Begin typing your search above and press return to search.

నేపాల్ ఆకస్మిక వరదల్లో ఇన్ఫోసిస్ కీలక అధికారి అదృశ్యం.. విస్తృత గాలింపు

ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ అధ్యక్షుడు, సీఈఓ ల్యాక్స్ గోపిశెట్టి నేపాల్‌లో వరదల ప్రభావిత ప్రాంతంలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

By:  A.N.Kumar   |   29 Aug 2026 12:57 PM IST
నేపాల్ ఆకస్మిక వరదల్లో ఇన్ఫోసిస్ కీలక అధికారి అదృశ్యం.. విస్తృత గాలింపు
X

నేపాల్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. ఈ ప్రకృతి విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గల్లంతయ్యారు. ఈ క్రమంలో ప్రముఖ భారతీయ ఐటీ దిగ్గజం 'ఇన్ఫోసిస్' కీలక అధికారి ఒకరు వరదల ధాటికి ఆచూకీ లేకుండా పోవడం ఐటీ వర్గాల్లోనూ, సదరు సంస్థలోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ అధ్యక్షుడు, సీఈఓ ల్యాక్స్ గోపిశెట్టి నేపాల్‌లో వరదల ప్రభావిత ప్రాంతంలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యక్తిగత పర్యటనలో భాగంగా ఆయన నేపాల్‌కు వెళ్లినట్లు సమాచారం. అయితే భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించిన తర్వాత ఆయనను సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు, సహచరుల్లో ఆందోళన నెలకొంది.

గోపిశెట్టి భద్రత, ఆరోగ్యమే తమకు అత్యంత ప్రాధాన్యమని ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఆయన ఎక్కడ ఉన్నారనే విషయంపై సంబంధిత అధికార యంత్రాంగం, సహాయక సంస్థలతో కలిసి సమాచారం సేకరిస్తున్నామని తెలిపింది. వీలైనంత త్వరగా ఆయనతో సంబంధాలు ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఇదే సమయంలో గోపిశెట్టి కుటుంబ సభ్యులతో సంస్థ నిరంతరం సంప్రదింపులు జరుపుతూ.. వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించింది.

ఎవరీ ల్యాక్స్ గోపిశెట్టి?

ల్యాక్స్ గోపిశెట్టి ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్‌కు అధ్యక్షుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఇన్ఫోసిస్‌కు అనుబంధ సంస్థగా ఉన్న ఇన్పోసిస్ పబ్లిక్ సర్వీసెస్ ప్రధానంగా అమెరికా, కెనడాలోని ప్రభుత్వ రంగ సంస్థలకు సాంకేతిక సేవలు, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సొల్యూషన్స్ అందిస్తుంది. ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్న గోపిశెట్టి.. పబ్లిక్ సెక్టార్ టెక్నాలజీ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

నేపాల్‌లో తీవ్ర బీభత్సం

నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు, భారీ వర్షాలు విస్తృతంగా విధ్వంసం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని సమాచారం. వరదల కారణంగా స్థానికులతో పాటు విదేశీయులు, భారతీయులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. వరదల అనంతరం సుమారు 320 మంది భారతీయుల ఆచూకీ తెలియకుండా పోయింది. మరోవైపు చైనా సరిహద్దు ప్రాంతాల్లో కూడా వందలాది మంది చిక్కుకున్నట్లు సమాచారం. పరిస్థితిని పర్యవేక్షిస్తున్న భారత్.. నేపాల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను ముమ్మరం చేసింది.

ప్రస్తుతం గోపిశెట్టి ఆచూకీ కోసం కూడా సంబంధిత అధికారులు, రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు సవాళ్లతో కూడుకున్నప్పటికీ.. ఆయనను సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోపిశెట్టి క్షేమంగా బయటపడాలని కుటుంబ సభ్యులు, సహచరులు ఆశిస్తున్నారు.