ఆయనకు 74, ఆమెకు 24... కన్యాశుల్కం ఎన్ని కోట్లంటే...!
అవును... టార్మాన్ అనే 74 ఏళ్ల వ్యక్తి తన కంటే సుమారు 50 సంవత్సరాలు వయసులో చిన్నదైన మహిళను పెళ్లాడాడు. ప్రస్తుతం ఆమె వయసు 24 ఏళ్లుగా చెబుతున్నారు.
By: Raja Ch | 19 Oct 2025 7:45 PM ISTవివాహం విషయంలో వయసులో వ్యత్యాసాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సహజంగా వధువు కంటే వరుడి వయసు కాస్త ఎక్కువగా ఉండగా.. అరుదైన సందర్భాల్లో వధువు వయసు ఎక్కువగా ఉంటుంది. అది కూడా సింగిల్ డిజిట్ లోనే ఉంటుంది! అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వివాహంలో వరుడికి వధువుకి ఉన్న వయసు అంతరం 50 ఏళ్లు! ప్రస్తుతం ఈ వివాహం నెట్టింట హాట్ టాపిక్!
అవును... టార్మాన్ అనే 74 ఏళ్ల వ్యక్తి తన కంటే సుమారు 50 సంవత్సరాలు వయసులో చిన్నదైన మహిళను పెళ్లాడాడు. ప్రస్తుతం ఆమె వయసు 24 ఏళ్లుగా చెబుతున్నారు. పైగా... ఈ పెళ్లి కోసం ఆ యువతికి ఆ వ్యక్తి ఏకంగా రూ.2 కోట్లు కన్యాశుల్కం చెల్లించాడు. ఈ వివాహం ఇండోనేసియాలో జరగ్గా.. పలానా బ్యాంక్ వారి ఆర్థిక సహాయంతో అనే ప్రకటన ఇప్పుడు మరింత వైరల్ గా మారింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. అక్టోబర్ 1న తూర్పు జావాలోని పాసిటన్ రీజెన్సీలో విలాసవంతమైన వివాహం జరిగింది. అక్కడ వరుడు 74 ఏళ్ల టార్మాన్ గా గుర్తించబడగా.. వధువు షెలా అరికా (24)గా గుర్తించబడింది. ఈ వివాహం కోసం టార్మాన్ ఎదురు కట్నాన్ని బహిరంగంగా సమర్పించడం గమనార్హం.
ఫోటోగ్రాఫర్లకు డబ్బులు ఇవ్వలేదంట!:
వాస్తవానికి ఈ వివాహం ఈ స్థాయిలో వెలుగులోకి రావడం వెనుక ఓ కీలక కారణం ఉందంట. ఇందులో భాగంగా... వివాహం అనంతరం ఫొటోగ్రాఫర్ లకు మాత్రం డబ్బులు ఇవ్వకుండా ఈ జంట తప్పించుకున్నారట. దీంతో.. పెళ్లి అయిన తర్వాత తమకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించకుండా నవదంపతులు అదృశ్యమయ్యారని ఆ సంస్థ ఆరోపించింది.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారని అంటున్నారు. మరోవైపు.. ఈ వివాహం వద్దు అంటూ ఆ యువతిని తాము ముందే హెచ్చరించామని వధువు తరఫు బంధువులు చెబుతున్నారు. అయినప్పటికీ.. ఆమె తమ మాటలను పట్టించుకోలేదని అంటున్నారు.
బ్యాంకు వారి ఆర్థిక సహకారంతో..!:
ఈ వివాహం అనంతరం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న టార్మాన్.. సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా... తన వివాహం విషయంలో కన్యాశుల్కం నిజమైనదని.. అందుకు ఇండోనేషియాకు చెందిన బ్యాంక్ సెంట్రల్ ఆసియా (బీసీఏ) సహకారం అందించిందని ధృవీకరించారు. ఇదే సమయంలో.. వధువును విడిచిపెట్టాడనే వాదనలను కూడా అతను ఖండించాడు.
