Begin typing your search above and press return to search.

సముద్రంపై ఉక్కు కోట.. INS విక్రాంత్ అద్భుత విశేషాలివే!

ఈ భారీ విమాన వాహక నౌక నిర్మాణానికి అక్షరాలా రూ.23 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వెచ్చించింది. కొచ్చిన్ షిప్ యార్డులో దీనిని నిర్మించారు.

By:  Tupaki Political Desk   |   21 Feb 2026 7:29 PM IST
సముద్రంపై ఉక్కు కోట.. INS విక్రాంత్ అద్భుత విశేషాలివే!
X

విశాఖపట్నం తీరంలో జరిగిన అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష (IFR) భారతావని గర్వించేలా సాగింది. ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా 'INS విక్రాంత్' నిలిచింది. మేకిన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ విక్రాంత్ ను నిర్మించారు. నీలి సముద్రంపై తేలియాడే ఉక్కుకోటగా దీనిని అభివర్ణిస్తున్నారు. భారత నౌకాదళ చరిత్రలో కొత్త చరిత్రను లిఖించిన ఐఎన్ఎస్ విక్రాంత్ తొలి విమాన వాహక నౌక గా రికార్డు సొంతం చేసుకుంది. అత్యాధునిక హంగులతో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ ఎన్నో విశేషాలు సమాహారంగా చెబుతున్నారు.

ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక నౌక మాత్రమే కాదు, అది భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా వ్యాఖ్యానిస్తున్నారు. దీని విశేషాలు పరిశీలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. భారీ పరిణామంతో నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. దీని పొడవు 262.5 మీటర్లు. 59 మీటర్ల ఎత్తులో నిర్మించారు. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఐఎన్ఎస్ విక్రాంత్ పై ఉంటే ఒక్క చిన్న నగరంలో ఉన్నట్లే అనిపిస్తోంది. ఇందులో ఏకంగా 2,278 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. సుమారు 1,600 మంది సిబ్బంది సౌకర్యవంతంగా ప్రయాణించేలా ఐఎన్ఎస్ విక్రాంత్ ను తీర్చిదిద్దారు.

ఈ భారీ విమాన వాహక నౌక నిర్మాణానికి అక్షరాలా రూ.23 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వెచ్చించింది. కొచ్చిన్ షిప్ యార్డులో దీనిని నిర్మించారు. యుద్ధ విమానాలు టేకాఫ్ అవ్వడానికి, ల్యాండ్ అవ్వడానికి వీలుగా దీనిపై ఏర్పాటు చేసిన రన్‌వే అత్యంత అద్భుతం. రెండు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలను పక్కపక్కన పెడితే ఎంత స్థలం ఉంటుందో, అంత సుదీర్ఘమైన రన్‌వే దీనిపై ఉంది. ఇది సముద్రం మధ్యలో ఉండి కూడా యుద్ధ విమానాలు సులువుగా ఎగిరేలా సహకరిస్తుంది.

ఒక్కసారి ఫుల్ ట్యాంక్ ఇంధనం నింపితే, ఇది ఏకధాటిగా 7,500 నాటికల్ మైళ్లు ప్రయాణించగలదు. అంటే భారత తీరం నుంచి ప్రపంచంలోని సుదూర ప్రాంతాలకు నిరంతరాయంగా వెళ్లగలదు. గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల (28 నాటికల్ మైళ్లు) వేగంతో ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. ఈ నౌక తయారీకి ఉపయోగించిన ప్రత్యేకమైన యుద్ధ నౌక గ్రేడ్ స్టీల్‌ను భారత ఉక్కు సంస్థ (SAIL) దేశీయంగానే తయారు చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి మిగ్ 29కే యుద్ధ విమానాలతో పాటు, కామోవ్-31 హెలికాప్టర్లు, ఎంహెచ్-60ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్లను ఆపరేట్ చేయవచ్చునని నేవీ అధికారులు చెబుతున్నారు.

శత్రులకు సింహస్వప్నంలా చెబుతున్న ఐఎన్ఎస్ విక్రాంత్ లో సకల సదుపాయాలను కల్పించారు. నౌక లోపల ఒక చిన్న మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేశారు. ఇందులో ఐసీయూ, ల్యాబొరేటరీలు, సిటీ స్కాన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఐఎన్ఎస్ విక్రాంత్ సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటుంది. ఇందులో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో ఒక చిన్న పట్టణం మొత్తానికి వెలుగులు నింపవచ్చు అని అంటున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ చేరికతో హిందూ మహాసముద్రంలో భారత ఆధిపత్యం మరింత బలపడింది. ప్రపంచంలో విమాన వాహక నౌకలను సొంతంగా తయారు చేసుకోగల అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అంటున్నారు.