ఫ్రెండ్స్ ఫ్లేషన్ తో దూరమవుతున్న యువత..
ధరల పెరుగుదలతో స్నేహితుల మధ్య దూరం పెరుగుతోంది. ధరల పెరుగుదలకు , స్నేహితుల మధ్య దూరం పెరగటానికి సంబంధం ఏంటని అనుకోవచ్చు.
By: A.N.Kumar | 18 Jan 2026 4:00 PM ISTధరల పెరుగుదలతో స్నేహితుల మధ్య దూరం పెరుగుతోంది. ధరల పెరుగుదలకు , స్నేహితుల మధ్య దూరం పెరగటానికి సంబంధం ఏంటని అనుకోవచ్చు. సంబంధం ఉంది. అది ఎలా అంటే.. ఇన్ ఫ్లేషన్ కారణంగా హోటల్ ధరలు, సినిమా టికెట్ ధరలు, ఇతర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. దీంతో ఏ చిన్న పార్టీ చేసుకోవాలన్నా, గెట్ టు గెదర్ అవ్వాలన్నా ఖర్చు తడిసి మోపెడవుతోంది. దీంతో అప్పటి వరకు పార్టీలు, ఫ్రెండ్స్ అని తిరిగిన యువత.. ఇప్పుడు చప్పుడు లేకుండా ఇంటికే పరిమితమవుతోంది. ఇన్ ఫ్లేషన్ కాస్తా ఫ్రెండ్స్ ష్లేషన్ అయింది.
ధరలు ఎందుకు పెరుగుతాయి ..
ధరల పెరుగుదలకు రకరకాల కారణాలు ఉన్నాయి. డిమాండ్ ఉండి.. సప్లై తక్కువ ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయి. అదే విధంగా ఉత్పత్తి వ్యయం పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి. దిగుమతి చేసుకున్న వస్తువుల వ్యయం పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి. ఆర్బీఐ నిర్ణయాల కారణంగా కూడా ధరలు పెరుగుతాయి. అయితే ధరల పెరుగుదలకు చాలా కారణాలు ఉన్నప్పటికీ.. ఆ ధరల పెరుగుదలకు సమానంగా ప్రజల ఆదాయం పెరగకపోవడంతో.. ప్రజలు ఖర్చులు తగ్గించుకుంటారు. ఇప్పుడు అదే విధంగా ధరల పెరుగుదల ప్రభావంతో యువత కూడా తమ ఖర్చులు తగ్గించుకుంటోంది. పార్టీలు, ఫ్రెండ్స్ కు దూరంగా ఉంటున్నారు. దీనిని సరదాగా ఫ్రెండ్ ఫ్లేషన్ అంటున్నారు.
ఫ్రెండ్స్ తో కలవకపోతే..
మనిషి సాంఘిక జీవి. ఇంకో మనిషితో ఏదో ఒక విధమైన బంధం లేకుండా జీవించలేడు. ఒంటరితనం మానసిక సంఘర్షణకు దారితీస్తుంది. కాబట్టి ధరల పెరుగుదలతో ఫ్రెండ్స్ కు దూరమైతే.. దాని ప్రభావం యువత మానసిక పరిస్థితిపైన దీర్ఘకాలంలో ఉంటుంది. ఒంటరితనం మరింత వ్యయంతో కూడిన భారమవుతుంది. సాంఘిక దూరం ఏర్పడుతుంది. దీని వల్ల టీవీలకు, సెల్ ఫోన్లకు పరిమితమవుతారు. ఇది ఇతర అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే.. వీటిని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎదుర్కోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా అవగాహన ద్వారా యువతను చైతన్యవంతం చేయాలని చెబుతున్నారు. అప్పుడే ఈ పరిస్థితిని ఎదుర్కోవచ్చని అంటున్నారు.
ప్రత్యామ్నాయం ఏంటి ..
యువత ధరల పెరుగుదలతో ఖర్చులకు వెనుకాడుతున్న సందర్భంలో .. తక్కువ ఖర్చులో మీటింగ్ లు ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పార్కులు, ఇంటి దగ్గరే ప్లాన్ చేసుకోవడం ద్వారా ఫ్రెండ్స్ కు దూరం కాకుండా ఉంటారు. అదే సమయంలో ఖర్చులు తగ్గించుకోగలుగుతారు. ఖర్చులు పెరుగుతాయని ఫ్రెండ్స్ కు దూరంగా ఉంటే సోషల్ డిస్టెన్స్ పెరిగి..మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు సూచిస్తున్నారు. సరిగ్గా ప్లాన్ చేసుకోవడం ద్వారా ఇన్ ఫ్లేషన్ ఎదుర్కోవచ్చని చెబుతున్నారు. ఈ పరిస్థితి మెట్రో నగరాల్లో కనిపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్కడ మిగిలిన పట్టణ ప్రాంతాలతో పోల్చితే ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ఫలితంగా యువత ఖర్చులు భరించలేక.. ఇంటికి పరిమితమవుతున్నారు.
