తొలిసారి ప్రధానిగా ఇందిర...అద్భుతమే జరిగింది !
ఇక ఇందిరాగాంధీ తొలిసారి ప్రధాని అయింది సరిగ్గా ఇదే రోజు కావడం విశేషం. 1966 జనవరి 24న ఆమె భారత దేశానికి మూడో ప్రధానిగా తొలి మహిళా నేతగా పగ్గాలు అందుకున్నారు.
By: Satya P | 24 Jan 2026 1:34 PM ISTదేశానికి వన్ అండ్ ఓన్లీ లేడీ ప్రైమ్ మినిస్టర్ అంటే శ్రీమతి ఇందిరాగాంధీనే చెప్పుకోవాలి. ఆమె దేశానికి మొదటి ప్రధానిగా సేవలు అందించిన పండిట్ నెహ్రూ కూతురు కావడం ఒక అర్హత అని అంటారు, అలా అయితే నెహ్రూ 1964లో మరణించిన వెంటనే ప్రధాని కావాలి. కానీ అలా జరగలేదు, ఆమె తొలుత కేంద్ర మంత్రిగా పనిచేసి అనుభవం సంపాదించి ఆ మీదటనే దేశానికి ప్రధాని అయ్యారు. ఇక ఇందిరాగాంధీ తొలిసారి ప్రధాని అయింది సరిగ్గా ఇదే రోజు కావడం విశేషం. 1966 జనవరి 24న ఆమె భారత దేశానికి మూడో ప్రధానిగా తొలి మహిళా నేతగా పగ్గాలు అందుకున్నారు.
ఎంతో మంది కురు వృద్ధులు :
కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక మహా సముద్రం. అందులో ఎంతో మంది పెద్దలు కురు వృద్ధులు ఉన్నారు. వారంతా కూడా ఇందిరాగాంధీ కంటే వయసులోనూ అనుభవంలోనూ ఎంతో పెద్ద వారు, అంతే కాదు అనేక పర్యాయాలు కేంద్ర మంత్రులుగా కీలక శాఖలు చూసిన వారు ఉన్నారు. అయితే ఆ పెద్దలను సైతం తట్టుకుని ఇందిర ప్రధాని అయిపోయారు. ఇక 1966 జనవరి 10న తాష్కెంట్ పర్యటనలో ఉన్న ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి అనుమానస్పద స్థితిలో అక్కడే మరణించారు. ఆయన వారసుడు ఎవరు అన్న చర్చ జరిగినపుడు అనేక పేర్లు తెర ముందుకు వచ్చాయి. మొరార్జీ దేశాయ్ వంటి వారు కూడా రేసులో ఉన్నారు. అయితే అనూహ్యంగా ఇందిరాగాంధీ పేరుని కాంగ్రెస్ లో యంగ్ టర్క్ గా పేరు పొందిన టీం ముందుకు తెచ్చింది. అలా సీనియర్లు వెర్సెస్ జూనియర్ల మధ్య జరిగిన పోటీలో ఆశ్చర్యకరంగా ఇందిరాగాంధీ దేశానికి ప్రధాని అయ్యారు.
చిన్న వయసులోనే :
ఇందిరాగాంధీ ప్రధాని అయిన నాటికి ఆమె వయసు 45 ఏళ్ళే కావడం విశేషం. నెహ్రూ 1947లో ప్రధానిగా అయ్యే నాటికి ఆయన వయసు 58 ఏళ్ళు, లాల్ బహుదూర్ శాస్త్రి 1964లో ప్రధాని అయ్యేనాటికి ఆయన వయసు అచ్చంగా అరవై ఏళ్లు. కానీ వారి కంటే చాలా చిన్నదైన ఇందిరాగాంధీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇంకా రెండు దశాబ్దాలు కూడా నిండకుండానే ప్రధాని పగ్గాలు చేపట్టారు. అప్పటికి దేశం ఇంకా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆహారం కొరత పట్టి పీడిస్తోంది. నిరుద్యోగం సమస్య ఉంది. పారిశ్రామికంగా ఇంకా అడుగులు పడుతున్న నేపథ్యం ఉంది. మరో వైపు అప్పటికి నాలుగేళ్ళ క్రితమే చైనాతో యుద్ధంతో భారత్ ఓటమిని చూసి టిబెట్ ని పోగొట్టుకుంది. పాకిస్థాన్ సైతం కయ్యానికి పొంచి ఉంది. అమెరికా ఒత్తిళ్ళు ఉండనే ఉన్నాయి. దీంతో ఒక మహిళగా చిన్న వయస్కురాలిగా అనుభవం తక్కువగా ఉన్న నేతగా ఇందిర దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అన్న చర్చ అయితే అంతటా నడచింది.
తల్లకిందులు చేస్తూ :
అయితే అందరూ ఊహించినట్లుగా ఇందిరాగాంధీ పాలనలో కానీ నాయకత్వంలో కానీ ఎక్కడా ఫెయిల్ కాలేదు, ఆమె తనను తాను రుజువు చేసుకుంటూ దేశాన్ని విజయవంతంగా ముందుకు నడిపించారు. ఆమె ప్రధాని అయ్యాక చేసిన తొలి పని ఏంటి అంటే అన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులను పిలిపించి దేశం ఆహారం విషయంలో స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకోవడం, వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయడం, పారిశ్రామికంగా విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం, ఆమె హయాంలోనే అనేక సవాళ్ళను గట్టిగానే ఎదుర్కొన్నారు.
పాక్ ని గుణపాఠం :
భారత్ కి మహిళా ప్రధాని ఉన్నారని ఆ దేశం రాజకీయంగా సంక్షోభంలో పడుతుందని భావించి పాకిస్తాన్ 1965లో భారత్ మీద యుద్ధాన్ని ప్రకటించింది. అయితే ఇందిరాగాంధీ ఎంతో సాహసంగా ఆ యుద్ధంలో భారత్ సైన్యాన్ని ముందుకు నడిపించి పాక్ పీచమణచారు. అంతే కాదు దేశానికి తాను ఉన్నాను అని ఉక్కు మహిళగా భరోసా ఇచ్చారు. ఆమె హయాంలోనే 1971లో మరోసారి పాక్ యుద్ధానికి వస్తే ఆ యుద్ధంలోనూ భారత్ దే అద్భుత విజయం. ఆ విధంగా తన నాయకత్వ పటిమను ఇందిరాగాంధీ నిరూపించుకున్నారు. ఆమె తొలిసారిగా ప్రోఖ్రాన్ లో అణు పరీక్షలు జరిపి రక్షణ పరంగా భారత్ కి తిరుగులేదని చాటారు. గరీబీ హఠావో అన్న నినాదంతో ఆమె దేశంలో పేదరికం మీద పోరాడారు, అనేక సంక్షేమ పథకాలు దేశంలో పునాదులు వేసిన సంక్షేమ నేతగా చరిత్రలో నిలిచారు. ఆమె చూపిన బాటలోనే తరువాత కాలంలో అనేక రాష్ట్రాలు సంక్షేమ పధకాలు అమలు చేయడం ప్రారంభించాయి.
రికార్డు ఆమెదే :
ఇక ఏకధాటిగా 11 ఏళ్ళ పాటు ప్రధానిగా కొనసాగిన ఇందిరాగాంధీ 1977 మార్చిలో జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఓటమి చూశారు. అయితే మూడేళ్ళు తిరగకుండానే 1980లో తిరిగి ఆమె కాంగ్రెస్ ని విజయపధంలో నడిపించి మరో అయిదేళ్ళ పాటు ప్రధానిగా చేశారు. ఇలా 16 ఏళ్ళ పాటు ఆమె దేశానికి సేవలు అందించారు. చిత్రమేంటి అంటే ఇందిరాగాంధీ తరువాత మరో మహిళా ప్రధాని ఈ దేశానికి రాకపోవడం, అంతే కాదు ఆమె లాంటి ధీటైన నేత కూడా కాంగ్రెస్ కి దొరకకపోవడం.
