విశాఖ పర్మినెంట్.. ఇన్ఫోసిస్ కీలక ప్రకటన
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.
By: Tupaki Political Desk | 7 Jan 2026 10:19 AM ISTఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. నగర శివార్లలోని ఎండాడ హిల్స్ లో ఇన్ఫోసిస్ క్యాంపస్ నిర్మాణానికి 20 ఎకరాలను కేటాయించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇప్పటికే ఇన్ఫోసిస్ ప్రతినిధులు భూములను పరిశీలించారని చెబుతున్నారు. ఎండాడ కొండపై ఐటీ కంపెనీల నిర్మాణానికి అనువైన సదుపాయాలను ఇప్పటికే ప్రభుత్వం కల్పించింది. దీంతో రుషికొండ ఐటీ హిల్స్ తో సమానంగా ఎండాడలోనూ ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
అందమైన సమద్రతీర నగరమైన విశాఖ ఇప్పుడు ఐటీ రంగంలోనూ దూసుకుపోతోంది. పోర్టు, హర్బర్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో విశాఖ ఇప్పటికే ఆర్థికంగా అభివృద్ధి చెందింది. దేశంలోనే అత్యంత సురక్షిత నగరంగా భావించే విశాఖను ఐటీ, అనుబంధ రంగాల్లోనూ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పలు దిగ్గజ ఐటీ సంస్థలతో ప్రభుత్వం నిరంతరం సంప్రదిస్తోంది. ఈ క్రమంలోనే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే కాగ్నిజెంట్, టీసీఎస్, యాక్సెంచర్ సంస్థలు విశాఖలో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నాయి. తాజాగా ఇన్ఫోసిస్ కూడా ఆ జాబితాలో చేరింది. దీంతో ఉత్తరాంధ్ర వాసులు ఇకపై ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అంటున్నారు.
గత నెలలో కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ విశాఖలో ప్రారంభమైంది. శాశ్వత క్యాంపస్ కోసం కాపులుప్పాడలో భూమి పూజ కూడా చేసింది. మూడేళ్లలో ఇక్కడ భవన నిర్మాణం పూర్తి చేసేలా కాగ్నిజెంట్ అడుగులు వేస్తోంది. మరోవైపు టీసీఎస్ కూడా రుషికొండ ఐటీ హిల్స్ లో టెంపరెరీ క్యాంపస్ ను తెరుస్తోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఇన్ఫోసిస్ కు విశాఖలో ఇప్పటివరకు తాత్కాలిక కార్యాలయం ఉంది. ఈ కార్యాలయాన్ని మరింత విస్తరించాలని ఇన్ఫోసిస్ చాలా కాలంగా ఆలోచిస్తోంది. విశాఖకు పలు ఐటీ సంస్థలు క్యూ కడుతుండటం, ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అనుమతులు ఇస్తుండటంతో ఇన్ఫోసిస్ ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు చెబుతున్నారు.
ఇన్ఫోసిస్ పర్మినెంట్ క్యాంపస్ కోసం నగరంలోని ఎండాడ సమీపంలో 20 ఎకరాలను గుర్తించారు. భూ కేటాయింపుపై ఈ నెలలో అధికారికంగా ప్రకటన చేయొచ్చని అంటున్నారు. విశాఖపట్నంలోని రుషికొండ ఐటీ హిల్స్ లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని 2023, అక్టోబర్ 16న అధికారికంగా ప్రారంభించారు. అంతకుముందు 2022 అక్టోబర్ నుంచే మధురవాడలోని ఒక తాత్కాలిక భవనంలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలను సాగించింది. విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థ ఏర్పాటు కావడం ఒక కీలక మైలురాయిగా నిలిచింది. రుషికొండ ఐటీ హిల్సలో 83,750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్ఫోసిస్ కార్యాలయం నిర్మించారు. ఇందులో ప్రస్తుతం వెయ్యి మంది వరకు పనిచేస్తున్నారు. ప్రభుత్వ కొత్త పాలసీ ఆకర్షణీయంగా ఉండటంతో విశాఖ క్యాంపస్ ను మరింత విస్తరించాలని ఇన్ఫోసిస్ భావిస్తోందని అంటున్నారు.
