ఢిల్లీ ఉగ్రపేలుళ్ల గురించి.. బయటపడిన ఉమర్ నబీ వీడియోలో సంచలన విషయాలు..
ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
By: Tupaki Political Desk | 18 Nov 2025 4:19 PM ISTఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడికి సంబంధించి ప్రధాన నిందితుడిగా డాక్టర్ ఉమర్ నబీ పేరు ముందుకు రావడం, అతడు మాట్లాడిన వీడియో బయటపడడం ఈ కేసుకు మరింత కలవరపరిచే కోణాన్ని జత చేసింది. ఈ వీడియోలో అతడు సూసైడ్ బాంబింగ్ గురించి మాట్లాడడం, దాన్ని ‘సూసైడ్ ఆపరేషన్’గా వర్ణించడం అతడి ఉద్దేశాలు ఎంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయో స్పష్టంగా చెప్తోంది. వ్యవస్థలను ధ్వంసం చేయాలని ఎంత బలంగా అతడిలో పెరిగిందో ఈ వీడియో బయటపడడం ద్వారా తెలుస్తోంది.
డిసెంబర్ 6న ఉగ్రదారి జరపాలని ప్లాన్..
డిసెంబర్ 6 దేశం ఎన్నటికీ మరిచిపోదు.. ఒక వర్గం సంతోషం.. మరో వర్గం ఆవేదన కథ ఏదైనా ఇరు వర్గాల మధ్య మాత్రం అంతరం పెరిగింది. అదే ‘బాబ్రీ మసీదు కూల్చివేత’ ఈ తేదీకి సింబాలిక్ అర్థం ఉంది. ఆ రోజునే భారీ పేలుళ్లు జరగాలని ఉమర్ నబీ ప్రణాళిక రచించాడని దర్యాప్తు వెల్లడించడం, అతడి ఆలోచనలు ఎంత భయానకంగా ఉన్నాయో చూపిస్తోంది. ఉగ్రవాద రాజకీయాల ప్రభావంలోకి వెళ్లిన వ్యక్తి ఎంత ప్రమాదకరంగా మారుతాడో ఈ కేసు గుర్తు చేసింది.
ఆందోళనకు గురయ్యే పేలుడు..
ఫరీదాబాద్ ఉగ్ర నెట్‌వర్క్ విచారణలో కొత్త వివరాలు బయటపడడంతో ఉమర్ నబీ ఆందోళనకు గురై ఎర్రకోట వద్ద పేలుడు జరిగిపోయిందన్న అనుమానం ఇవన్నీ ఈ దాడి వెనుక ఉన్న నిగూఢతను పెంచుతున్నాయి. ఎర్రకోట పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మాడ్యూల్ గతేడాది నుంచి ఓ సూసైడ్ బాంబర్ కోసం అన్వేషిస్తోందన్న విషయం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఒక వ్యక్తి సిద్ధంగా లేకపోతే, మరొకరిని తయారు కావాలని తప్పుడు శిక్షణ ఇవ్వడం ఈ వ్యవస్థలు ఎంత ప్రమాదకరంగా మారాయో చెప్తాయి. డా. ఉమర్ నబీ ఈ పనుల్లో ముందుండడం, అతడి వైద్య విద్య అతడిని మరింత ప్రమాదకరంగా మార్చిందన్న భావన కూడా వస్తోంది. ఒక వైద్యుడు, ప్రాణాలను కాపాడాల్సిన వ్యక్తి, ప్రాణాలను తీసేందుకు సూసైడ్ బాంబర్ గా మారడం.. ఇది సమాజంపై మానసిక భారాన్ని మోపుతుంది.
తీవ్రవాదిని చేసిన ఆ వ్యాఖ్యలు..
ఈ కేసులో అరెస్టయిన నిందితుల విచారణలో వెల్లడైన వివరాలు కూడా ఉమర్‌లో ఉన్న తీవ్రవాదాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అతడు ప్రతిసారీ దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్ర దాడులు చేయడం గురించి ఉద్వేగభరితంగా మాట్లాడేవాడు. భావోద్వేగాన్ని ద్వేషంగా మార్చే ఈ తరహా మాటలు చివరకు ప్రాణాలకు ముప్పు తెచ్చే విధ్వంస ఆలోచనలుగా మారుతాయి. ఇదే ఉమర్ నబీ చేశారు.
ప్రతి పెద్ద ఉగ్రదాడి వెనుక ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటుంది. ప్రజల్లో భయం పుట్టించడం, అస్థిరత సృష్టించడం, అనిశ్చితిని పెంచడం. ఈ దాడి కూడా అదే లక్ష్యంతో చేసింది. కానీ ఇక్కడ మరో కోణం బయటపడింది. ఉగ్ర నెట్‌వర్క్‌లలో అంతర్గత ఒత్తిళ్లు, భయాలు, అనుమానాలు కూడా వారి పథకాలను నాశనం చేస్తున్నాయి. ముందుగానే పేలుడు జరగడానికి ఇదే కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన మనకు చెప్పే పెద్ద సందేశం ఏమిటంటే.. ఉగ్రవాదం కేవలం సరిహద్దులు దాటి వచ్చే సమస్య కాదు.. దేశంలోపలే పెరుగుతున్న వ్యాధిగా చెప్పుకోవచ్చు. ఉమర్ నబీ వంటి వారు ఆ వ్యాధి ఎంత లోతుగా పెరుగుతుందో చూపిస్తున్నారు.
దేశ భద్రత కోసం, ఉగ్రవాద పెరుగుదలపై కఠినమైన నిఘా అవసరం అన్న విషయాన్ని ఈ కేసు స్పష్టంగా గుర్తు చేస్తోంది. వీడియో బయటపడడం, దర్యాప్తులో కొత్త వివరాలు వెలుగులోకి రావడం ఇవన్నీ ఒక పెద్ద కుట్రను అడ్డుకున్న సంకేతాలు కావచ్చు.
