2050లో 1కోటి విలువ ఎంత? ఇలా అయితే బ్రతకడం కష్టమేనా?
ఎందుకంటే ఒకప్పుడు ఐదు, పది రూపాయలకు దొరికే వస్తువులు ఇప్పుడు వందల్లో ఉంటున్నాయి. వంద రూపాయల్లో దొరికే వస్తువులకు వేల రూపాయలు ఖర్చు చేయవలసి వస్తుంది.
By: Madhu Reddy | 15 Aug 2025 5:00 PM ISTడబ్బుంటేనే ప్రేమ.. ఆప్యాయత.. అనురాగాలు.. అన్నీ ఉంటాయి. డబ్బు లేకపోతే అసలు మనిషిని మనిషిలా కూడా చూడరు. ఎక్కడికి వెళ్లినా సరే అవమానిస్తూ ఉంటారు. అందుకే చాలామంది డబ్బు సంపాదించే వేటలో పడ్డారు. అయితే డబ్బు ఉంటే మనం ఎంత అహంకారంతో ప్రవర్తిస్తున్నాం..? ఎవరిని ఎలా చూస్తున్నాం? వంటి వాటిని అస్సలు పట్టించుకోరు. వాళ్ళు కోటీశ్వరులు.. వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది అనే విధంగానే చూస్తారు. అయితే కోట్లు కోట్లు కూడబెడుతున్న చాలామందికి ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఉదాహరణకు ఇప్పుడు మనం ఒక కోటి రూపాయలు జమ చేసుకుంటే అది మరో 25 సంవత్సరాల తర్వాత అంటే 2050 నాటికి లక్షలతో సమానం అవుతుందట. అవి ఎన్ని లక్షలో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.. అయితే మనం చిన్నప్పటినుండి చూస్తూ వస్తున్న కొన్ని వస్తువుల ధరలు గమనిస్తే మాత్రం షాక్ అవుతాం.
ఎందుకంటే ఒకప్పుడు ఐదు, పది రూపాయలకు దొరికే వస్తువులు ఇప్పుడు వందల్లో ఉంటున్నాయి. వంద రూపాయల్లో దొరికే వస్తువులకు వేల రూపాయలు ఖర్చు చేయవలసి వస్తుంది.ఇలా సంవత్సరాలు పెరుగుతున్నా కొద్దీ ఆ వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. అలాగే డబ్బులకు కూడా వ్యాల్యూ తగ్గిపోతుంది. ఒకప్పుడు ₹1000 డబ్బులు తీసుకువెళ్తే నెలకి సరిపడా సరుకులు వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం మిడిల్ క్లాస్ వాళ్లకు ఎంత తక్కువ తీసుకున్నా సరే ఖచ్చితంగా 5,6 వేలు పెట్టంది నెలవారి సరుకులు రావడం లేదు. అయితే దీనికి కారణం ద్రవ్యోల్బణం.. కాలం కదులుతున్న కొద్ది వస్తువులు, సేవల ధరలు పెరిగే రేటుని ద్రవ్యోల్బణం అంటారు. దీనివల్ల డబ్బు కొనుగోలు శక్తి క్రమంగా తగ్గుతుంది. అయితే చాలామంది పెట్టుబడి పెట్టేవాళ్ళు ఈ ద్రవయోల్బనాన్ని అర్థం చేసుకోక ఇబ్బందులు పడుతుంటారు.
ఇక ఉదాహరణకు చూసుకుంటే.. ఒక వ్యక్తి కోటి రూపాయలను దగ్గర పెట్టుకొని నా రిటైర్మెంట్ తర్వాత ఇవి సరిగ్గా సరిపోతాయని భావిస్తాడు. కానీ రిటైర్మెంట్ ఏజ్ కి వచ్చేసరికి వాళ్లు కూడబెట్టిన డబ్బు విషయంలో ద్రవయోల్బణం షాక్ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న ధరలు భవిష్యత్తులో ఉండవు. ఇప్పుడు ₹10 కి వచ్చేది భవిష్యత్తులో 100 రూపాయల అవుతుంది. అయితే ఇప్పుడు కోటి రూపాయల విలువ సరిగ్గా 25 సంవత్సరాల తర్వాత అంటే 2050లో కేవలం రూ.30 లక్షలతోనే సమానం. అయితే ఈ విషయాన్ని ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదించింది.
ఇప్పుడు కోటి రూపాయలకు వచ్చే వస్తువు విలువ 2050 నాటికి రూ.3.4 కోట్ల విలువ అవుతుందని ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ తెలిపింది. అలా ప్రస్తుత విలువ కోటి రూపాయలకు 5% ద్రవ్యోల్బణం యాడ్ చేస్తే 2050 నాటికి దాని విలువ రూ.30 లక్షలు మాత్రమే. అలా ఇప్పుడున్న మన కోటి రూపాయల డబ్బులు 2050లో రూ.30 లక్షలతో సమానం అని తేల్చేసింది.. ఇలా ద్రవ్యోల్బణం కారణంగా డబ్బు విలువ క్రమక్రమంగా తగ్గిపోతుంది. అలా మనం ఈ ఏడాది లక్ష రూపాయలతో నెలవారి ఖర్చులు ముగిస్తే.. 2050 సంవత్సరానికి కల్లా నెలకు రూ.3.38 లక్షల ఖర్చు వస్తుందట..
