ఆటగాడు అన్వేష్ కోసం అన్వేషించాల్సిందే..ఇండియాకు రప్పించడం ఎలా?
అన్వేష్ టెక్నాలజీ పరంగా చాలా అప్ డేటెడ్. అది అతడి కంటెంట్ లోనూ కనిపిస్తుంది. అయితే, అతడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతోనే సమస్యంతా.
By: Tupaki Political Desk | 2 Jan 2026 4:20 PM ISTఆటగాడు ఆటగాడు అంటూ తన మాట తీరు.. తన వీడియోలు.. అందులోని కంటెంట్ తో సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఇన్ ఫ్లుయెన్సర్ అన్వేష్... ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర విమర్శల పాలవుతున్నారు. హిందూ దేవతలను దూషించిన అంశమై తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అతడిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు అన్వేష్ పై కేసుల్లో దర్యాప్తును హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు వేగిరం చేశారు. అతడి అభ్యంతరకర, అనుచిత వ్యాఖ్యల తాలూకా వీడియోలను ఆసాంతం పరిశీలించే పనిలో పడ్డాయి. అతడి సోషల్ మీడియా ఖాతాలపైనా ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే అన్వేష్ ఖాతాల తనిఖీకి సిద్ధమవుతున్నారు. అతడి యూజర్ ఐడీ వివరాలు కోరుతూ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్ స్టాగ్రామ్ కు లేఖ రాశారు. వారిచ్చే వివరాలతో అన్వేష్ ఖాతాలను పరిశీలించనున్నారు.
ఇమేజీ క్రమంగా డ్యామేజీ
అన్వేష్ టెక్నాలజీ పరంగా చాలా అప్ డేటెడ్. అది అతడి కంటెంట్ లోనూ కనిపిస్తుంది. అయితే, అతడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతోనే సమస్యంతా. దానికి క్షమాపణలు చెప్పాడా? లేదా? అన్నది పక్కనపెడితే కేసుల నమోదుతో పీకల దాకా కష్టాల్లో కూరుకున్నట్లే. ఇప్పటికే బెట్టింగ్ యాప్ ల విషయంలో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులపై అన్వేష్ తీవ్ర ఆరోపణలు చేశాడు. కొన్ని నెలల కిందట జరిగిన ఈ ఉదంతంలోనే అన్వేష్ ఇమేజీ డ్యామేజీ కావడం మొదలైంది. తాజాగా హిందూ దేవతల మీద వివాదాస్పద వ్యాఖ్యలతో తనకు మరింత చెడ్డపేరు వచ్చింది. ఇక్కడ అన్వేష్ కు కీలకం ఏమంటే అతడు క్రిమినల్, సైబర్ నేరాలకు పాల్పడకపోవడం. మత విశ్వాసాలను దెబ్బతీసేలా మాట్లాడినందుకు ఏమాత్రం చర్యలు ఉంటాయో చూడాలి.
మరో ఇమంది రవి..
తెలుగు పోలీసులకు ఆరేళ్లుగా సవాల్ విసిరిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి ఎట్టకేలకు దొరికాడు. అతడు ఓ దశలో తనను పట్టుకోవాలని సవాల్ విసిరాడు. దానిని అంతే తీవ్రంగా తీసుకున్న పోలీసులు.. చివరకు రవి ఆట కట్టించారు. అప్పటికీ ఇమంది రవి ఎక్కువగా విదేశాలకు తిరుగుతూ విదేశీ పౌరసత్వం కూడా ఉంది ఉన్నాడు. చివరకు పోలీసుల నిఘా ఫలించి వారికి చిక్కాడు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు అతడు స్నేహితుడికి పంపిన టెక్ట్స్ తో కథ ముగిసింది. ఇప్పుడు అన్వేష్ వంతు వచ్చింది. కానీ, ఇమంది రవి తరహాలో అన్వేష్ ను పట్టుకోవడం అంత సులభం కాదు.
ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు..?
ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మూడేళ్ల కిందట ప్రపంచ యాత్ర మొదలుపెట్టాడు. ఇప్పటికే 130 దేశాలు తిరిగిన అన్వేష్.. ప్రపంచ యాత్ర అంటే మరో 60కి పైగా దేశాలను చుట్టిరావాల్సి ఉంది. అలాఅలా తిరుగుతూ ప్రస్తుతం మలేసియాలో ఉన్నాడు. కొత్త సంవత్సరాన్ని అక్కడే జరుపుకొన్నాడు. దీనికిముందు థాయ్ ల్యాండ్ లో ఉన్నాడు. అక్కడికే తన తల్లిదండ్రులు, తమ్ముడిని పిలిపించుకున్నాడు. అంటే, భారత్ కు వచ్చే ఉద్దేశంలో అతడు లేడు. మరి అన్వేష్ ను రప్పించాలంటే పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందే. అతడి పాస్ పోర్ట్ పై బ్యాన్ విధించాలి. లుక్ ఔట్ నోటీసులు జారీచేయడం వంటి చర్యలు చేపడితే కానీ అన్వేష్ ను రప్పించే వీలుండదు.
