయి.

కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘25 August 2026’ పేరిట ఓ మిస్టరీ అకౌంట్ పుట్టుకొచ్చింది. ఆగస్టు 25న ఓ పెద్ద రహస్యం (బిగ్ రివీల్) బయటపెట్టబోతున్నానని ఆ కేటుగాడు విపరీతంగా ప్రచారం చేశాడు. తాను రివీల్ చేయబోయే సీక్రెట్ చూసి ఎవరూ పశ్చాత్తాప పడరని, అందరి జీవితాలు మారిపోతాయని నమ్మబలికాడు. అదేంటో తెలుసుకోవాలనే ఆసక్తిని ప్రజల్లో పెంచుతూ వరుస రీల్స్ పోస్ట్ చేశాడు. ఆ తర్వాత అసలు ఉచ్చు బిగించాడు. ఆ స్పెషల్ వీడియో చూడాలంటే తన టెలిగ్రామ్ ఛానల్‌లోకి రావాలని ఆహ్వానించాడు. ఆ వీడియోను వీక్షించడానికి ఒక్కొక్కరి నుంచి రూ. 500 వసూలు చేశాడు.

ఆగస్టు 25 రానే వచ్చింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఎంతో కుతూహలంగా ఆ వీడియోను ఓపెన్ చేశారు. కానీ తీరా చూస్తే అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ వీడియోలో ఎలాంటి ‘బిగ్ రివీల్’ లేకపోగా.. కేవలం ‘సమయం ఎంతో విలువైనది’ అనే సాధారణ మోటివేషనల్ వీడియో మాత్రమే ప్లే అయ్యింది. జనాలు లబోదిబోమన్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లెక్కల ప్రకారం దాదాపు 1.66 లక్షల మంది రూ. 500 చొప్పున చెల్లించడంతో కేవలం ఆ ఒక్క వీడియో ద్వారా ఆ కేటుగాడికి ఏకంగా రూ. 8.5 కోట్లు ముట్టాయి. టెలిగ్రామ్‌లో స్టార్స్ (Stars) రూపంలో డబ్బులు చెల్లించడంతో ఆ నిందితుడిని గుర్తించడం పోలీసులకు కూడా కష్టతరంగా మారిందని అంటున్నారు.

ప్రస్తుతం ఎన్నో రకాల డిజిటల్ మోసాలు జరుగుతున్నాయి. ఇందులో ఫేక్ ట్రేడింగ్ యాప్స్, పార్ట్ టైమ్ జాబ్ ఫ్రాడ్స్, లోన్ యాప్ వేధింపులు పీడిస్తున్నాయి. అయితే వాటన్నింటికి భిన్నంగా కేవలం ఒకే ఒక్క 'కుతూహలపు' ట్రిక్‌తో ఈ స్థాయిలో డబ్బులు దండుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో ఈ తరహా మోసాలు కొత్తేమీ కావు. గతంలోనూ ఇలాంటి విభిన్న మోసాలు అనేకం వెలుగు చూశాయి. సెలబ్రిటీలు, బ్రాండ్ల పేరిట ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి.. ఐఫోన్లు, కార్లు గెలుచుకున్నారంటూ లింక్స్ పంపి రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో డబ్బులు గుంజుకున్న ఉదంతాలు గతంలో చాలానే ఉన్నాయి. అలాగే స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ సిగ్నల్స్ పేరుతో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసి విలాసవంతమైన జీవితాన్ని ప్రదర్శిస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేయడం తెలిసిందే. కొన్నిసార్లు సంచలనాత్మక న్యూస్ లింక్స్ పంపి.. ఆ వార్త పూర్తి వీడియో చూడాలంటే ఫలానా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని లేదా డబ్బులు పే చేయాలని మోసాలకు పాల్పడేవారు.

ఈ తరహా మోసగాళ్లు విసిరే ఉచ్చులో పడకుండా ఉండాలంటే సోషల్ మీడియా వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్ లేదా టెలిగ్రామ్‌లో ‘పెద్ద రహస్యం’, జీవితాన్ని మార్చే సీక్రెట్ అంటూ డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతికతను, సోషల్ మీడియా ఫీచర్లను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న తరుణంలో.. ప్రతి ఒక్కరూ డిజిటల్ అక్షరాస్యతను, అవగాహనను పెంపొందించుకోవడం అవసరం ఎంతో ఉందని అంటున్నారు.