కరెంటు బిల్లులు అడిగిన ఇన్ఫోసిస్.. ఉద్యోగుల్లో భయం
ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల కరెంటు బిల్లులు కంపెనీ అడగడంతో ఉద్యోగులు భయపడ్డారు. ఎందుకు అడిగారో అర్థం కాక చాలా మంది గందరగోళానికి గురయ్యారు.
By: A.N.Kumar | 25 Jan 2026 10:00 PM ISTఇన్ఫోసిస్ నిర్ణయం ..ఆ కంపెనీ ఉద్యోగుల్లో గందరగోళానికి కారణమవుతోంది. ఇంటి నుంచి పనిచేస్తున్న ఇన్ఫోసిస్ ఉద్యోగులు తమ కరెంట్ బిల్లు పంపాలని ఈమెయిల్ చేసింది. దీంతో ఉద్యోగుల్లో గందరగోళం మొదలైంది. కంపెనీ ఎందుకు కరెంట్ బిల్లు అడుగుతోంది ?. కారణం ఏమిటి ?. దీని వల్ల నష్టం జరుగుతుందా ?. లాభం జరుగుతుందా ? అన్న ప్రశ్నలు ఉద్యోగుల్లో మొదలయ్యాయి. అదే సమయంలో ఇన్ఫోసిస్ ఈమెయిల్స్ పట్ల టెక్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
కరెంట్ బిల్లు ఎందుకు ?
ఉద్యోగులను కరెంట్ బిల్లు అడిగిన ఇన్ఫోసిస్ కంపెనీ నిర్ణయం పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీ చెబుతోంది. ఇది గత 15 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రక్రియగా పేర్కొంది. ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు ఎంత కరెంటు వినియోగిస్తున్నారు. దీనివల్ల వాతావరణంపై ఎంత ప్రభావం పడుతోంది అన్న అంశాన్ని అంచనా వేయడానికి కరెంట్ బిల్లు పంపమని కోరినట్టు తెలిపింది. కంపెనీ నిర్ణయం పట్ల అనుమానం, భయం అవసరం లేదని ఉద్యోగులకు స్పష్టత ఇచ్చింది. కరెంటు బిల్లును కంపెనీ పునర్నిర్మాణ ప్రక్రియ కోసం అడగలేదని తెలిపింది. అధికారికంగా కంపెనీ ఎంత విద్యుత్ వినియోగిస్తోందో అంచనా వేసి, దానిని తగ్గించే ఆలోచనలో ఉన్నట్టు ఇన్ఫోసిస్ చెప్పింది. అందుకే ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల కరెంటు బిల్లులు అడిగినట్టు పేర్కొంది.
ఉద్యోగుల ఆందోళనకు స్పష్టత
ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల కరెంటు బిల్లులు కంపెనీ అడగడంతో ఉద్యోగులు భయపడ్డారు. ఎందుకు అడిగారో అర్థం కాక చాలా మంది గందరగోళానికి గురయ్యారు. ఉద్యోగం తొలగిస్తారేమో అన్న భయం కూడా కొందరిలో ఉంది. కానీ వీటన్నిటికీ కంపెనీ స్పష్టత ఇచ్చింది. దీంతో ఉద్యోగులు ఊపిరిపీల్చుకున్నట్టు అయ్యింది. కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగింది. చాలా మంది ఇంటి నుంచే పనిచేశారు. కోవిడ్ తర్వాత కొందరు ఆఫీసుకు వెళ్లారు. కానీ ఇంకా కొందరు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఇన్ఫోసిస్ కరెంట్ బిల్లు అడగటం.. ఇంటి నుంచి పనిచేస్తున్నవారికి మొదటిసారి కాబట్టి ఉద్యోగులు అర్థం కాక భయపడ్డారు. కానీ కంపెనీ స్పష్టత ఇచ్చింది.
విద్యుత్ వినియోగం అంచనా ఎందుకు ?
సాఫ్ట్ వేర్ కంపెనీలు నిబంధనల ప్రకారం విద్యుత్ వినియోగాన్ని అంచనా వేయాలి. తద్వారా వినియోగాన్ని తగ్గించాలి. అప్పుడే వాతావరణంపై పడే ప్రభావాన్ని తగ్గించడంలో విజయవంతం అవుతాయి. అదే సమయంలో తక్కువ విద్యుత్ వినియోగంతో పనిచేసే కంపెనీలు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి.. కంపెనీ ఆపరేషనల్ ఖర్చును తగ్గిస్తాయి. విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయడం ద్వారా వనరులును సమర్థవంతంగా వినియోగించడంతో పాటు, విద్యుత్ వినియోగంలో సమగ్ర సమాచారం ద్వారా నిర్ణయాలు తీసుకుంటాయి. తక్కువ విద్యుత్ వినియోగం కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుంది. కంపెనీలు విద్యుత్ వినియోగంపై దృష్టి పెట్టడం కేవలం నిబంధనలను పాటించడానికే కాకుండా, కంపెనీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది.
