అటు కోతలు.. ఇటు 20వేల ఉద్యోగాలు.. ఇన్ఫోసిస్ సంచలనం
ప్రస్తుత ఆర్థిక మాంద్యం, టెక్ రంగంలో వేతన స్థిరత్వంపై నెలకొన్న సందేహాల మధ్య, ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ యువతకు శుభవార్త అందించింది.
By: A.N.Kumar | 30 July 2025 8:45 PM ISTప్రస్తుత ఆర్థిక మాంద్యం, టెక్ రంగంలో వేతన స్థిరత్వంపై నెలకొన్న సందేహాల మధ్య, ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ యువతకు శుభవార్త అందించింది. ఈ ఏడాది మొత్తం 20 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ ప్రకటించారు. ఇప్పటికే మొదటి త్రైమాసికంలో 17 వేల మందిని నియమించుకున్నామని, మిగిలిన కాలేజీ గ్రాడ్యుయేట్‌లను కూడా ఈ ఏడాదిలోనే ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ఆయన వివరించారు.
ఇటీవలి కాలంలో టీసీఎస్ వంటి సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది టెక్ రంగంలో అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయని, యువతకు ఆశావహ దృక్పథాన్ని కల్పించేలా ఉంది.
AI, ఆటోమేషన్‌పై ఇన్ఫోసిస్ వ్యూహాత్మక దృష్టి
సలీల్ పరేఖ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్ఫోసిస్ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , ఆటోమేషన్ వంటి రంగాల్లో దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే వివిధ స్థాయిల్లో ఉన్న 2.75 లక్షల మంది ఉద్యోగులకు నైపుణ్య శిక్షణను అందించినట్లు ఆయన పేర్కొన్నారు.
AI ఆధారిత ఆటోమేషన్ ద్వారా సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో 5-15 శాతం ఉత్పాదకత పెరుగుతోందని సలీల్ పరేఖ్ తెలిపారు. అంతేకాకుండా సంస్థ అభివృద్ధి చేసిన బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఇన్ఫోసిస్ ఫినాకిల్, ఆటోమేషన్ సాయంతో నిపుణుల పర్యవేక్షణలో 20 శాతం అదనపు ఉత్పాదకతను సాధించిందని ఆయన వెల్లడించారు.
వేతనాల పెంపుపై త్వరలో ప్రకటన
వేతనాల పెంపుపై స్పందించిన సలీల్ పరేఖ్, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వేతన సమీక్షా ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. తదుపరి వేతన పెంపు గురించి సరైన సమయంలో ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.
-ఉద్యోగార్థులకు భవిష్యత్ మార్గం
ఇన్ఫోసిస్ తాజా ప్రకటన బహుళ జాతీయ సంస్థల్లో కొనసాగుతున్న ఉద్యోగాల క్షీణత మధ్య యువతకు నమ్మకాన్ని కలిగించేలా ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు. ఉద్యోగార్థులు ముఖ్యంగా AI, డేటా సైన్స్, ఆటోమేషన్ వంటి నూతన రంగాల్లో తమ నైపుణ్యాలను పెంపొందించుకుంటే భవిష్యత్ మరింత మెరుగ్గా ఉంటుందని ఈ ప్రకటన ద్వారా స్పష్టమవుతోంది.
