ఇండోనేషియాలో వ్యభిచారం చేసిన మహిళకు 100కొరడా దెబ్బలు
ఆ దేశంలోని బాలి లాంటి ప్రాంతంలో పూర్తి ఆధునికతతో కన్పిస్తుంది. అలాంటి దేశంలో ఇలాంటి కఠిన శిక్షలా? అన్న సందేహం రావొచ్చు. అయితే.. ఇక్కడే ఒక ట్విస్టు ఉంది.
By: Garuda Media | 19 Sept 2026 6:00 PM ISTఇండోనేషియా అన్నంతనే లిబరల్ గా ఉండే ముస్లిం దేశంగా పేరుంది. అలాంటి దేశంలోని ఒక ప్రావిన్స్ లో అమలయ్యే షరియా చట్టాల గురించి తెలిస్తే ఒళ్లంతా చెమటలు పట్టాల్సిందే. తాజాగా వ్యభిచారం చేస్తున్న మహిళను గుర్తించిన అక్కడి పోలీసులు ఆమెకు బహిరంగంగా 100కొరడా దెబ్బలు కొట్టటమే కాదు.. ఆమె విపరీతమైన బాధతో విలవిలలాడి స్ప్రహ కోల్పోయిన వైనం సంచలనంగా మారింది. అయితే.. ఈ ఉదంతం గురించి విన్నంతనే ఇండోనేషియాలో ఇలానా? అన్న షాక్ కు గురి కావొచ్చు. ఎందుకంటే.. ఆ దేశంలోని బాలి లాంటి ప్రాంతంలో పూర్తి ఆధునికతతో కన్పిస్తుంది. అలాంటి దేశంలో ఇలాంటి కఠిన శిక్షలా? అన్న సందేహం రావొచ్చు. అయితే.. ఇక్కడే ఒక ట్విస్టు ఉంది.
ఇండోనేషియా మొత్తం 38 ప్రావిన్స్ సమాహారం. మనం రాష్ట్రాలుగా పిలిచే వాటిని వారు ప్రావిన్స్ గా పిలుస్తుంటారు. ఈ 38 ప్రావిన్స్ లలో 9 ప్రావిన్స్ లకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ఉంది. ఇందులో అచె ప్రావిన్స్ లో మాత్రమే కఠినమైన ఇస్లాం షరియా చట్టాలను అమలు చేస్తుంటారు. ఈ ప్రావిన్స్ జనాభా 55 లక్షలుగా చెబుతారు. పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతానికి మరో ప్రత్యేకత ఉంది. అదేమంటే.. ఆగ్నేయాసియాలో ఇస్లాం మతం మొదట అచె ప్రావిన్స్ ద్వారానే ఆ దేశంలోకి ప్రవేశించిందన్న పేరుంది. అందుకే.. ఆ ప్రావిన్స్ ను మక్కా ముఖద్వారంగా పేర్కొంటారు.
ఈ కారణంగా అక్కడ షరియా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తారు. ఈ ప్రావిన్స్ లో షరియా చట్టాలు కఠినంగా అమలు చేస్తారు. పురుషుల విషయానికే వస్తే.. శుక్రవారం జరిగే ప్రత్యేక ప్రార్థనలకు ఏ పురుషుడైనా సరైన కారణం లేకుండా గైర్హజరు అయితే అతడికి కొరడా దెబ్బల్ని శిక్షగా విధిస్తారు. ఇలా శుక్రవారం ప్రార్థనలు చేయకుండా తప్పించుకునే వారిని గుర్తించేందుకు ప్రత్యేక వ్యవస్థ అక్కడ ఉంటుంది. అయితే.. బహిరంగంగా కొరడా దెబ్బల శిక్ష లేదంటే నిర్ణీత కాలం పాటు సామాజిక సేవను శిక్షగా విధిస్తారు.
మహిళల విషయానికి వస్తే.. హిజాబ్ తప్పనిసరి. బహిరంగంగా కౌగిలింతలు..ముద్దులు ఇక్కడ నిషిద్ధం. బీచ్ లలో బికినీలు వేసుకోకూడదు. చివరకు పెళ్లి కాని యువతీ యువకులు ఒకే హోటల్ గదిలో ఉండకూడదు. ఇక్కడి హోటళ్లలో బస చేయాలంటే తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ ను ఫ్రూప్ గా చూపించాల్సి ఉంటుంది. ఇక్కడి హోటళ్లలో తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించే ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. వ్యభిచారానికి పాల్పడినా.. ఒకే రూంలో భార్యభర్తలు కాకుండా మరే ఇతర సంబంధాలతో ఎలాంటి సెక్స్ చేయకుండా ఉన్నప్పటికి వారికి కొరడా దెబ్బల శిక్షలు తప్పవు. అంతేకాదు మద్యం సేవించినా.. జూదం ఆడినా.. గే సెక్స్ చేసినా కొరడా దెబ్బలు తప్పవు. అంతేకాదు.. మహిళలు టైట్ దుస్తులు ధరించటం కూడా నేరమే. అందుకు కొరడా దెబ్బల శిక్ష తప్పదు.
అయితే.. ఈ ప్రావిన్స్ లో ముస్లింలు.. హిందువులు.. క్రిస్టియన్లు నివసిస్తారు. ఈ షరియా చట్టం కేవలం ముస్లింలకు మాత్రమే వర్తిస్తాయి. ఇండోనేషియాలోని ఇతర ప్రావిన్స్ కు చెందిన ముస్లింలు ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టినంతనే వారికి కూడా ఇక్కడి నిబంధనలు వర్తిస్తాయి. విదేశీయులు సైతం ఈ ప్రావిన్స్ లో ఒళ్లు కనిపించకుండా నిండుగా దుస్తులు ధరించాల్సి ఉంటుంది. విదేశీ మహిళలకు హిజాబ్ ధరించాలన్న నియమం లేదు కానీ.. తగిన జాగ్రత్తలతో వ్యవహరించాల్సి ఉంటుంది.
ఈ ప్రావిన్స్ కు పూర్తి భిన్నంగా బాలి ప్రావిన్స్ ఉంటుంది. ఇక్కడి నైట్ లైఫ్ ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. బాలిలో ముస్లిం మహిళల మీద ప్రత్యేకంగా ఎలాంటి పరిమితులు ఉండవు. ఇక్కడి వారు ప్రాశ్చాత్య కల్చర్ తో కనిపిస్తారు. పార్టీయింగ్.. నైట్ లైఫ్ తో పాటు.. ఆంక్షలు అస్సలు లేని ప్రాంతంగా పేరుంది. ఒకేదేశంలో రెండు భిన్నమైన పార్శాలున్న దేశంగా ఇండోనేషియాను చెప్పాలి. ఇంతకూ ఈ అచె ప్రావిన్స్ ఎక్కడ ఉంది అంటే.. రాజధాని జకర్తాకు చాలా దూరంలో పశ్చిమాన చివరలో ఉంటుంది. జకర్తా నుంచి అచె ప్రావిన్స్ లోని బండ అచె కు వెళ్లాలంటే విమానంలో దాదాపు 2.45 గంటలు ప్రయాణించాల్సి ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే దాదాపు 2450కి.మీ. ప్రయాణించాల్సి ఉంటుంది. కనీసం రెండు రోజులకు పైనే డ్రైవ్ చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రావిన్స్ లో దశాబ్దాల తరబడి ప్రత్యేక దేశ పోరాటం జరుగుతోంది. దీనికి పరిష్కారంగా 2001-2005 మధ్య అక్కడి కేంద్ర ప్రభుత్వానికి స్థానిక గ్రూపులకు మధ్య ఒక ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఆ ప్రావిన్స్ కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. దీంతో.. అక్కడి వారు తమ సొంత షరియాచట్టాన్ని అమలు చేస్తుంటారు. విదేశీ పర్యాటకు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. దీనికి కారణం.. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డైవింగ్.. స్నార్కెలింగ్ కు అద్భుతమైన ప్రాంతం. ఇక్కడి స్వచ్ఛమైన నీరు.. పగడపు దిబ్బలు చూసేందుకు విదేశీ పర్యాటకలను పెద్ద ఎత్తున ఆకర్షిస్తుంటాయి. 2004లో సునామీ సృష్టించిన బీభత్సాన్ని ప్రతిబింబించే 'సునామీ మ్యూజియం', సముద్ర అలల ధాటికి కొట్టుకు వచ్చి ఊరి మధ్యలో పడిపోయిన ఒక భారీ విద్యుత్ నౌకను చూసేందుకు విదేశీ టూరిస్టులు ఇక్కడకు వస్తుంటారు.
తాజాగా వ్యభిచారం చేసి షరియా చట్టాన్ని ఉల్లంఘించిన నేరానికి ఒక మహిళకు బహిరంగంగా వంద కొరడా దెబ్బల శిక్షను విధించారు. సాధారణంగా 20-30కొరడా దెబ్బల్ని శిక్షగా విధిస్తారు. తాజాగా తీవ్రమైన శిక్ష విధించటం.. శిక్ష అమలు వేళ.. సదరు మహిళ తీవ్రమైన బాధతో చేతులు పైకెత్తి దయ చూపాలని వేడుకున్న వైనం సంచలనంగా మారింది. కొరడా దెబ్బలకు తాళ లేక ఆమె కాసేపటికే నేల మీద కుప్పకూలినట్లుగా చెబుతున్నారు. దీంతో శిక్ష అమలును కాసేపు ఆపి.. ఆమె కోలుకున్న తర్వాత మిగిలిన 60 కొరడా దెబ్బల శిక్షను విధించటం గమనార్హం. ఈ శిక్ష అమలు చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఆమె మాత్రమే కాదు.. అచెలో ఉన్న షరియా చట్టాన్ని ఉల్లంఘించినందుకు పదకొండు మందికి కొరడా దెబ్బల శిక్షల్ని విధించారు. అంతేకాదు.. పెళ్లి కాకుండానే స్త్రీ.. పురుషులు కలిసి ఉన్న నేరానికి 16-21 కొరడా దెబ్బల్ని శిక్షగా విధించారు.
బాలి లాంటి పక్కా టూరిస్టు ప్రాంతం.. అచె లాంటి కఠిన ప్రాంతం ఒకే దేశంలో ఉండటం విశేషం. ఇండోనేషియాకు తరచూ వెళ్లే ఎంతోమంది పర్యాటకులు.. ఒకవేళ అచెకు వెళ్లాలని డిసైడ్ అయితే మాత్రం ఒళ్లు దగ్గర పెట్టుకొని నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాంతానికి వెళ్లటానికి ముందు అక్కడి నిబంధనలు.. షరియా చట్టాల మీద పూర్తి అవగాహనతో వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే.. చిక్కుల్లో పడటం ఖాయం. బీకేర్ ఫుల్.
