Begin typing your search above and press return to search.

దేశంలో ఫ‌స్ట్ టైమ్‌.. ఇందిర‌ను మించి.. మోడీ 'భ‌క్తి'!

ఇది ఆ సేతు హిమాచ‌లం వ‌ర‌కు.. ఇందిర‌మ్మ హ‌యాంలో న‌డిచింది. ఇదే.. ఉమ్మ‌డి ఏపీలో తెలుగు వారి ఆత్మ‌గౌర‌వంగా నిన‌దించి.. టీడీపీ ఆవిర్భ‌వించింది.

By:  Garuda Media   |   17 Sept 2026 7:33 PM IST
దేశంలో ఫ‌స్ట్ టైమ్‌.. ఇందిర‌ను మించి..  మోడీ భ‌క్తి!
X

దేశాన్ని చాలా మంది ప్ర‌ధానులు పాలించారు. అయితే.. వారిలో ఇందిర‌మ్మ మాత్ర‌మే వ్య‌క్తిపూజ‌ల‌కు.. ప్ర‌శంస‌లకు ఒక ర‌కంగా చెప్పాలంటే భ‌జ‌న‌కు పెద్ద‌పీట వేసుకున్నారు. త‌న‌ను ప్ర‌శంసించేవారు.. త‌న పేరును ప‌ఠించే వారిని మాత్ర‌మే ఇందిర‌మ్మ చేరువ చేసేవారు. త‌న విష‌యంలో ఏ చిన్న తేడా వ‌చ్చినా.. ప‌క్క‌న పెట్టేవారు. ఇది ఆ సేతు హిమాచ‌లం వ‌ర‌కు.. ఇందిర‌మ్మ హ‌యాంలో న‌డిచింది. ఇదే.. ఉమ్మ‌డి ఏపీలో తెలుగు వారి ఆత్మ‌గౌర‌వంగా నిన‌దించి.. టీడీపీ ఆవిర్భ‌వించింది.

ఇక‌, ఇప్పుడు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ.. ఇందిర‌మ్మ‌ను మించిపోయారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఈ రోజు (గురువారం సెప్టెంబ‌రు 17) ప్ర‌ధాని మోడీ పుట్టిన‌రోజు 76వ వ‌సంతంలోకి ఆయ‌న అడుగు పెడుతున్నారు. అ యితే.. ప్ర‌ధాని పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబ‌రాలు చేయ‌డం.. అగ్ర నాయ‌కు లైన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడి నుంచి ప‌లువురు కేంద్ర మంత్రుల వ‌ర‌కు ర‌క్త‌దానాలు చేయ‌డం.. పాలాభిషేకాలు నిర్వ‌హించ‌డం వంటివి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఆల‌యాల్లో దేవుళ్ల‌కు పూజ‌లు కూడా చేస్తున్నారు.

ఇక‌, రాజ్యాంగ ప‌ద‌వుల్లో ఉన్న వారు సైతం.. ప్ర‌ధానిని ఆకాశానికి ఎత్తేశారు. కేంద్ర మంత్రుల నుంచి అధికారుల వ‌ర‌కు కూడా ప్ర‌ధానిని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. మోడీ పుట్టిన రోజును దేశానికి పులిమేశార‌నే చెప్పాలి. 2014కు ముందు.. త‌ర్వాత అన్న‌ట్టుగా.. మోడీ పాల‌నపై ప్ర‌శంస‌లు గుప్పించారు. ఆయ‌న పాల‌న‌తోనే దేశం ముందుకు సాగుతోంద‌న్నారు. ఇలా.. దేశంలో ఒక ప్ర‌ధాని పుట్టిన రోజును.. చేసుకోవ‌డం.. బ‌హుశ ఇదే తొలిసారి అయి ఉంటుంద‌ని ప‌లువురు చెబుతున్నారు.

సెల‌బ్రిటీలు సైతం..

ఇక‌, సెల‌బ్రిటీల విష‌యానికి వ‌స్తే.. వారు సైతం ప్ర‌ధానిని ఆకాశానికి ఎత్తేశారు. సబ్‌కా సాత్‌.. స‌బ్‌కా విశ్వాస్‌.. స‌బ్‌కా వికాస్‌.. స‌బ్‌కా ప్ర‌యాస్‌.. నినాదంతో దేశాన్ని న‌వ‌న‌వోమ్మేష మార్గంలో ముందుకు న‌డిపిస్తున్న దార్శ‌నిక నాయ‌కుడు.. ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అంటూ.. తెలుగు ప్ర‌ముఖుల నుంచి జాతీయ స్థాయి క్రికెట‌ర్ల వ‌ర‌కు ఆయ‌న‌ను ప్ర‌శంసించారు. విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యంగా దేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు న‌డిపించ‌డ‌మే కాకుండా.. గ‌త పాల‌కుల‌కు భిన్నంగా ప్ర‌జ‌లకు న‌చ్చిన‌.. ప్ర‌జ‌లు మెచ్చిన నేత‌గా వ‌రుస విజ‌యాలు సాధించి.. స‌రికొత్త రికార్డులు సృష్టించారని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.