అదృశ్యమైన విమానం ఆచూకీ లభ్యమే కానీ...!
అవును... ఇండోనేషియాలో శనివారం అదృశ్యమైన విమానం శిథిలాలను అధికారులు తాజాగా గుర్తించారు.
By: Raja Ch | 19 Jan 2026 12:49 PM ISTఇండోనేషియాలో 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం అదృశ్యమైంది. ఇండోనేషియా ప్రధాన ద్వీపమైన జావా, సులవేసి ద్వీపాల మధ్య ఉన్న పర్వత ప్రాంతాన్ని సమీపిస్తుండగా విమానం గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాన్ని కోల్పోయిందని అధికారులు తెలిపారు. అయితే తాజాగా ఆ విమానం ఆచూకీ లభ్యమైంది. కాకపోతే అది పూర్తిగా శిథిలమైపోయి ఉంది. ఈ క్రమంలో బులుసరౌంగ్ పర్వతం వాలుపై చెల్లచెదురుగా విమాన శిథిలాలు కనిపించాయి. దీంతో 11 మంది మృతి చెంది ఉంటారని అంటున్నారు.
అవును... ఇండోనేషియాలో శనివారం అదృశ్యమైన విమానం శిథిలాలను అధికారులు తాజాగా గుర్తించారు. ఇదే సమయంలో శిథిలాల దగ్గర సుమారు 200 మీటర్ల లోతున ఉన్న లోయలో ఒక వ్యక్తి మృతదేహాన్ని రెస్క్యూ బృందం వెలికితీసింది. ఈ సందర్భంగా ఆ మృతదేహాన్ని తరలించే పని జరుగుతుందని మకాస్సర్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆఫీస్ హెడ్, మిషన్ కోఆర్డినేటర్ అయిన ముహమ్మద్ ఆరిఫ్ అన్వర్ తెలిపారు. ఇదే సమయంలో ఇతర భాగాలు, ప్రయాణికుల సీట్లను అధికారులు కనుగొన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ముహమ్మద్ ఆరిఫ్ అన్వర్... మృతదేహం ఎవరిదో ఇంకా గుర్తించబడలేదని తెలిపారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ దాని అప్రోచ్ అలైన్ మెంట్ ను సరిచేయమని ఆదేశించిన కొద్దిసేపటికే అది రాడార్ నుండి అదృశ్యమైందని తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎండా పూర్ణమా.. దక్షిణ సులవేసి ప్రావిన్స్ లోని మారోస్ లోని లియాంగ్-లియాంగ్ ప్రాంతంలో స్థానిక సమయం మధ్యాహ్నం 1:17 గంటలకు ఈ విమానం చివరిసారిగా ట్రాక్ చేయబడిందని తెలిపారు.
ఇదే సమయంలో.. చివరి ఏటీసీ సూచనల తర్వాత.. రేడియో సంబంధాలు తెగిపోయాయని.. కంట్రోలర్లు అత్యవసర విపత్తు దశను ప్రకటించారని పూర్ణిమా తెలిపారు. సముద్ర వ్యవహారాలు, మత్స్య మంత్రిత్వ శాఖకు చెందిన ఎనిమిది మంది సిబ్బంది.. ముగ్గురు ప్రయాణికులతో కూడిన విమానం సుల్తాన్ హసనుద్దీన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపం నుండి పక్కకు తప్పిందని భావిస్తున్న పర్వతాల చుట్టూ రెస్క్యూ బృందాలు తమ శోధనను కేంద్రీకరించాయని ఆమె చెప్పారు.
అదేవిధంగా... విమానం కనిపించకుండా పోయిన తర్వాత వైమానిక దళ హెలికాప్టర్లు, డ్రోన్లు, గ్రౌండ్ యూనిట్ల మద్దతుతో సెర్చ్ ఆపరేషన్ మొదలైందని, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయని.. బులుసారౌంగ్ పర్వతంపై హైకర్లు చెల్లాచెదురుగా ఉన్న శిథిలాలు.. ఇండోనేషియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ గుర్తులకు అనుగుణంగా ఉన్న లోగో, సంఘటన స్థలంలో చిన్న మంటలు మండుతున్నట్లు నివేదించిన తర్వాత శిథిలాలను గుర్తించారని వెల్లడించారు.
బలమైన గాలులు, భారీ పొగమంచు, నిటారుగా ఉన్న కఠినమైన భూభాగం కారణంగా సెర్చ్ ఆపరేషన్ కాస్త మందగించినప్పటికీ.. వైమానిక రెస్క్యూ బృందాలు శిథిలాల ప్రదేశం వైపు కదులుతూనే ఉన్నాయని దక్షిణ సులవేసి హసనుద్దీన్ మిలిటరీ కమాండర్ మేజర్ జనరల్ బాంగున్ నవోకో అన్నారు. 100 మందికి పైగా సిబ్బందితో కూడిన ఈ సెర్చ్ బృందాలు.. భారీ వర్షం, దట్టమైన పొగమంచును ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు.
